ప్రజల సౌకర్యార్థం 144 సెక్షన్ సడలింపు : జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే


సెప్టెంబర్ 7, 2024: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూర్ మండల కేంద్రంలో జరిగిన ఘటన నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణ కొరకు విధించిన 144 సి.ఆర్.పి.సి. సెక్షన్ అమలులో ప్రజల సౌకర్యార్థం సడలింపు ఇవ్వడం జరిగిందని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే ఒక ప్రకటనలో తెలిపారు. వినాయక చవితి, మిలాద్-ఉన్-నబి పండుగల నేపథ్యంలో నిత్యవసరాల కొరకు ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుండి 7 గంటల వరకు సడలింపు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఘటన నేపథ్యంలో నిలిపివేసిన ఇంటర్నెట్ సేవలను జైనూర్, కెరమెరి, సిర్పూర్ (యు), లింగాపూర్, వాంకిడి, తిర్యాణి మండలాలు మినహా జిల్లాలోఅందించడం జరుగుతుందని తెలిపారు. ప్రజలు ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకొని మత సామరస్యంతో శాంతి భద్రతల పరిరక్షణలో సహకరించాలని కోరారు.

జైనూర్ ఘటనపై అందరూ సంయమనం పాటించాలి : అదనపు డి జి


ఆసిఫాబాద్ జిల్లా: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జిల్లాలోని జైనూర్ మండలంలో జరిగిన ఘటనపై అందరూ సంయమనం పాటించాలని అదనపు డి. జి. (లా అండ్ ఆర్డర్) మహేష్ భగవత్ అన్నారు. గురువారం ఐ.జి. చంద్రశేఖర్, జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, జగిత్యాల, సిరిసిల్ల, ఆదిలాబాద్ జిల్లాల ఎస్.పి. లు అశోక్ కుమార్, అఖిల్ మహాజన్, గౌస్ ఆలం, జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి, బాలానగర్ డి. సి. పి. సురేష్ కుమార్ లతో కలిసి జిల్లాలోని జైనూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ముస్లిం మత పెద్దలతో, ఉట్నూర్ లోని కొమురంభీం కాంప్లెక్స్ లో ఆదివాసి పెద్ద మనుషులతో వేరువేరుగా జైనూర్ ఘటనపై సంయమనం పాటించాలని కోరుతూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు డి. జి. (లా అండ్ ఆర్డర్) మాట్లాడుతూ జిల్లాలోని జైనూర్ మండలంలో ఆదివాసి మహిళపై దాడి జరగడం బాధాకరమని, ఆదివాసి యువత, ప్రజలు, ముస్లిం సోదరులు ఈ ఘటనపై సమయమనం పాటించాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకూడదని తెలిపారు. బాధిత మహిళలకు ప్రభుత్వం తరపున అండగా ఉంటామని, వైద్య చికిత్స ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని, కుటుంబ సభ్యులు సహకరించాలని తెలిపారు. ఈ ఘటనలో జరిగిన ఆస్తి నష్టంపై పూర్తిస్థాయి నివేదిక అందించేందుకు కాగజ్ నగర్ డి. ఎస్. పి. కరుణాకర్ ను ప్రత్యేక అధికారిగా నియమించడం జరిగిందని, జరిగిన నష్టంపై పారదర్శకమైన నివేదిక అందించాలని, తద్వారా బాధితులకు నష్టపరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఘటన సంబంధిత విషయంపై పెద్దమనుషుల సూచనలు, సలహాలు స్వీకరించి ప్రజా ఉపయోగకర చర్యలు తీసుకుంటామని, ఆదివాసీలు, ముస్లిం సోదరులు కలిసిమెలిసి ఉండాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు పాల్పడకుండా శాంతియుతంగా ఉండాలని, అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని తెలిపారు. 

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బాధిత మహిళపై లైంగిక వేధింపులు, హత్యాయత్నానికి పాల్పడిన సందర్భంలో తుడుం దెబ్బతో సహా ఆదివాసీ సంస్థలు బంద్ పిలుపునివ్వగా బంద్‌ను బాధ్యతాయుతంగా నిర్వహించేందుకు 2 వర్గాలతో చర్చించడం జరిగిందని తెలిపారు. ఒక్కసారిగా పరిస్థితి 2 వర్గాల మధ్య ఘర్షణగా మారి ఆదివాసీలు ఇతర వర్గాల ఆస్తులపై దాడి చేయడంతో ఇతర వర్గాల నుండి ప్రతీకార చర్యగా దహనం, రాళ్లు రువ్వడం, ఆస్తుల నష్టం మొదలైన వాటికి దారితీసిందని, ఈ నేపథ్యంలో జిల్లా ఎస్. పి. తన బృందంతో మొదట స్పందించి, పొరుగున ఉన్న ఆదిలాబాద్, మంచిర్యాల, సిరిసిల్ల, జగిత్యాల జిల్లాలు, టి.జి.ఎస్‌.పి. ప్లాటూన్‌ల నుండి అదనపు బలగాలతో తన శాయశక్తులా ప్రయత్నించారని, పొరుగు జిల్లాల ఎస్.పి.లు/డి.సి.పి.లు కూడా పరిస్థితిని అదుపు చేయడంలో తమ సహకారం అందించారని తెలిపారు. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు మొత్తం 1000 మందికి పైగా పోలీసులను మోహరించారని, ఆర్.ఎ.ఎఫ్. మోహరింపబడుతోందని, రాష్ట్ర డి.జి.పి., ఎ. డి. జి. (లా & ఆర్డర్), నార్త్ జోన్ ఐ.జి. నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని, నిషేధిత కర్ఫ్యూ ఆదేశాలు 144 సి.ఆర్. పి.సి. / 163 బి.ఎన్.ఎస్.ఎస్. జిల్లా యంత్రాంగం జారీ చేసిందని, నిషేధాజ్ఞలను ఉల్లంఘించవద్దని తెలిపారు. పుకార్లు, తప్పుడు వార్తలు వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్త చర్యగా ఆయా ప్రాంతాల్లో ఇంటర్నెట్‌పై నిషేధాన్ని అమలు చేయడం జరుగుతుందని, ప్రభావిత ప్రాంతంలో నిషేధాజ్ఞల ప్రకటనతో పాటు ఫ్లాగ్ మార్చ్ చేస్తున్నారని, ఆత్మవిశ్వాసం నింపేందుకు పికెట్లు పెడుతున్నారని, ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దహనం, హింసాత్మక ఘటనలపై దర్యాప్తు ప్రారంభించి నేరస్తులను గుర్తించి చట్ట ప్రకారం వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. హింస సమయంలో జరిగిన ఆస్తి నష్టం అంచనా వేయబడుతుందని, తదుపరి అవసరమైన చర్య కోసం ప్రభుత్వానికి నివేదిక అందించడం జరుగుతుందని, హత్యాయత్నంతో లైంగిక వేధింపుల కేసులో ఇప్పటికే నిందితులను జైనూర్ పోలీసులు అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించినందున అందరూ సంయమనం పాటించాలని కోరారు. గాంధీ ఆసుపత్రిలో బాధితురాలికి వైద్య చికిత్స కొనసాగుతోందని, అన్ని చికిత్స ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని, బాధితురాలికి ఇప్పటికే 1 లక్ష రూపాయల పరిహారం అందించడం జరిగిందని తెలిపారు. వదంతులను నమ్మవద్దని, ఎలాంటి నిజం లేకుండా రెచ్చగొట్టే సోషల్ మీడియా పోస్ట్‌లను ప్రసారం చేస్తే శిక్షార్హమైన చర్య తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఏదైనా అత్యవసర పరిస్థితి కోసం ప్రజలు డయల్ 100ని సంప్రదించవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమాలలో సంబంధిత అధికారులు, ఆదివాసి సంఘాల ప్రతినిధులు, ముస్లిం మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

ఉధృతంగా ప్రవహిస్తున్న వార్ధా నది..! ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎమ్మెల్యే.

ఆసిఫాబాద్ జిల్లా: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ (టి) మండలం వెంకట్రావ్ పేట మహారాష్ట్రలోని రాజురా తాలూకా పొడ్సా మధ్యలో ఉన్న అంతర్రాష్ట్ర వారధిపై నుంచి ప్రవహిస్తున్న వార్ధా నదిని సిర్పూర్ ఎమ్మెల్యే డా.పాల్వాయి హరీష్ బాబు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వార్ధా నది పరివాహక ప్రాంతంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, రాబోయే రెండు రోజులు ఈ వరద కొనసాగే అవకాశం ఉందని, వార్దా నది వరదల వలన సిర్పూర్ కౌటాల మండలాల్లోని కొన్ని గ్రామాల్లో పంట నష్టం జరిగిందని, వరద పోటు తగ్గిన తర్వాత వ్యవసాయ అధికారులు పంట నష్టాన్ని అంచనా వేస్తారని తెలిపారు. ప్రభుత్వం నుండి పంట నష్టం వచ్చే విధంగా కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఎల్ములె శంకర్, నీరటి సత్యనారాయణ, నేరెళ్ల అశోక్, వొడ్డేటి నాని, నులిగొండ రాజశేఖర్, మహేష్, దివాకర్, రాచర్ల మహేష్, దుర్గం ప్రశాంత్, సాయి భనర్కార్, జావిద్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీలో పలువురి చేరిక.
కొమురం భీం అసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలో మంగళవారం రోజున కాంగ్రెస్ పార్టీ గూటికి పలువురు బిఆర్ఎస్ పార్టీ తాజా మాజీ ప్రజాప్రతినిధులు, యువకులు, కార్యకర్తలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ సమక్షంలో చేరారు.కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇట్యాల మాజీ ఎంపీటీసీ గజ్జెల సురేష్ జయ లక్ష్మి అధర్వంలో ఏర్పాటు చేసిన సమావేశంలో దేహగాం మండలంలోని ఇట్యాల,రాళ్లవాగు,బోర్ల కుంట, కోత్ మీర్,గొర్రె గుట్ట గ్రామాలనుండి పలువురు మాజి ఎంపీపీ, తాజా మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, యువకులు పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పిల్లల శంకరయ్య,మాజీ సర్పంచ్ లు మురళీ, రాంటెంకి మల్లేష్,పెద్ది శ్రీనివాస్, రైతు కమిటీ అధ్యక్షుడు కొండ్ర జగ్గ గౌడ్, ఉప సర్పంచ్ ఎస్కే షారిప్,బిఆర్ఎస్ యూత్ ఉప అధ్యక్షుడు సిద్ధం సంతోష్ తదితర పార్టీ కార్యకర్తలు,నాయకులు కాంగ్రెస్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు రాష్ట్రాలకు వెంకయ్యనాయుడు రూ.10 లక్షల సాయం.

తెలంగాణ/ఆంధ్రప్రదేశ్ :  తెలుగు రాష్ట్రాలకు వెంకయ్యనాయుడు రూ.10 లక్షల సాయం తెలుగు రాష్ట్రాల్లో వరదలపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. తన పెన్షన్ నుంచి 2 రాష్ట్రాల సీఎం సహాయ నిధికి రూ.5 లక్షల చొప్పున పంపినట్లు తెలిపారు. అలాగే తన కుమారుడు హర్షవర్దన్ నిర్వహిస్తున్న ముప్పవరపు ఫౌండేషన్ నుంచి రూ.2.5 లక్షల చొప్పున, తన కుమార్తె దీపా వెంకట్ నిర్వహిస్తున్న స్వర్ణభారత్ ట్రస్ట్ నుంచి రూ.2.5 లక్షల చొప్పున సాయం చేసినట్లు వెల్లడింంచారు.
అంగన్వాడి కేంద్రాలలో మౌలిక సదుపాయాల కల్పన ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలి : జిల్లా అదనపు కలెక్టర్

అంగన్వాడి కేంద్రాలలో మౌలిక సదుపాయాల కల్పన ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలి:  జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి

సెప్టెంబర్ 2, 2024 : ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, పిల్లల సంక్షేమానికి అనేక చర్యలు తీసుకుంటుందని, ఇందులో భాగంగా అంగన్వాడి కేంద్రాలలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని  జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి అన్నారు. సోమవారం జిల్లాలోని పెంచికల్ పేట మండలం పోతేపల్లి అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి రిజిస్టర్, పరిసరాలు, పిల్లలకు అందిస్తున్న పోషక ఆహారం నిల్వలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ అంగన్వాడి కేంద్రాల ద్వారా పిల్లల సంరక్షణకు కృషి చేయడం జరుగుతుందని, ఈ నేపథ్యంలో అంగన్వాడీ కేంద్రాలలో మరుగుదొడ్లు, మూత్రశాలలు, త్రాగునీరు, విద్యుత్ సరఫరా ఇతర మౌలిక సదుపాయాల కల్పన ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని గిరిజన సంక్షేమ శాఖ ఏ.ఈ. ను ఆదేశించారు. సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా పాటించవలసిన జాగ్రత్తలపై పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
పేకాట స్థావరంపై పోలీసుల దాడి

పేకాట స్థావరంపై దాడి చేసిన కాగజ్నగర్ టౌన్ పోలీసులు కాగజ్నగర్లోని గుంటూరు కాలనీ వద్ద ఒక ఇంటిలో ఆదివారం రోజున రాత్రి పేకాట ఆడుతున్న పేకాట స్థావరం పై దాడి చేసి మొత్తం ఎనిమిది మందినీ అదుపులోకి తీసుకొని వారి నుండి మొత్తం 43 వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేయడమైనదని టౌన్ ఇన్స్పెక్టర్ తుత్తూరు శంకరయ్య తెలిపారు. పేకాట స్థావరం పై దాడిలో కాగజ్నగర్ టౌన్ ఇన్స్పెక్టర్ తుత్తూరు శంకరయ్య ఎస్సై దీకొండ రమేష్ వారి సిబ్బంది పాల్గొన్నారు. కాగజ్ నగర్ టౌన్ లో ఎవరైనా పేకాట శిబిరాలు నడిపిచో చట్టరీత్య కఠిన చర్యలు తీసుకోబడునని హెచ్చరించమని తెలిపారు.
ఎస్పీఎం గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలకు కసరత్తు

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ,Sep 01, 2024, : ఎస్పీఎం గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలకు కసరత్తు కాగజ్‌నగర్‌ పట్టణం ఎస్పీఎం మిల్లులో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల నిర్వహణకు కసరత్తు మొదలైంది. మిల్లు పునఃప్రారంభమైన తర్వాత ఎన్నికలు జరుగుతుండడంతో కార్మికుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. మిల్లులోని 15 గుర్తింపు సంఘాలు తమ సంవత్సర నివేదికలను అందజేయాలని డీసీఎల్ సునిత లేఖలు పంపించడంతో ఆయా సంఘాలు నివేదికల తయారీలో నిమగ్నమయ్యాయి. మరో వైపు తమ సంఘం తరపున ఎవరిని బరిలో దింపాలనే దానిపై సైతం కసరత్తు చేస్తున్నాయి.
2న ప్రజావాణి కార్యక్రమం రద్దు, విద్యా సంస్థలకు సెలవు: జిల్లా కలెక్టర్

కుమ్రం బీం అసిపాబాద్ జిల్లా సెప్టెంబర్ 1, (స్ట్రీట్ బజ్ జిల్లా ప్రతినిధి): భారీ వర్షాల నేపథ్యంలో ఈ నెల 2న నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం రద్దుతో పాటు విద్యా సంస్థలకు  సెలవు ప్రకటించడం జరిగిందని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే ఒక ప్రకటనలో తెలిపారు. భారీ వర్షాల కారణంగా జిల్లాలోని చెరువులు, కుంటలు, వాగులు ఉదృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ప్రజలకు, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలోని ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని తెలిపారు. ప్రస్తుత భారీ వర్షాల దృష్ట్యా అత్యవసరం అయితే తప్ప ఎవరు బయటికి రాకూడదని, ప్రజల రక్షణ కొరకు అధికార యంత్రాంగం నిరంతరం శ్రమిస్తుందని, ప్రజలు భయాందోళన చెందవలసిన అవసరం లేదని, వరద ప్రభావిత ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల ప్రజల రక్షణ కొరకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగిందని తెలిపారు. ప్రజల సౌకర్యార్థం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయంలో కంట్రోల్ రూమ్ నం.6304686505 ఏర్పాటు చేయడం జరిగిందని, అత్యవసర సేవలు నిమిత్తం ప్రజలు సంప్రదించవచ్చని తెలిపారు.
భారీ వర్షాల దృష్ట్యా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి.

కుమ్రం బీం అసిపాబాద్ జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 1,(స్ట్రీట్ బజ్ జిల్లా ప్రతినిధి): ప్రస్తుత భారీ వర్షాల దృష్ట్యా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం ఖమ్మం జిల్లా సమీకృత జిల్లా కలెక్టరేట్ భవనంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి, హైదరాబాద్ నుండి రాష్ట్ర రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డి. జి. పి. డా. జితేందర్ రెడ్డి ఇతర ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్.పి.లతో వరద ప్రభావిత పరిస్థితులు, చేపట్టవలసిన రక్షణ చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉంటూ ప్రజా రక్షణ చర్యలు చేపట్టాలని అన్నారు. జిల్లాల వారీగా నెలకొన్న వరద పరిస్థితులు,  చేపడుతున్న సహాయక చర్యల వివరాలను తెలుసుకున్నారు. మరో 2 రోజుల పాటు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందున  ఎక్కడ కూడా ప్రాణనష్టం సంభవించకుండా, అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైన వెంటనే సహాయక చర్యలు చేపట్టేలా రెస్క్యూ బృందాలను సిద్ధంగా ఉంచాలని, అధికారులు క్షేత్రస్ధాయిలోనే ఉంటూ ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించాలని, భారీ వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టేంతవరకు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ప్రజలు జలదిగ్బంధంలో చిక్కుకుంటే తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని, అవసరమైన పక్షంలో రాష్ట్రం నుండి సహాయక బృందాలు పంపిస్తామని, ఎన్.డి.ఆర్.ఎఫ్. బృందాలు వచ్చే వరకు వేచి చూడకుండా పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సేవలను వినియోగిస్తూ ప్రాణనష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 ప్లాటూన్ల పోలీస్ బలగాలు అందుబాటులో ఉన్నాయని, చెరువులు, కుంటలు, వాగులు, రిజర్వాయర్ల వద్దకు ఎవరూ వెళ్లకుండా పోలీస్, రెవెన్యూ సిబ్బందితో నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వర్షాల వల్ల ఎలాంటి పరిస్థితి ఉత్పన్నమైనా, సమర్ధవంతంగా ఎదుర్కొనేలా అన్ని శాఖల అధికారులు, సిబ్బందిని సమాయత్తం చేయాలని తెలిపారు. ప్రస్తుత సమయంలో ఎవరు సెలవుల్లో వెళ్లకుండా, పూర్తి అప్రమత్తతతో విధులు నిర్వర్తించేలా జిల్లా అధికారులు పర్యవేక్షించాలని, వర్ష ప్రభావిత జిల్లాలలో పాఠశాలలకు సెలవు ప్రకటించాలని కలెక్టర్లను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాస చర్యలు చేపట్టాలని, లో-లెవల్ వంతెనలు, కాజ్ వే లపై నుండి నీరు ప్రవహిస్తున్న మార్గాల నుండి వాహనాల రాకపోకలను నిషేధిస్తూ, ప్రత్యామ్నాయంగా ఇతర ప్రాంతాల నుండి దారి మళ్లించాలని సూచించారు. చెరువులు, కుంటలు, వాగులు తెగిపోకుండా ముందస్తు అప్రమత్తతో కూడిన చర్యలు తీసుకోవాలని, త్రాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని, త్రాగునీరు కలుషితం కాకుండా పర్యవేక్షణ చేయాలని తెలిపారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తూ వరద పరిస్థితిని సమర్ధవంతంగా ఎదుర్కోవాలని, లోతట్టు ప్రాంతాలు, కల్వర్టులు, చెరువుల వద్ద ప్రత్యేకంగా భద్రతా చర్యలు చేపట్టాలని, వర్షాల వల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడకుండా చూడాలని, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రాంగం సమర్ధవంతంగా పని చేయాలని తెలిపారు. జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, ఎస్.పి. డి.వి.శ్రీనివాస్ రావు, జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) దాసరి వేణు లతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలో ప్రజల సౌకర్యార్థం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని, వాగులు, కల్వర్టులు, నదుల వద్దకు ఎవరు వెళ్లకుండా భద్రతా చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, అధికారుల సమన్వయంతో ప్రజా రక్షణ దిశగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. జిల్లాలోని అడ, కొమురం భీం ప్రాజెక్టుల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.