రెక్కలు తెగిన బాల్యానికి బాధ్యులు ఎవరు...బంగారు భవితనందించేది ఎవరు...
పాపం, పుణ్యం,ప్రపంచ మార్గం కష్టం, సౌఖ్యం,శ్లేషార్థాలూ ఏమీ ఎరుగని పువ్వుల్లారా... అయిదారేడుల పాపల్లారా.... మెరుపు మెరిస్తే వాన కురిస్తే,ఆకసమున హరివిల్లు విరిస్తే, అవి మీకే అని ఆనందించే కూనల్లారా.... మీదే మీదే సమస్త విశ్వం మీరే లోకపు భాగ్యవిధాతలు... ఉడతల్లారా! బుడతల్లారా! ఇది నా గీతం వింటారా.... అంటూ కల్మషం లేని బాల్యానికి అక్షరాల ఆకారం ఇచ్చాడు మహాకవి శ్రీశ్రీ కానీ నేడు ఆ బాల్యానికి భరోసా ఇచ్చే వారు కరువౌతున్నారని ఈ సంఘటన చూస్తే అర్థమవుతుంది. సరిగ్గా నేటికీ 965 రోజుల క్రితం కుటుంబ పెద్దదిక్కుగా ఉన్న తండ్రిని కోల్పోయి బతుకు తెరువు కోసం జిల్లా కేంద్రానికి వచ్చారు ఈ కుటుంబం. వీరి బాధను అర్థం చేసుకొని సామాజిక కార్యకర్త ఒకరు 1098 కు పోన్ చేసి వీరికి రక్షణ తో పాటు పిల్లలకు చదువు, తల్లికి ఉపాధి కల్పించాలని అధికారులను కోరారు. అధికారులు మాత్రం వీరిని తీసుకెళ్ళి వివరాలు రాసుకుని వదిలి వేసారు. తినడానికి తిండి లేక, ఉపాధి అవకాశాలు లేక భిక్షాటన చేయడం మొదలుపెట్టారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ వీరు మద్యానికి, డిపో కల్లుకు బానిసలయ్యారు.అంతేకాదు అప్పుడప్పుడు డ్రగ్స్ తీసుకుంటున్నట్లు సమాచారం. పిల్లల సంక్షేమం కోసం, ముఖ్యంగా తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలకోసం ఎన్నో సంక్షేమ పథకాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నా, ఆపథకాలు వీరికి అందకపోవడం లో ఆంతర్యం ఏమిటి? దేశంలోని 6-14 సంవత్సరాల వయస్సు పిల్లల కొరకు తెచ్చిన "నిర్భంద విద్యా హక్కు చట్టం- 2009" కి వీరు అర్హూలు కారా ? అని సామాజిక కార్యకర్తలు అడుగుతున్నారు. పసి పిల్లల సంరక్షణ కోసం అంగన్వాడీ కేంద్రాలు, బాలసదనం, మరియు చైల్డ్ కేర్ సెంటర్లు ఎన్ని ఉన్నా, వీరిని పట్టించుకునే వారు కరువయ్యారు. అనాధలైన, తప్పిపోయిన 6 నుంచి 18 సంవత్సరాల లోపు పిల్లలను గుర్తించి వారిని తల్లిదండ్రులకు అప్పగించాలని, లేదా బాలసదనం లో ఉంచి చదివించాలని సుప్రీం కోర్టు 2016 లో రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. దీనికి అనుగుణంగా ఏటా జనవరి ఒకటో తేదీ నుంచి 31 వ తేదీ వరకు "ఆపరేషన్ స్మైల్" పేరుతో జులై ఒకటో తేదీ నుంచి 31 వ తేదీ వరకు "ఆపరేషన్ ముస్కాన్" పేరుతో ప్రత్యేక దాడులు నిర్వహించి పిల్లలను గుర్తించి బాలల సంరక్షణ కమిటీ కి అప్పగిస్తున్నారు. కానీ జిల్లా కేంద్రం నగరం నడిబొడ్డున ఉన్న భువనగిరి బస్ స్టేషన్ లో భిక్షాటన చేస్తూ , దుర్బర జీవితం గడుపుతున్న,వీరిని మాత్రం గుర్తించకపోవడం విడ్డూరంగా ఉందని సామాజిక కార్యకర్తలు, ప్రజా సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. బాల్యం ఎంతో విలువైనది. పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకొనే భాద్యతలు తల్లిదండ్రుల పైనా, మరియు ప్రభుత్వల పైనా ఉంది. ఇప్పటికైనా భిక్షాటన చేస్తున్న పిల్లలను గుర్తించి, తగిన వసతి కల్పించి, పిల్లలకు విద్యాబుద్దులు నేర్పించాలని, తల్లి అనారోగ్యంతో బాధపడుతున్న కారణంగా ఆమె కు మెరుగైన చికిత్స చేయించాలని సామాజిక కార్యకర్తలు కోరుతున్నారు. *పిల్లలను రక్షించండి, లేకుంటే సంఘం విద్రోహ శక్తులుగా మారే ప్రమాదం ఉంది* *కొడారి వెంకటేష్*. సామాజిక కార్యకర్త. గత రెండు సంవత్సరాలుగా భువనగిరి బస్ స్టేషన్ లో భిక్షాటన చేస్తూ గడుపుతున్న కుటుంబం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ డివిజన్ , దామెర ప్రాంతానికి చెందిన వారు. తల్లి హసీనా (30). పిల్లలు, రషీద్ (11) హైమ్మద్ (9) లు ఇప్పటికే మద్యానికి బానిసలయ్యారని, వీరిని ఇలాగే వదిలి పెడితే భవిష్యత్తులో సంఘ విద్రోహ శక్తులుగా మారే అవకాశం ఉందని ఆయన అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వీరికి మంచి జీవితాన్ని ఇవ్వడానికి కృషి చేయాలని కోరారు.
Aug 22 2024, 20:35