అదానీ గ్రూప్ కొత్త కంపెనీకి ఆమోదం.. షేర్లు అమ్మేస్తున్న ఇన్వెస్టర్స్..

అదానీ గ్రూప్ దేశంలోని ఎనర్జీ రంగంలో కొత్త కంపెనీ ఏర్పాటుకు తీవ్రంగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అయితే గ్రూప్ తీసుకున్న ఈ నిర్ణయంతో అనేక మంది ఇన్వెస్టర్లు అదానీ గ్రీన్ ఎనర్జీ షేర్లను విక్రయిస్తున్నారు.

గౌతమ్ అదానీ గ్రూప్ కంపెనీ అయిన అదానీ గ్రీన్ ఎనర్జీ డైరెక్టర్ల బోర్డు టోటల్ ఎనర్జీస్‌తో జాయింట్ వెంచర్ ఒప్పందాన్ని ఆమోదించింది. దీని కింద రెండు సంస్థలు 50:50 నిష్పత్తిలో జాయింట్ వెంచర్‌లో వాటాను కలిగి ఉంటాయని వెల్లడైంది. తాజా డీల్ ద్వారా విదేశీ సంస్థ అదానీ గ్రూప్ కంపెనీలో కొత్తగా 444 మిలియన్ డాలర్లను అదనంగా పెట్టుబడి పెట్టనుంది. అయితే కంపెనీ కొత్త అడుగులు వేస్తున్న తరుణంలో అదానీ గ్రీన్ ఎనర్జీ షేర్లు క్షీణించాయి. ఈ క్రమంలో స్టాక్ ధర 2 శాతానికి పైగా క్షీణించింది. మార్కెట్ల క్లోజింగ్ సమయంలో స్టాక్ ధర ఎన్ఎస్ఈలో ఒక్కోటి 2.66 శాతం క్షీణించి రూ.1894 వద్ద స్థిరపడింది.

అదానీ గ్రీన్ ఎనర్జీ కంపెనీ, టోటల్ ఎనర్జీస్, అదానీ రెన్యూవబుల్ ఎనర్జీ సిక్స్టీ ఫోర్ లిమిటెడ్ మధ్య గట్టి ఒప్పందాలు చేసుకోనున్నట్లు స్టాక్ మార్కెట్‌కు ఇచ్చిన సమాచారంలో పేర్కొంది. ఒప్పందంలోని వివరాల ప్రకారం అదానీ గ్రీన్ ఎనర్జీతో కొత్తగా ఏర్పాటు చేయనున్న జాయింట్ వెంచర్ కంపెనీలో ఫ్రెంచ్ సంస్థ టోటల్ ఎనర్జీస్ నేరుగా లేదా దాని అనుబంధ సంస్థల ద్వారా అవసరమైన పెట్టుబడి మెుత్తాన్ని ఇన్వెస్ట్ చేయనున్నట్లు వెల్లడైంది. కొత్తగా ఏర్పాటౌతున్న కంపెనీ 1,150 మెగావాట్ల సోలార్ ఎనర్జీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

అదానీ గ్రూప్ ఇంధన రంగంపై దృష్టి సారిస్తున్న ప్రస్తుత సమయంలో కొత్త కంపెనీ ఏర్పాటు చాలా కీలకంగా మారింది. కంపెనీ ప్రస్తుత చర్యలతో రానున్న కాలంలో అదానీ గ్రీన్ ఎనర్జీ నిర్వహణ సామర్థ్యం 30 శాతానికి పైగా పెరిగి 2030 నాటికి 50,000 మెగావాట్లను దాటే అవకాశం ఉంది. అదానీ గ్రీన్ ఎనర్జీ వార్షిక ప్రాతిపదికన 6,000 నుంచి 7,000 మెగావాట్ల సామర్థ్యాన్ని జోడించి ప్రపంచంలోనే అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి కంపెనీగా అవతరించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం అదానీ గ్రీన్ ఎనర్జీ హోల్డింగ్ పరిశీలిస్తే ప్రమోటర్లు కంపెనీలో 57.52 శాతం వాటాలను కలిగి ఉన్నారు.

తెలుగు రాష్ట్రాలకు భారీ విరాళం ప్రకటించిన నందమూరి బాలకృష్ణ

సీఎం సహాయ నిధికి విరాళాలు అందించాలని ఇరురాష్ట్రాల సీఎంలు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ పిలుపునకు హిందూపురం ఎమ్మెల్యే, దిగ్గజ సినీనటుడు నందమూరి బాలకృష్ణ స్పందించారు. తెలుగు రాష్ట్రాల సీఎంల సహాయనిధికి కోటి రూపాయల విరాళాన్ని బాలయ్య ప్రకటించారు.

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాలు ఎంతలా తల్లిడిల్లిపోయాయో తెలిసిందే. ఏపీలో విజయవాడ, పరిసర ప్రాంతాలు, తెలంగాణలోని ఖమ్మం పట్టణ పరిసర ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. ముఖ్యంగా ఏపీలో లక్షలాది మంది నిరాశ్రయులుగా మారారు. ఈ నేపథ్యంలో సీఎం సహాయ నిధికి విరాళాలు అందించాలని ఇటు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.. అటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ పిలుపునకు హిందూపురం ఎమ్మెల్యే, దిగ్గజ సినీనటుడు నందమూరి బాలకృష్ణ స్పందించారు.

తెలుగు రాష్ట్రాల సీఎంల సహాయనిధికి కోటి రూపాయల విరాళాన్ని బాలయ్య ప్రకటించారు. బాధాతప్త హృదయంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50 లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50 లక్షలు తనవంతు బాధ్యతగా బాధిత ప్రజల సహాయార్థం విరాళంగా అందిస్తున్నానని ఆయన తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆయన ప్రకటన చేశారు.

50 ఏళ్ల క్రితం మా నాన్న గారు నా నుదుటిన దిద్దిన తిలకం ఇంకా మెరుస్తూనే ఉంది. 50 ఏళ్ల నుంచి నా నట ప్రస్థానం కొనసాగుతూనే ఉంది. వెలుగుతూనే ఉంది. తెలుగు భాష ఆశీస్సులతో, తెలుగుజాతి అభిమాన నీరాజనాలతో పెనవేసుకున్న బంధం ఇది. ఈ ఋణం తీరనిది. ఈ జన్మ మీ కోసం.. మీ ఆనందం కోసం.. నా ఈ ప్రయాణంలో సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రస్తుతం తెలుగు నేలను వరద ముంచెత్తుతోంది. ఈ విపత్కర పరిస్థితులలో బాధాతప్త హృదయంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50 లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50 లక్షలు నావంతు బాధ్యతగా బాధిత ప్రజల సహాయార్థం విరాళంగా అందిస్తున్నాను. రెండు రాష్ట్రాలలో మళ్లీ అతి త్వరలోనే సాధారణ పరిస్థితులు నెలకొనాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. మీ నందమూరి బాలకృష్ణ’’ అని బాలయ్య భావోద్వేగ పోస్ట్ పెట్టారు.

సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ (మంగళవారం) కీలకమైన ప్రకటన చేశారు. వరద బాధితులకు అండగా నిలిచేందుకు మంచి మనసుతో ముందుకు రావాలని, ఎవరికి తోచిన విధంగా వారు సీఎం సహాయనిధికి సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. సీఎం ఇచ్చిన ఈ పిలుపునకు స్పందన వస్తోంది. టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న సీఎం సహాయ నిధికి రూ.5 లక్షలు విరాళం ప్రకటించారు. మరోవైపు స్వస్ఛంధ సేవాలు కూడా కదిలాయి. విజయవాడ వరద బాధితులకు సాయం చేసేందుకు స్వచ్ఛంద సేవా సంస్థలు, దాతలు ముందుకొచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు జై భారత్ క్షీరా ఆక్వా సంఘం తరఫున 2000, కాస్మో క్లబ్ తరఫున 3000 ఆహార పొట్లాలు విజయవాడకు తరలిస్తున్నారు. కాగా స్వచ్చంధంగా ముందుకొచ్చే దాతలకు మరింత సమాచారం అందించేందుకు 79067 96105 నెంబర్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

వ‌ర‌ద బాధితులకు ఆ న‌లుగురు భారీ విరాళం!

భారీ వ‌ర్షాలు తెలుగు రాష్ట్రాల్ని ముంచెత్తిన సంగ‌తి తెలిసిందే. దీంతో సినీ ప‌రిశ్ర‌మ నుంచి పెద్ద ఎత్తున విరాళాలు అందుతున్నాయి. ఇప్ప‌టికే ప‌లువురు న‌టులు, నిర్మాత‌లు విరాళం అందించ‌గా తాజాగా మ‌రింత మంది ముందుకొచ్చారు. ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్, నిర్మాతలు ఎస్ . రాధాకృష్ణ‌, నాగ‌వంశీ 50 లక్ష‌లు విరాళం ప్ర‌క‌టించారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ కి 25 ల‌క్ష‌లు, తెలంగాణ‌కు 25 ల‌క్ష‌లు చొప్పున 50 ల‌క్ష‌లు ముఖ్య‌మంత్రుల‌ స‌హాయ నిధికి అంద‌జేస్తున్న‌ట్లు తెలిపారు. `భారీ వ‌ర్షాల వ‌ల్ల ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో జ‌రుగుతోన్న ఆస్తి, ప్రాణ న‌ష్టాలు మ‌మ్మ‌ల్ని ఎంత‌గానో క‌లచి వేసాయి. ఆ విప‌త్తు నుంచి తెలుగు ప్ర‌జ‌లు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆ దేవుడిని ప్రార్ధిస్తూ మా వంతు స‌హాయం అందిస్తున్నాం` అన్నారు.

అలాగే యువ న‌టుడు సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ కూడా ఆప‌న్న హ‌స్తం అందించారు. ఒక్కో రాష్ట్రానికి 15 ల‌క్ష‌లు చొప్పున రెండు తెలుగు రాష్ట్రాల‌కు 30 ల‌క్ష‌లు విరాళం అందించారు.` తెలుగు రాష్ట్రాల‌ను వ‌ర‌ద‌లు ముంచెత్త‌డం బాధాక‌రం. ప్ర‌జ‌లు ప‌డుతోన్న ఇబ్బంది చూస్తుంటే ఎవ‌రికీ ఇలాంటి ప‌రిస్థితి రాకూడ‌దనిపిస్తుంది.

ఈ వ‌ర‌ద‌లు చాలా కుటుంబాల‌ను క‌ష్టాల్లోకి నెట్టేసాయి. ఇలాంటి స‌మ‌యంలో ఒక‌రికొక‌రు తోడుగా ఉండటం ఎంతైనా అవ‌స‌రం. వ‌ర‌ద బాధితుల‌కు నా వంతుగా తెలుగు రాష్ట్రాల‌కు 30 ల‌క్ష‌లు అందిస్తున్నా. ఇది కొంత మందికి ఏదో రూపంలో ఉప‌యోగ ప‌డుతుంద‌ని ఆశిస్తున్నాను` అని అన్నారు.

వాతావరణ శాఖ మరో హెచ్చరిక.. మరో మూడు రోజుల్లో మరో ముప్పు..

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో దేశంలోని అనేక ప్రాంతాల్లో రుతుపవనాల వర్షాలు కురుస్తున్నాయి. శని, ఆదివారాల్లో కురిసిన భారీ వర్షాలు సోమవారం నాటికి తగ్గుముఖం పట్టినా ముసురు మాత్రం ఎడతెరిపి లేకుండా పోతోంది. సోమవారం రాత్రి 9 గంటల వరకు నగరంలోని నాగోల్‌లో అత్యధికంగా 1.33 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఇప్పటికే తీరం దాటిన వాయుగుండం 12 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని, దీని ప్రభావంతో రాగల మరో మూడు రోజులు గ్రేటర్‌లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు, మరికొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు తెలిపారు. కాగా.. నేటి నుంచి వచ్చే 4 రోజుల వరకు రాష్ట్రవ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. హైదరాబాద్‌లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. దీంతో తెలంగాణకు ఐఎండీ ఎల్లో అలర్ట్ ప్రకటించింది.

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోనూ వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టాయి. అయితే ఈరోజు కూడా ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే ఇతర జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

సెప్టెంబర్ 5 నాటికి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..

మరోవైపు ఏపీ, తెలంగాణలకు భారత వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. మరో మూడు రోజుల్లో మరో ముప్పు వుందని వాతావరణ శాఖ హెచ్చరింది. అంటే సెప్టెంబర్ 5 నాటికి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ ఉపరితల ద్రోణి రాజస్థాన్‌లోని జైసల్మేర్ నుంచి తెలంగాణ మీదుగా కొనసాగుతుందని అధికారులు వివరించారు. కోస్తాంధ్ర కోస్తాకు అతి సమీపంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీ, తెలంగాణల్లో మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

బీఆర్ఎస్ మాజీ మంత్రులపై దాడి..

తెలంగాణలో నాలుగు రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న వానలతో ఖమ్మం జిల్లాలోని మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహించింది. దీంతో పలు కాలనీలు జలమయం అయ్యాయి. కాలనీల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. బాధితులను ప్రభుత్వం అండగా నిలిచి సహాయ కార్యక్రమాలు చేపట్టింది. అయితే ఈరోజు(మంగళవారం) బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు ఖమ్మం జిల్లాలోని ముంపు ప్రాంతాల్లో పర్యటించారు.

అయితే ఈ పర్యటనలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వాహనంపై కొంతమంది వ్యక్తులు రాళ్ల దాడి చేశారు. ఈ దాడిలో బీఆర్ఎస్ నేతలకు గాయాలు అయ్యాయి. ఒకరికి కాలు విరగడంతో ఆస్పత్రికి తరలించారు. దాడి జరిగిన మంచి కంటి నగర్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఖమ్మంలో బీఆర్ఎస్ నేతలపై దాడిని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఈరోజు కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు.

బీఆర్ఎస్ మాజీ మంత్రులు హరీష్‌రావు, పువ్వాడ అజయ్ కుమార్, సబితా ఇంద్రారెడ్డి వాహనాలపై దాడి చేయటం కాంగ్రెస్ అసహనానికి నిదర్శనమని మండిపడ్డారు. ప్రజలకు సాయం చేయటం చేతగాక.. సాయం చేస్తున్న నేతలను చూసి ఓర్వలేకే ఈ దాడికి తెగబడ్డారని విమర్శలు చేశారు. ప్రభుత్వం ప్రజలను నిర్లక్ష్యం చేస్తే వారికి తాము అండగా ఉండటమే తప్పా? అని ప్రశ్నించారు. ప్రజలకు సేవ చేయటం చేతకాదు...సేవ చేసే వాళ్లపై మాత్రం దాడి చేయటం? సిగ్గు చేటు అని అన్నారు.

ఈ దాడికి ముఖ్యమంత్రితో సహా కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి దాడులు ఎన్ని చేసినా సరే...ప్రజల వద్దకు బీఆర్ఎస్ శ్రేణులను వెళ్లకుండా ఆపలేరని హెచ్చరించారు. కాంగ్రెస్ చేతగాని, దద్దమ్మ పాలనను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఈ ప్రభుత్వానికి సరైన సమయంలో బుద్ధి చెప్పటం ఖాయమని కేటీఆర్ వార్నిగ్ ఇచ్చారు.

విజయవాడ వాసులకు బిగ్ రిలీఫ్.. నెమ్మదిగా శాంతిస్తున్న కృష్ణమ్మ

విజయవాడలో కృష్ణమ్మ నెమ్మదిగా శాంతిస్తుంది. ప్రకాశం బ్యారేజీకి సోమవారం ఇన్‌ఫ్లో 11 లక్షల క్యూసెక్కులు ఉండగా.. మంగళవారానికి అది 9 లక్షల క్కూసెక్కులకు తగ్గింది. అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. సాయంత్రానికి వరద ఇంకాస్త తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. ఇటు విజయవాడ నగరంలోనూ వరద నీరు క్రమంగా తగ్గుతోంది. మంగళవారం సాయంత్రానికి చాలాచోట్ల సాధారణ పరిస్థితికి రావొచ్చని అధికారులు భావిస్తున్నారు.

విజయవాడ సింగ్ నగర్‌లో వరద కష్టాలు ఇంకా కొనసాగుతున్నాయి. ప్రజలు ఇప్పుడిప్పుడే తమ ఇళ్ల నుంచి బయటకు వస్తున్నారు. నిత్యావసరాలు, మంచి నీరు తీసుకెళ్తున్నారు. నాలుగు అడుగుల లోతు నీటిలో కాలనీల నుంచి బయటకు వస్తున్నారు. వరద తగ్గని ప్రదేశాల్లో హెలీకాప్టర్లు, డ్రోన్ల ద్వారా ఆహారం, నీరు, ఇతర నిత్యావసర వస్తువులు సరఫరా చేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో వరదలు బీభత్సం సృష్టించాయి. ఈ నేపథ్యంలో.. పలువురు సినీ ప్రముఖులు విరాళాలు ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాలకు రూ.50 లక్షల చొప్పున జూనియర్ ఎన్టీఆర్‌ విరాళం ప్రకటించారు. ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్ కు తన వంతుగా రూ. 25 లక్షలు విరాళం అందజేశారు. రెండు తెలుగు రాష్ట్రాలకు రూ.5 లక్షల చొప్పున విశ్వక్‌సేన్‌ విరాళం ఇచ్చారు.

విజయవాడ వరద బాధితులకు సింహచలం నుంచి పులిహోర ప్రసాదం తీసుకొస్తున్నారు. 20 వేల పులిహోర ప్యాకెట్లు విజయవాడకు పంపేందుకు ఏర్పాట్లు చేశారు. రైలులో 10 వేల ప్యాకెట్లను ఆలయ అధికారులు పంపారు. మధ్యాహ్నం మరో 10 వేల పులిహోర ప్యాకెట్లు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే విజయవాడకు 10 వేల పులిహోర ప్యాకెట్లు చేరాయి.విజయవాడ -హైదరాబాద్‌ హైవేపై వాహనాల రాకపోకలు క్రమంగా ప్రారంభం అవుతున్నాయి. సోమవారం రాత్రి వరకూ మాచర్ల మీదుగా వెళ్లిన బస్సులు.. ఇప్పుడు నందిగామ మీదుగా ప్రయాణం చేస్తున్నాయి. వంతెన గండి పడటంతో సింగిల్ రూట్‌లో వెళుతున్నాయి. సర్వీసుల పునరుద్ధరణతో హైదరాబాదు ప్రయాణానికి ప్రయాణికులు సిద్ధమవుతున్నారు. అయితే.. డ్రైవర్లు జాగ్రత్త వహించాలని పోలీసులు సూచిస్తున్నారు.విజయవాడలో వరద ముంపులో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. బెజవాడ ఇందిరాగాంధీ స్టేడియం నుంచి వందకు పైగా ట్రాక్టర్లను ముంపు ప్రాంతాలకు తరలిస్తున్నారు. భారీ క్రేన్లు కూడా సిద్ధం చేశారు. ప్రస్తుతం ముంపు ప్రాంతాల్లోకి బోట్లు, ట్రాక్టర్లు, క్రేన్లు మాత్రమే వెళ్లే అవకాశం ఉంది. అందుకే అధికారులు వీటిని సిద్ధం చేసి.. ముంపు ప్రాంతాలకు పంపిస్తున్నారు.

రెండేళ్లలో మరో 6 ప్లాంట్లు

హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేసే అరబిందో ఫార్మా జెనరిక్స్‌ రంగంలో దూసుకుపోతోంది. ఫార్మా రంగంలో అత్యంత కీలకమైన యాక్టివ్‌ ఫార్మా ఇన్‌గ్రిడియెంట్స్‌ (ఏపీఐ) తయారీ కోసం 1986లో ఏర్పాటైన ఈ కంపెనీ.. ఇతర ఫార్మా కంపెనీల కొనుగోళ్లు, కొత్త ప్లాంట్ల ఏర్పాటు ద్వారా ప్రస్తుతం భారత ఫార్మా రంగంలో మేటి సంస్థగా ఎదిగింది. గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో 350 కోట్ల డాలర్ల (సుమారు రూ.29,300 కోట్లు) టర్నోవర్‌ నమోదు చేసింది.

కంపెనీ ప్రస్తుతం 29 ఉత్పత్తి యూనిట్లతో ఏటా 5,000 కోట్లకు పైగా ఫార్ములేషన్లు, 19,000 టన్నుల ఏపీఐల ఉత్పత్తి సామర్ధ్యం కలిగి ఉంది. వీటికి తోడుగా వచ్చే రెండేళ్లలో మరో ఆరు కొత్త ఉత్పత్తి యూనిట్లు ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. మార్కెట్‌ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు వీలుగా ప్రత్యేక ఔషధాలపై దృష్టి పెట్టింది. దీనికి తోడు అమెరికాతో సహా ప్రఽధాన మార్కెట్లపై ప్రత్యేక దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా ఇటీవల ఇండోనేషియాలో ఫైజర్‌/వయాట్రిస్‌ కంపెనీల నుంచి 17 బ్రాండ్లను కొనుగోలు చేసి, అక్కడి మార్కెట్‌పై పట్టు సాధించేందుకు కృషి చేస్తోంది. ఇప్పటికే 14 బయోసిమిలర్‌ ఔషధాల అభివృద్ధి వివిధ దశల్లో ఉంది. ఇవిగాక మరో 14 పెప్టైడ్‌ ఏపీఐల కోసం డీఎంఎఫ్‌లను అమెరికాలో ఫైల్‌ చేసింది. కాగా ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్‌ఐ) కింద రూ.2,500 కోట్ల పెట్టుబడితో పెన్సిలిన్‌-జీ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది.

అరబిందో ఫార్మా ఈ మధ్యనే బయోలాజిక్స్‌ ఔషధాల కాంట్రాక్టు తయారీలోకి ప్రవేశించింది. ఇందుకోసం ‘థెరానియమ్‌ బయోలాజిక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ పేరుతో ప్రత్యేక అనుబంధ కంపెనీని ఏర్పాటు చేసింది. బయోలాజిక్స్‌ కోసం త్వరలో రూ.1,000 కోట్లతో ఏటా రెండున్నర నుంచి మూడు కోట్ల వయల్స్‌ ఉత్పత్తి సామర్ధ్యంతో ప్రత్యేక యూనిట్‌ ఏర్పాటు చేయనుంది.

ఈ ప్లాంట్‌ నుంచి కాంట్రాక్టు పద్దతిలో బయోసిమిలర్స్‌ సరఫరా చేసేందుకు ఎంఎస్‌డీ కంపెనీతో మాస్టర్‌ సర్వీస్‌ ఒప్పందం (ఎంఎస్‌ఏ) కుదుర్చుకుంది. ఈ పెట్టుబడులు తమ అభివృద్ధిని మరింత ముందుకు తీసుకువెళతాయని అరబిందో ఫార్మా వైస్‌ చైర్మన్‌, ఎండీ కే నిత్యానంద రెడ్డి తెలిపారు.

హైదరాబాద్‌ విమానాశ్రయంలో ప్రైవేట్‌ విమానాల కోసం ప్రత్యేక టెర్మినల్‌

హైదరాబాద్‌, శంషాబాద్‌లో జీఎంఆర్‌ గ్రూప్‌ నిర్వహణలోని రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ (ఆర్‌జీఐఏ).. ప్రైవేట్‌ విమానాల కోసం ప్రత్యేక టెర్మినల్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఆర్‌జీఐఏ టెర్మినల్‌ పక్కన 11,234 చదరపు

హైదరాబాద్‌, శంషాబాద్‌లో జీఎంఆర్‌ గ్రూప్‌ నిర్వహణలోని రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ (ఆర్‌జీఐఏ).. ప్రైవేట్‌ విమానాల కోసం ప్రత్యేక టెర్మినల్‌ను అందుబాటులోకి తెచ్చింది.

ఆర్‌జీఐఏ టెర్మినల్‌ పక్కన 11,234 చదరపు అడుగల విస్తీర్ణంలో అత్యాధునిక సదుపాయాలతో ఈ టెర్మినల్‌ ఏర్పాటు చేసినట్టు ఆర్‌జీఐఏ తెలిపింది. ప్రైవేట్‌ ఎంట్రెన్స్‌, కార్ల పార్కింగ్‌ కూడా ఈ టెర్మినల్‌లో అందుబాటులో ఉంటాయి. వ్యక్తిగత లేదా వ్యాపార అవసరాల కోసం ప్రైవేట్‌ విమానాలు, చార్టర్డ్‌ విమానాల్లో వచ్చే కుబేరులు, వ్యాపార ప్రముఖుల విమానాలు ఈ టెర్మినల్‌ ద్వారా రాకపోకలు సాగించవచ్చు.

హైదరాబాద్‌ ఇప్పటికే ఫార్మా, ఐటీ రంగాల్లో బాగా అభివృద్ధి చెందింది. ఇటీవల అనేక బహుళ జాతి కంపెనీలు ఇక్కడ తమ గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్స్‌ ఏర్పాటు చేస్తున్నాయి. ఈ రంగాలకు చెందిన ప్రముఖుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రత్యేక టెర్మినల్‌ ఏర్పాటు చేసినట్టు జీఎంఆర్‌ హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ సీఈఓ ప్రదీప్‌ ఫణిక్కర్‌ తెలిపారు.

మహీంద్రా సీబీజీ యువో టెక్‌ ప్లస్‌ ట్రాక్టర్‌

మహీంద్రా ట్రాక్టర్స్‌.. కంప్రెస్డ్‌ బయోగ్యా్‌సతో (సీబీజీ) పని చేసే యువో టెక్‌ ప్లస్‌ ట్రాక్టర్‌ను కేంద్ర రోడ్డు రవాణా, హైవే శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ సమక్షంలో ఆవిష్కరించింది.

మహీంద్రా ట్రాక్టర్స్‌.. కంప్రెస్డ్‌ బయోగ్యా్‌సతో (సీబీజీ) పని చేసే యువో టెక్‌ ప్లస్‌ ట్రాక్టర్‌ను కేంద్ర రోడ్డు రవాణా, హైవే శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ సమక్షంలో ఆవిష్కరించింది.

సీబీజీతో పని చేసే ఈ ట్రాక్టర్‌ కాలుష్యం, కర్బన వ్యర్థాలను గణనీయంగా తగ్గించగలుగుతుందని కంపెనీ తెలిపింది.

సీఎన్‌జీ అయితే శిలాజ ఇంధనాల నుంచి తయారవుతుందని, దానికి భిన్నంగా సీబీజీ పూర్తిగా హరిత, పునరుత్పాదక ఇంధనాల నుంచి తయారవుతుందని కంపెనీ పేర్కొంది.

12 ఏళ్లుగా రోజుకు 30 నిమిషాలే నిద్రపోతున్న వ్యక్తి.. ఎందుకో తెలుసా?

మనిషి చక్కటి ఆరోగ్యంతో ఉండాలంటే రోజుకు సగటున 6-8 గంటల నిద్రపోవడం చాలా ముఖ్యం. తగిన నిద్ర లేకపోతే మానసిక ప్రవర్తనపై ప్రభావం చూపుతుందని, దైనందిన జీవితాన్ని దెబ్బతీస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. స్థిరంగా 6-8 గంటలు నిద్రపోవడం ఆరోగ్యాన్ని పదిల పరుస్తుందని నిపుణులు సైతం నిర్ధారిస్తున్నారు.

అయితే జపాన్‌కు చెందిన ఓ వ్యక్తి గత 12 ఏళ్లుగా రోజుకు 30 నిమిషాలు మాత్రమే నిద్రపోతున్నాడు. నమ్మశక్యంగా లేకపోయిన ఇది నిజం. డైసుకే హోరి అనే వ్యక్తి తన జీవితాన్ని రెట్టింపు చేసుకునేందుకు రోజుకు అరగంట నిద్రను కొనసాగిస్తున్నాడు. పశ్చిమ జపాన్‌లోని హ్యోగోకు చెందిన 40 ఏళ్ల ఆ వ్యక్తి.. 30 నిమిషాలే నిద్రపోయినప్పటికీ తన శరీరం, మెదడును తక్కువ నిద్రతో సాధారణంగా పనిచేసేలా ట్రైనింగ్ ఇచ్చానని, ఈ విధంగా రోజూ ప్రాక్టీస్ చేయడంతో తన పని సామర్థ్యం గణనీయంగా మెరుగుపడిందని డైసుకే హోరి వెల్లడించాడు.

తినడానికి ఒక గంట ముందు వ్యాయామం లేదా కాఫీ తాగితే నిద్ర మత్తును దూరం చేసుకోవచ్చునని డైసుకే చెప్పినట్టు ‘సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్’ పేర్కొంది. మనిషి ఏకాగ్రతతో ఉండాలంటే ఎక్కువ సేపు నిద్రపోవడం కంటే నాణ్యమైన నిద్రపోవడం చాలా ముఖ్యమని డైసుకే చెప్పాడు. ‘‘పనిలో స్థిరమైన ఏకాగ్రత అవసరమయ్యే వ్యక్తులు ఎక్కువ సేపు నిద్రపోవడం కంటే నాణ్యత కలిగిన నిద్రతో ఎక్కువ ప్రయోజనం పొందుతారు. ఉదాహరణకు తీసుకుంటే వైద్యులు, అగ్నిమాపక సిబ్బంది తక్కువ సమయం విశ్రాంతి తీసుకుంటుంటారు. కానీ అధిక సామర్థ్యాన్ని కలిగి ఉంటారు’’ అని డైసుకే చెప్పాడు.

డైసుకే హోరి చెప్పే విషయాలను మరింతగా తెలుసుకునేందుకు జపాన్‌కు చెందిన యోమియురి టీవీ ‘విల్ యు గో విత్ మీ’ అనే రియాలిటీ షో అతడిని 3 రోజుల పాటు అనుసరించింది. హోరీ కేవలం 26 నిమిషాలే నిద్రపోయి మంచి ఎనర్జీతో మేల్కొంటున్నాడని, అల్పాహారం చేసి పనిలో నిమగ్నం అవుతున్నాడని, జిమ్‌కి కూడా వెళ్లిన సందర్భాన్ని ఈ రియాలిటీ షో వెల్లడించింది. 

కాగా డైసుకే హోరీ ఒక వ్యవస్థాపకుడిగా కూడా ఉన్నాడు. తన ప్రత్యేకమైన నిద్ర అలవాటుతో 2016లో ‘జపాన్ షార్ట్ స్లీపర్స్ ట్రైనింగ్ అసోసియేషన్‌’ను స్థాపించాడు. నిద్ర, ఆరోగ్యంపై అతడు పాఠాలు బోధిస్తున్నాడు. అల్ట్రా-షార్ట్ స్లీపర్‌లుగా మారేందుకు ఇప్పటివరకు 2,100 మంది విద్యార్థులకు ట్రైనింగ్ ఇచ్చాడు.తక్కువ నిద్రకు సంబంధించి ఆసక్తికర విషయాలకు వస్తే.. వియత్నాం దేశానికి చెందిన థాయ్ ఎన్‌గోక్ అనే 80 ఏళ్ల తాను 60 ఏళ్లకు పైగా నిద్రపోలేదని కథాలు చెబుతున్నాయి. 1962లో జ్వరం వచ్చిన తర్వాత అతడు నిద్రపోయే సామర్థ్యాన్ని కోల్పోయినట్టు అతడు చెబుతున్నాడు. చికిత్సలు తీసుకున్నా, నిద్ర మాత్రలు వాడినప్పటికీ నిద్రలేమి మారలేదని అతడు వివరించాడు.