లాంగ్ కొవిడ్‌తో గుండె, ఊపిరితిత్తుల సమస్యలు అధికం
వాషింగ్టన్: కొవిడ్-19 ఉద్ధృతి తగ్గుముఖం పడుతున్నప్పటికీ.. ప్రజారోగ్యంపై అది మిగిల్చిన గాయాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇన్‌ఫెక్షన్ సోకిన ఏడాది తర్వాత దీర్ఘకాల కొవిడ్ బాధితులకు మరణం ముప్పు ఎక్కువని తాజా అధ్యయనం పేర్కొంది..
వీరు గుండె, ఊపిరితిత్తుల సమస్యల బారినపడొచ్చని వివరించింది. అమెరికాలో నిర్వహించిన ఈ అధ్యయన వివరాలు ప్రముఖ వైద్య పత్రిక 'జామా హెల్త్ ఫోరమ్'లో ప్రచురితమయ్యాయి.
పరిశోధనలో భాగంగా బీమా క్లెయిమ్‌ల డేటాను శాస్త్రవేత్తలు విశ్లేషించారు. దీర్ఘకాల కొవిడ్ బాధితుల్లో మరణం ముప్పు 2.8 శాతంగా ఉందని, ఈ రుగ్మత లేనివారిలో అది 1.2 శాతంగా ఉందని తేల్చారు. లాంగ్ కొవిడ్ బాధితులకు గుండె లయలో తేడాలు, పక్షవాతం, గుండె వైఫల్యం, హృద్రోగం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం రెండు రెట్లు ఎక్కువని శాస్త్రవేత్తలు తెలిపారు..
![]()
వారికి ఊపిరితిత్తుల సమస్యలూ అధికమని వివరించారు. ఊపిరితిత్తుల్లోని రక్తనాళాల్లో గడ్డలు ఏర్పడే (పల్మనరీ ఎంబోలిజమ్) ముప్పు మూడు రెట్లు, సీవోపీడీ, ఒక మోస్తరు నుంచి తీవ్రస్థాయి ఉబ్బసం ప్రమాదం రెట్టింపు స్థాయిలో ఉంటుందని తేల్చారు. కొవిడ్ ఇన్‌ఫెక్షన్ సోకిన నెలలోపు ఆసుపత్రిపాలైన వారికి ఆరోగ్య సమస్యలు ఎక్కువని పరిశోధకులు వివరించారు. కొవిడ్ బారినపడిన నాలుగు వారాల తర్వాత కూడా కొత్తగా ఆరోగ్య సమస్యలు తలెత్తడం లేదా పాతవి కొనసాగడాన్ని లాంగ్ కొవిడ్‌గా పేర్కొంటున్నారు.
Mar 05 2023, 17:12