నేడే పొడు పట్టాల పంపిణీ
ఆసిఫాబాద్ జిల్లా:జూన్ 30
తెలంగాణ పోడు పట్టాల పంపిణీపై నాలుగేళ్ళుగా నడుస్తున్న కసరత్తు కొలిక్కి వచ్చింది. రాష్ట్రం మొత్తంమీద సుమారు 11.5 లక్షల ఎకరాలు ఉన్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. కానీ ఇప్పుడు పంపిణీ చేయడానికి జాబితాను సిద్ధం చేసింది మాత్రం నాలుగు లక్షల ఎకరాలకే. మిగిలినవారికి ఎప్పుడు అందుతాయన్నదానికి అధికారుల నుంచి సమాధానం లేదు. ఈ ఒక్క ఫేజ్‌తోనే ఈ ప్రక్రియ ఆగిపోతుందా?.. లేక మరికొన్ని విడతల్లో మొత్తం అర్హులందరికీ ప్రభుత్వం నుంచి పట్టాలు అందుతాయా అన్నది అంతుచిక్కడంలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసిఫాబాద్ జిల్లాలో శుక్రవారం మధ్యాహ్నం పట్టాల పంపిణీని ప్రారంభించనున్నారు. ఈ జిల్లాలో మొత్తం 15,254 మంది లబ్ధిదారులకు 44,750 ఎకరాల మేర పోడు భూములకు పట్టాల పంపిణీ జరగనున్నది.
రాష్ట్రం ఆవిర్భవించే సమయానికి పోడు సాగుపై ఆధారపడి జీవిస్తున్న ఆదివాసీ, గిరిజన కుటుంబాలకు పట్టాలను పంపిణీ చేయాలని నిర్ణయించామని ముఖ్యమంత్రి కేసీఆర్ పలు సందర్భాల్లో పేర్కొన్నారు. అటవీ, రెవెన్యూ శాఖల నుంచి పూర్తి వివరాలు ప్రభుత్వానికి అందాయని, మొత్తం 11.5 లక్షల ఎకరాలుగా తేలిందని వివరించారు. ఇకపైన పోడు నరకబోమంటూ గ్రామ సభల్లో తీర్మానం చేయడంతో పాటు ప్రభుత్వానికి లబ్ధిదారులు అండర్‌టేకింగ్ ఇవ్వాలని, ఆ తర్వాతనే పట్టాలను ఇస్తామని, ఒకవేళ ఆ తర్వాత అడవిని నరికితే పట్టాలను రద్దు చేస్తామని అసెంబ్లీ సమావేశాల్లోనే సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. కానీ ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశంలో మాత్రం 4.05 లక్షల ఎకరాలకే నిర్ణయం జరిగింది. మిగిలిన భూమికి ఎప్పుడు పట్టాలు వస్తాయన్నదానికి అధికారులకూ స్పష్టత లేదు.
చివరి గంటల్లో జాబితాలో మార్పులు
ప్రతీ జిల్లాలో ఎన్ని ఎకరాలకు, ఎంతమంది లబ్ధిదారులకు పోడు పట్టాలను పంపిణీ చేయాలో ప్రభుత్వం ముందుగానే జాబితాను సిద్ధం చేసింది. ఆ ప్రకారం అత్యధికంగా కొత్తగూడెం జిల్లాలో 1.51 లక్షల ఎకరాలను 50,595 మంది లబ్ధిదారులకు ఇచ్చేలా లిస్టు తయారైంది. ఆ తర్వాతి స్థానాల్లో మహబూబాబాద్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, ములుగు, నిర్మల్, ఖమ్మం తదితర జిల్లాలు ఉన్నాయి. అతి తక్కువగా పెద్దపల్లి జిల్లాలో ముగ్గురు లబ్ధిదారులకు కలిపి కేవలం ఒక్క ఎకరం మాత్రమే మూడు పట్టాల రూపంలో పంపిణీ కానున్నది. ఆ తర్వాతి స్థానంలో నారాయణపేటలో ముగ్గురికి 8 కరాలు, జగిత్యాలలో 15 మందికి 19 ఎకరాలు, మహాబూబ్‌నగర్‌లో 19 మందికి 22 ఎకరాల చొప్పున పంపిణీ కానున్నది.
నాగర్‌కర్నూల్ జిల్లా అచంపేట నియోజకవర్గ పరిధిలోని తండాల్లో బుధవారం రాత్రి వరకూ లిస్టులో ఉన్న పేర్లు గురువారం రాత్రికి మాయమయ్యాయని, దీని గురించి ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ దగ్గర కూడా క్లారిటీ లేదని ఆ గ్రామస్తులు మొత్తుకున్నారు. జాబితాలో పేర్లు ఎందుకు మారాయో తమకు కూడా తెలియదని, ఉన్నతాధికారుల నుంచి ఈ లిస్టు వచ్చిందని, చివరి గంటల్లో పేర్లలో ఎందుకు మార్పులు చోటుచేసుకున్నాయో తమకు తెలియదని బదులిచ్చినట్లు తెలిపారు. కోరుట్ల నియోజకవర్గ పరిధిలోని మెట్‌పల్లిలో సైతం గిరిజనులు సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించి పేర్లు మారడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేను నిలదీయడానికి వెళ్ళినా అక్కడ ఆయన లేకపోవడంతో రోడ్డు మీద నిరసన తెలపాల్సి వచ్చింది. కేసీఆర్ తండా, ఏఎస్ఆర్ తండాలకు చెందిన 200 మందికిపైగా దరఖాస్తు చేసుకున్నా తొలుత ఎంపిక చేసినట్లు ప్రకటించి చివరకు పరిశీలించే ప్రాసెస్‌లో అర్హత లేదని తేలిందనే సమాధానాన్ని ఇచ్చారని స్థానికులు తెలిపారు.
సాగులో ఉన్న మొత్తం పోడు భూమికి పట్టాలను ఇస్తామని చెప్పినా చివరకు రెండొంతులకు కోత పెట్టి ఒక్క వంతుకు మాత్రమే ప్రభుత్వం పరిమితం చేసిందని, చివరు ఆ జాబితాలోనే స్థానికంగా ఉన్న అధికార పార్టీ లీడర్లు పేర్లను మార్చారన్న ఆరోపణలు వినిపించాయి. లబ్ధిదారులను ఎంపిక చేయడంలో అధికారులకు బదులుగా అధికార పార్టీకి చెందిన నేతలే పెత్తనం చేస్తున్నారని ఇంతకాలం ఉన్న సాధారణ విమర్శలు వచ్చాయి. ఇప్పుడు వాటికి బలం చేకూరే విధంగా ఇప్పుడు పోడు భూముల జాబితాలో పేర్లు గల్లంతు కావడం ఆదివాసీ, గిరిజన రైతుల్లో ఆగ్రహానికి కారణమైంది. గొత్త కోయలకు పట్టాలు ఇచ్చే ప్రసక్తే లేదని ప్రభుత్వం తేల్చి చెప్పడంతో కొత్తగూడెం జిల్లాలో ఎలాంటి గందరగోళం చోటుచేసుకుంటుందనే అనుమానాలు తలెత్తుతున్నాయి.....
Jun 30 2023, 09:55