ప్రతిష్టాత్మకంగా దులీప్ ట్రోఫీని నిర్వహించాలి, లోటుపాట్లు లేకుండా ఏర్పాటు చేయాలి.. జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్..
అనంతపురం నగరంలోని ఆర్డిటి స్పోర్ట్స్ విలేజ్ లో నిర్వహించే దులీప్ ట్రోఫీని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ ఆదేశించారు. మంగళవారం అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఆర్డిటి స్పోర్ట్స్ విలేజ్ లో నిర్వహించే దులీప్ ట్రోఫీపై ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్, ఆర్డీటీ, వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అనంతపురం నగరంలో మొట్టమొదటిసారి నిర్వహించే దులీప్ ట్రోఫీ కోసం జిల్లా యంత్రాంగం తరఫున అన్ని రకాల సహకారం అందించాలన్నారు. అనంతపురం క్రికెట్ అసోసియేషన్ జిల్లా సెక్రెటరీ మధు ఆచారి మరియు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 5వ తేదీ నుంచి 22వ తేదీ వరకు నిర్వహించే దులీప్ ట్రోఫీ భారత క్రికెట్ జట్టు క్రీడాకారులు పాల్గొనడం జరుగుతుందని, ఇందుకు లోటుపాట్లు లేకుండా ఏర్పాటు చేయాలన్నారు. ఆర్డిటి స్పోర్ట్స్ విలేజ్ కి నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని, 160 కెవి ట్రాన్స్ఫార్మర్ ను ఏర్పాటు చేయాలని, దాని నిర్వహణ కోసం అవసరమైన సిబ్బందిని నియమించాలన్నారు. ప్రోటోకాల్ ప్రకారం ఫైర్ సేఫ్టీ, డిజాస్టర్ రెస్పాన్స్ మెకానిజం పాటించాలన్నారు. క్రికెట్ మ్యాచ్ ల నేపథ్యంలో మెడికల్ అరేంజ్మెంట్స్ చేయాలని, అంబులెన్స్ లను సిద్ధంగా ఉంచాలని, అవసరమైన మందులను, ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని, పీహెచ్సీ సిబ్బందిని నియమించాలని సూచించారు. క్రికెట్ పోటీలను చూసేందుకు బీసీసీఐ సెలెక్టర్ అజిత్ అగార్కర్, కామెంటేటర్లు, క్రీడాకారులు రావడం జరుగుతుందని, విఐపి జాబితాను సిద్ధం చేయాలన్నారు. మ్యాచ్ లను సదావుగా నిర్వహించేందుకు డిఎస్డివో పరిధిలోని కోచ్ లను వాలంటీర్లుగా ఏర్పాటు చేయాలన్నారు. ట్రాఫిక్ క్లియరెన్స్ ఏర్పాట్లు జాగ్రత్తగా చేయాలని, సెక్యూరిటీ ప్లాన్ పరిశీలించాలని డిఎస్పీని ఆదేశించారు. దులీప్ ట్రోఫీ ఏర్పాట్లను తహసిల్దార్, ఎంపీడీవో, ఏఈ, మున్సిపల్ కమిషనర్, డివిజన్ స్థాయి అధికారులు, జాయింట్ కలెక్టర్, తదితరులు రోజువారీగా ఏర్పాట్లను పరిశీలించాలన్నారు. క్రికెటర్లు ఉండే హోటల్స్ వద్ద పోలీస్ ఫోర్స్ ఏర్పాటు చేయాలన్నారు. ఆర్డీటీ స్టేడియాల్లోని గ్యాలరీల క్లీనింగ్ ఎప్పటికప్పుడు చేపట్టాలని, పబ్లిక్ పార్కింగ్ ఏర్పాటు జాగ్రత్తగా చేయాలన్నారు. పాఠశాల విద్యార్థులకు రొటేషన్ పద్ధతిలో పాసులు అందించాలన్నారు. నాలుగు రోజులు జరిగే క్రికెట్ మ్యాచ్ కోసం 4000 కెపాసిటీ కలిగిన ఆర్డీటీ స్టేడియంలో రోజువారీగా పాసులను ఉచితంగా అందించడం జరుగుతుందని, ఎంట్రీ ఉచితంగానే ఉన్నా.. పాసు ఉంటేనే అనుమతించాలని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధికారులు తెలిపారు. అయితే క్రౌడ్ మేనేజ్మెంట్ జాగ్రత్తగా చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.* - *ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, డిఆర్ఓ జి. రామకృష్ణారెడ్డి, ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంచు ఫెర్రర్, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అడ్మినిస్ట్రేషన్ మేనేజర్ ఆదిత్య వర్మ, మున్సిపల్ కమిషనర్ పీవీఎస్ఎన్ మూర్తి, గుంతకల్ ఆర్డీవో శ్రీనివాసులు రెడ్డి, ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ సంపత్ కుమార్, డిఎస్డివో షఫీ, డిఎంహెచ్ఓ డా.ఈబి.దేవి, డీఈవో వరలక్ష్మి, డీఎస్పీ ప్రతాప్ కుమార్, రంజీ క్రికెటర్ షాబుద్దీన్, కోచ్ యుగంధర్, తదితరులు పాల్గొన్నారు.
Aug 29 2024, 07:46