తెలంగాణ గ్రూప్-4 ఎగ్జామ్ పై ‘బలగం’ ఎఫెక్ట్.. కొంప ముంచిన గూగుల్ మ్యాప్
రాష్ట్ర వ్యాప్తంగా 8వేల 180 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్-4 పరీక్ష శనివారం జరిగింది. గత అనుభవాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని టీఎస్పీఎస్సీ ఈ పరీక్షకు పక్కాగా ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎగ్జామ్స్ కి 9 లక్షల 51 వేల 321 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు అభ్యర్థులు జనరల్ స్టడీస్ పరీక్ష రాయగా అనంతరం మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు సెక్రటేరియల్ ఎబిలిటీస్ పరీక్షలకు ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా టీఎస్పీఎస్సీ జాగ్రత్త పడింది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని టీఎస్పీఎస్సీ ప్రకటించడంతో.. 15 నిమిషాల ముందే పరీక్ష కేంద్రాల గేట్లను నిర్వాహకులు మూసివేశారు.
అనంతరం వచ్చిన వారినెవరిని కూడా పరీక్షా కేంద్రాల లోపలికి అనుమతించలేదు. మరోవైపు కొన్ని చోట్ల వివిధ రకాల కారణాలతో అభ్యర్థులు సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకోలేకపోయారు. దీంతో వారు ఏం చేయలేని పరిస్థితుల్లో నిరాశతో వెనుతిరగాల్సి వచ్చింది. హైదరాబాద్ కూకట్‌పల్లి వివేకానంద డిగ్రీ కాలేజీ సెంటర్‌కి కాస్త ఆలస్యంగా ఏడుగురు అభ్యర్థులు వచ్చారు. అధికారులు వారిని అనుమతించకపోవడంతో నిరాశతో తిరిగి వెనుతిరిగారు.
అలాగే నాచారంలో గ్రూప్ 4 పరీక్షా కేంద్రానికి ఇద్దరు అభ్యర్థులు లేటుగా వచ్చారు. నాచారం ప్రతిభ పాఠశాలకు నలుగురు అభ్యర్థులు పలు రకాల కారణాలతో లేట్‌గా వెళ్లారు. బాలనగర్‌లోని ఓ సెంటర్ వద్దకు ఇద్దరు, సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీకళాశాలకు ముగ్గురు, సంగారెడ్డి సెయింట్ ఆంటోని పాఠశాలకు ఆరుగురు అభ్యర్థులు, జోగిపేట ప్రభుత్వ కాలేజీలో ముగ్గురు అభ్యర్థులు ఆలస్యంగా రావడంతో పరీక్షకు హాజరుకాలేకపోయారు. ఆదిలాబాద్‌లో లేటుగా వచ్చిన 8 మంది అభ్యర్థుల్ని పరీక్ష హాల్లోకి విడిచి పెట్టకపోవడంతో తిరిగి వెళ్లిపోయారు.
గూగుల్ మ్యాప్ తో బోల్తా
చౌటుప్పల్‌లోని కృష్ణవేణి పాఠశాల సెంటర్ కోసం గూగుల్‌లో లొకేషన్ సెర్చ్ చేసుకొని పరీక్ష రాసేందుకు వచ్చిన గ్రూప్ 4 అభ్యర్థికి చివరికి నిరాశే మిగిలింది. మ్యాప్ చూపించిన లొకేషన్‌కు చేరుకోగా అది సరైన అడ్రస్ కాదని, తప్పు అడ్రస్ అని తేలింది. ఆఖరి నిముషంలో ఎట్టకేలకు ఆగమేఘాల మీద సరైన చిరునామాకు వెళ్లగా.. నిమిషం ఆలస్యమై పరీక్షను జస్ట్ మిస్ అయ్యారు.
ట్రైన్ ఆలస్యం.. ఆందోళన చెందిన అభ్యర్థులు…
ఖమ్మం జిల్లా కారేపల్లి రైల్వే స్టేషన్లో సాంకేతిక లోపంతో సికింద్రాబాద్ మణుగూరు సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రెండు గంటల పాటు నిలిచిపోయింది. దీంతో ఇందులో ఉన్నటువంటి గ్రూప్-4 పరీక్ష రాసే అభ్యర్థులు ఆందోళన చెందారు. ఈ క్రమంలో ప్రైవేటు వాహనాలను ఆశ్రయించి కొందరు.. అదే ట్రైన్లో టెన్షన్ టెన్షన్ వాతావరణంలో మరికొందరు సమీప పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు.
సెల్‌ఫోన్‌తో ఎగ్జామ్ హాల్లోకి
టీఎస్పీఎస్సీ నిర్వహించిన గ్రూప్-4 పరీక్షలో ఓ అభ్యర్థి సెల్‌ఫోన్‌తో అడ్డంగా బుక్కయ్యాడు. అధికారులకు పట్టుబడ్డాడు. రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్ మండలం మారుతినగర్‌లోని ఓ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో ఓ అభ్యర్థి సెల్‌ఫోన్‌తో పరీక్షా కేంద్రానికి వెళ్లాడు. పరీక్ష స్టార్ట్ అయిన అరగంట తర్వాత గమనించిన ఇన్విజిలేటర్ పై అధికారులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న అధికారులు.. అతని సెల్‌ఫోన్ ని సీజ్ చేసి మాల్ ప్రాక్టీస్ కింద ఆ అభ్యర్థిపై కేసు నమోదు చేశారు. సదరు అభ్యర్థిని సమగ్ర విచారణ నిమిత్తం పోలీసులకు అప్పగించినట్లు జిల్లా కలెక్టర్ హరీశ్ వెల్లడించారు. ఈ ఘటన మినహా జిల్లా వ్యాప్తంగా ఉదయం సెషన్లో జరిగిన గ్రూప్-4 పేపర్-1 పరీక్ష అంతా కూడా ప్రశాంతంగా జరిగిందన్నారు.
ఇకపోతే డైరెక్టర్ వేణు దర్శకత్వంలో వచ్చిన బలగం సినిమా ఎఫెక్ట్ టీఎస్పీఎస్సీ నిర్వహించిన గ్రూప్-4 పరీక్షపై పడింది. పేపర్ -1లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అనేక ప్రశ్నలు రాగా.. ఈ మధ్య కాలంలో మంచి ఆదరణ లభించిన ‘బలగం’ చిత్రం నుంచి ఒక ప్రశ్న అడిగారు. ‘బలగం సినిమాకి సంబంధించి కింది జతలలో ఏవి సరైనవి అంటూ.. మూవీ ప్రొడ్యూసర్, డైరెక్టర్, సంగీత దర్శకుడు, కొమరయ్య పాత్ర పేర్లను ప్రస్తావించారు.
ఈ విధంగా టీఎస్పీఎస్సీ గ్రూప్-4 పరీక్షలో బలగం మూవీపై ప్రశ్న రాగా.. కొందరు అభ్యర్థులు వివిధ కారణాలతో పరీక్ష కేంద్రానికి ఆలస్యంగా రావడంతో.. వారిని నిర్వాహకులు అనుమతించలేదు. దీంతో వారు నిరాశతో వెనుతిరిగారు. ఇంకొందరు రకరకాల కారణాలతో ఎగ్జామ్ హాల్ కి లేటుగా రావడంతో వారిని కూడా పరీక్ష రాయనివ్వలేదు. అలాగే పరీక్ష హాల్ కి ఫోన్ తెచ్చిన ఓ అభ్యర్థిని అధికారులు పట్టుకుని.. అతని సెల్‌ఫోన్ ని సీజ్ చేసి మాల్ ప్రాక్టీస్ కింద ఆ అభ్యర్థిపై కేసు నమోదు చేశారు. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ ఘటనలు మినహా తెలంగాణ వ్యాప్తంగా గ్రూప్-4 పరీక్ష ప్రశాంతంగా జరిగింది............
Jul 02 2023, 12:48