NLG: బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన ఎన్నారై నవీన్ రెడ్డి
నల్లగొండ జిల్లా: ఆర్థిక సమస్యలతో ఇటీవల మృతి చెందిన మర్రిగూడ మండలం సరంపేట గ్రామానికి చెందిన, దామెర అబ్బయ్య కుటుంబ సభ్యుల ఆర్థిక పరిస్థితులు తెలుసుకొన్న NRI కే. నవీన్ రెడ్డి, ఆదివారం సరంపేట సర్పంచ్ వేనమళ్ళ వెంకటమ్మ - మధుకర్ ద్వారా 20,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వేనమళ్ళ వెంకటమ్మ - మధుకర్, వేనమళ్ళ నర్సింహ, దామెర రాములు పాల్గొన్నారు.
TS: తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ లో నేడు అటుకుల బతుకమ్మ
ప్రకృతి సిద్ధమైన పూలను గుండ్రంగా అందంగా ఒక దానిపైన ఒకటి పేర్చి, ఆ పూలనే పార్వతి దేవి (గౌరీ దేవి)గా భక్తిశ్రద్ధలతో కొలిచే పూల పండుగనే బతుకమ్మ పండుగ. ఆడపడుచులు అంతా సాయంత్రం ఒక చోటికి చేరి మధ్యలో బతుకమ్మలను ఉంచి చుట్టూ రౌండ్ గా నిలబడి.. చిత్తు చిత్తుల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ.. బంగారు బొమ్మ బంగారు బొమ్మ దొరికినమ్మో ఈ వాడలో.. అంటూ పాటలు పాడుకుంటూ బతుకమ్మ ఆట ఆడుతారు. బతుకమ్మ ఆటలకు పలు పాటలు ప్రసిద్ధిగా ఉన్నాయి. ఈ బతుకమ్మ పండుగ తెలంగాణలో ఘనంగా జరుపుకునే పండుగలో ఒకటి. ఈ బతుకమ్మ పండుగను తొమ్మిది రోజులు జరుపుకుంటారు. రోజుకు ఒక పేరుతో జరుపుకుంటారు.

మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమై, చివరి రోజు సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది.
మొదటి రోజు - ఎంగిలిపూల              బతుకమ్మ
రెండవ రోజు - అటుకుల బతుకమ్మ
మూడవరోజు - ముద్దపప్పు బతుకమ్మ
నాలుగవ రోజు - నానే బియ్యం బతుకమ్మ
ఐదవ రోజు - అట్ల బతుకమ్మ
ఆరవ రోజు - అలిగిన బతుకమ్మ
ఏడవ రోజు - వేపకాయల బతుకమ్మ.
ఎనిమిదవ రోజు - వెన్నముద్దల   బతుకమ్మ
తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ

నేడు రెండవ రోజు అటుకుల బతుకమ్మ: ఈరోజు అమ్మవారికి వాయినం గా అటుకులను సమర్పిస్తారు. నైవేద్యంగా సప్పిడి పప్పు, బెల్లం, అటుకులు సమర్పిస్తారు. బతుకమ్మ పేర్చడానికి తంగేడు, గునుగు, బంతి, చామంతి, అడవి గడ్డి పూలు తీసుకువస్తారు. ఈ పూలను రెండు ఎత్తు లలో గౌరమ్మను పేర్చి, ఆడవారు అందరూ కలసి బతుకమ్మ ఆటలు ఆడుతూ, పాటలు పాడుతూ భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు కూడా ఈ రోజు నుండే ప్రారంభమవుతాయి. SB NEWS TELANGANA


ఎన్నికల ప్రవర్తనా నియమావళి పై అవగాహన కల్పించిన మర్రిగూడ ఎస్సై

నల్లగొండ జిల్లా, మర్రిగూడ మండలం లెంకలపల్లి గ్రామంలో మర్రిగూడ మండల ఎస్సై రంగారెడ్డి.. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమాలు పైన శనివారం గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్సై రంగారెడ్డి మాట్లాడుతూ.. అక్టోబర్ 9వ తేదీ నుండి ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిందని, పౌరులందరూ ఎలక్షన్స్ ప్రవర్తన నియమాలని పాటించాలని, ప్రచారాలకు, మీటింగ్ లకు, ర్యాలీ లకు బ్యానర్లు కట్టుటకు, హోల్డింగ్ లు పెట్టుటకు రిటర్నింగ్ అధికారి అనుమతి తీసుకోవాలని, 50వేల కంటే ఎక్కువ నగదును దగ్గర పెట్టుకోవద్దని, 50 వేల పైన నగదు ఉంటే తగిన ఆధారాలు చూపించాల్సి ఉంటుందని, బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించరాదని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో ప్రతి ఒక్క పౌరుడు తన ఓటు హక్కును వినియోగించుకోవాలని అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పోలీసులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

SB NEWS NALGONDA DIST

SB NEWS TELANGANA

దేవరకొండలో ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో దమ్మదీక్ష దివస్
నల్లగొండ జిల్లా, దేవరకొండలో ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నేడు 67వ దమ్మదీక్ష దినోత్సవాన్ని పురస్కరించుకొని.. ప్రజా సంఘాల నాయకులు బుద్ధిష్ట్ డాక్టర్ ఏకుల రాజారావు, కంబాలపల్లి వెంకటయ్య ఆధ్వర్యంలో బుద్ధ వందనం చేసి, దమ్మదీక్ష దివస్ ను ఘనంగా నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. బోది సత్వ డాక్టర్ బిఆర్ అంబేద్కర్,  14 అక్టోబర్ 1956 నాగపూర్ లోని దీక్షభూమి వద్ద ఐదు లక్షల మందితో బౌద్ధ దమ్మ దీక్షను స్వీకరించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ జిల్లా నాయకులు ధర్మపురం శ్రీను, సైదులు, అంజయ్య భాస్కరాచారి పాల్గొన్నారు.

SB NEWS NALGONDA

SB NEWS TELANGANA
గ్రహణం సందర్భంగా.. ఆ రెండు ప్రధాన దేవాలయాలు మూసివేత ఎప్పుడంటే..
ఈనెల 28న చంద్రగ్రహణం సందర్భంగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం అదేవిధంగా విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాలను మూసివేయనున్నారు. చంద్రగ్రహణం సందర్భంగా ఆరోజు సాయంత్రం 6 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 9 గంటల వరకు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని మూసి వేయనున్నట్లు అధికారులు తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని ఈనెల 28 రాత్రి 7.05 గంటల నుండి ఆ తర్వాతి రోజు తెల్లవారుజామున 3.15 వరకు మూసి వేయనున్నారని అధికారులు తెలిపారు.

SB NEWS
NLG: నాగార్జున ప్రభుత్వ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ నాగుల వేణు కు డాక్టరేట్

నల్లగొండ జిల్లా కేంద్రంలోని నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రభుత్వ పాలనా శాస్త్ర విభాగం లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్న నాగుల వేణు కు ఉస్మానియా యూనివర్సిటీ డాక్టర్ రేట్ ను ప్రధానం చేసింది.

"యాదాద్రి భువనగిరి జిల్లా లో పంచాయతీరాజ్ వ్యవస్థలు మహిళ సాధికారత" అనే అంశంపై ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి పర్యవేక్షణలో పరిశోధన నిర్వహించడం జరిగింది. ఈ పరిశోధనకు గాను ఉస్మానియా విశ్వవిద్యాలయం అధ్యాపకులు నాగుల వేణు కు డాక్టరేట్ ను ప్రధానం చేసింది.

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ సముద్రాల ఉపేందర్ అధ్యాపక మరియు అధ్యాపకేతర సిబ్బంది ఆయనను అభినందించి, సన్మానించి ఘనంగా సత్కరించారు.

నల్లగొండ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఘనంగా బతుకమ్మ వేడుక
నల్లగొండ:  జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల లో శుక్రవారం బతుకమ్మ సంబరాలు కళాశాల ప్రథానా చార్యులు డా. ఘనశ్యాం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవంలో రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చారు. పండ్లు, ఫలహారాల తో బతుకమ్మలను పూజించారు.ఈ బతుకమ్మ సంబరాలలో ప్రథానాచార్యులు, ఉప ప్రథానాచార్యులు, అధ్యాపక బృందం, ఇతర సిబ్బంది, విద్యార్థులు ఉత్సవంలో పాల్గొన్నారు.  విద్యార్థులు తమ ఆటపాటలతో  ఆకట్టుకున్నారు. SB NEWS NALGONDA DIST

SB NEWS TELANGANA
NLG: నాగార్జున ప్రభుత్వ కళాశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
నల్లగొండ: జిల్లా కేంద్రంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాలలో శుక్రవారం బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. మహిళా అధ్యాపకులు, విద్యార్థులు కలిసి రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి అద్భుతంగా ఆడి పాడారు. ఈ సందర్భంగా కళాశాల ప్రధానాచార్యులు డాక్టర్ సముద్రాల ఉపేందర్ మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతికి ప్రతీకయైన బతుకమ్మ పండుగను, ప్రతి పల్లెలో ఆడపడుచులు ఘనంగా జరుపుకోవడం జరుగుతుందని అన్నారు. పర్యావరణ పరిరక్షణే పరమార్ధంగా ప్రకృతిని ఆరాధించడంలో భాగంగా, ఈ బతుకమ్మ పండుగను జరుపుకోవడం తెలంగాణకు ఎంతో గర్వకారణమని అన్నారు సాహిత్య సాంస్కృతిక విభాగం, మహిళా సాధికారత విభాగం, జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో నిర్వహించబడిన ఈ కార్యక్రమంలో ఎన్. లవేందర్ రెడ్డి, డాక్టర్ గంజి భాగ్యలక్ష్మి, డాక్టర్ నాగుల వేణు,ఇ. యాదగిరి రెడ్డి, వెంకట్ రెడ్డి, శివరాణి, డాక్టర్ ఎన్. దీపిక, డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య, డాక్టర్ వి. వి. సుబ్బారావు, డాక్టర్ వి. శ్రీధర్, డాక్టర్ ఎ.దుర్గా ప్రసాద్, కె. మల్లేష్, తదితర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

SB NEWS NALGONDA DIST

SB NEWS TELANGANA
ట్రినిటీ స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాలలో పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్ వెన్ రెడ్డి రాజు
YBD: చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని బస్ స్టాప్ పక్కన ఉన్నటువంటి ఖాళీ స్థలంలో ట్రినిటీ స్కూల్ యాజమాన్యం బతుకమ్మ సంబరాలు నిర్వహించడం జరిగినది. మున్సిపల్ చైర్ పర్సన్ వెన్ రెడ్డి రాజు సంధ్య దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెన్ రెడ్డి రాజు మాట్లాడుతూ.. ప్రకృతిని ఆరాధించే పూల పండుగను ఘనంగా జరుపుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ అంతటి విజయలక్ష్మి బాలరాజు, కాసర్ల మంజుల శ్రీనివాస్ రెడ్డి, ట్రినిటీ స్కూల్ డైరెక్టర్ క్రిష్ణారావు, ప్రిన్సిపాల్ ఉజ్జిని మంజుల, గాంధీ గ్లోబల్ ట్రస్టు ప్రధాన కార్యదర్శి యానాల ప్రభాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు
TS: ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీని బదిలీ చేయండి: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం, హైదరాబాద్: రాబోయే ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న కుమురం భీమ్ అసిఫాబాద్ జిల్లా ఎస్పీ కే.సురేష్ కుమార్ ను తక్షణమే బదిలీ చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.

ఈ మేరకు హైదారాబాద్ లో రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి వికాస్ రాజు తో భేటీ తర్వాత మీడియా కు ప్రకటన విడుదల చేశారు. జిల్లా ఎస్పీ కే.సురేష్ కుమార్ స్థానిక ఎమ్మెల్యే కోనేరు కొనప్ప తో అనుకూలంగా వ్యవహరించిన తీరును, ఎన్నికల నియమ నిబంధనలను దుర్వినియోగం చేస్తున్న తీరును ఎన్నికల ప్రధాన అధికారికి వివరించామని తెలిపారు.అన్ని అంశాలను పరిశీలిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి హామీ ఇచ్చారన్నారు.

ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి ఎమ్మెల్యేకు చెందిన ఓ ప్రైవేట్ ట్రస్టుకి జిల్లా ఎస్పీ వెళ్లి ప్రజల ముందు ఎమ్మెల్యేను సన్మానించి అక్కడ ఫోటోలు దిగిన తీరును పిర్యాదు కు జత చేశారు. వచ్చే ఎన్నికల్లో మద్యం, డబ్బు పంపిణీపై ఎన్నికల సంఘం పకడ్బందీగా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి, ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని కోరారు. ఎమ్మెల్యే కోనేరు కొనప్ప కుటుంబం మట్కా అనేక చట్ట వ్యతిరేక కార్యకలాపాలలో అధికార బీఆర్ఎస్ నేతలు చురుకుగా పాల్గొంటున్నప్పటికీ, స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా నిందితులపై కేసు నమోదు చేయడంలేదని ఆరోపించారు.

జిల్లాలో ప్రతిపక్ష నాయకులపై, రాజకీయ ప్రత్యర్థులపై జిల్లా ఎస్పీ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టాన్ని ఉపయోగించి తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అక్రమ కేసుల వెనుక ఎమ్మెల్యే కోనేరు కొనప్ప హస్తం ఉందని ఆరోపించారు. బీఎస్పీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న ముగ్గురు ఢిల్లీ యూనివర్శిటీకి చెందిన అమాయక విద్యార్థి వాలంటీర్లను ఎమ్మెల్యే అనుచరులు కిడ్నాప్ చేసి తీవ్రంగా కొట్టినా.. కాగజ్‌నగర్ రూరల్ స్టేషన్ లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి పోలీసులు భయపడ్డారని అన్నారు.

స్వయంగా ముగ్గురు సీనియర్  ఐపీఎస్ అధికారులతో మాట్లాడితే తప్ప, ఎఫ్ఐఆర్ నమోదు కాలేదన్నారు. తెలంగాణాలో జరగనున్న రాబోయే ఎన్నికల్లో నిష్పక్షపాతంగా జరిగేలా ఐఏఎస్, ఐపీఎస్ ల బదిలీలు చేపట్టినందుకు ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘానికి ధన్యవాదాలు తెలిపారు.