ప్రజల్లో విశ్వాసం కోల్పోతున్న మీడియా.కందుకూరి యాదగిరి సీనియర్ పాత్రికేయులు
ప్రజల్లో విశ్వాసం కోల్పోతున్న మీడియా.కందుకూరి యాదగిరి సీనియర్ పాత్రికేయులు
Streetbuzz news నల్గొండ జిల్లా :
సమాజంలో జరుగుతున్న అన్యాయాలను అక్రమాలను అవినీతిని ఎండగట్టి ప్రజల పక్షాన ఫోర్త్ ఎస్టేట్ గా నిలబడవలసిన మీడియా గాడి తప్పిందా? ప్రజల్లో విశ్వాసం కోల్పోతుందా?సన్నగిల్ల చేసుకుంటుందా?ఈ ప్రశ్నలకు 90 శాతం ప్రజలు నిజంగానే మీడియా ఎప్పుడో గాడి తప్పిందని ఒకప్పుడు ఉన్న విశ్వాసం ప్రస్తుతం లేదని సమాధానం చెప్పే పరిస్థితి కనిపిస్తున్నది.ఒకప్పుడు ఎక్కడైనా ఎవరికైనా అన్యాయం జరిగిందంటే న్యాయం చేసేందుకు సింహం జూలు విదిల్చుకొని లేచి గాండ్రించి పంజా విసిరిన చందంగా పెద్దన్న పాత్ర పోషించిన మీడియా.. ప్రస్తుతం ఇలాంటి సంఘటనలు సమాజంలో ఎన్నో జరుగుతున్నప్పటికీ చూసి చూడనట్లు,రాసి రాయనట్లు,చెప్పి చెప్పినట్లు గా వ్యవహరించటం వెనక ఆంతర్యం ఏమిటని సభ్య సమాజం సందేహంలో పడింది. ప్రస్తుతం మీడియా అంతా మనీ మైండ్ తో కొనసాగుతోందని జనం మాట్లాడుకుంటున్నారు.ఇంకొక అడుగు ముందుకేసి మీడియా పైన విశ్వాసం లేనట్లుగా ప్రజలు వ్యవహరించడానికి కారణాలు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాష్ట్రాలను దేశాలను పరిపాలిస్తున్న ప్రతినిధుల వ్యవహార శైలి ఒంటెద్దు పోకడలో ఉన్నప్పుడు జీర్ణించుకోలేని ప్రజలు ఆశ్రయించేది ప్రచారమాధ్యమాలను.ఆ ప్రచార మాధ్యమాలు ప్రజల ఆవేదన లో భాగస్వాములు కాకుండా స్వలాభం కోసం కొన్ని మీడియా సంస్థలు ఎక్కడో ఒకచోట ప్రజా సమస్యలకు చోటు ఇచ్చి మిగులు భాగం అంతా ప్రకటనలకు పరిమితమైనట్లు బహిర్గతంగానే తెలుస్తోంది. ఎప్పుడైతే మీడియా ధనాపేక్షకు ప్రధాన విలువలిస్తుందో దాని ప్రారంభ సంకల్ప ఔన్నత్యాన్ని కోల్పోతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ప్రతికూల అనుకూల పరిస్థితులు ఏమైనా కానీ తన నిజస్వరూపాన్ని మార్చుకోకుండా ఉన్నప్పుడే మీడియాపై ప్రజలకు విశ్వాసం ఉంటుంది.ప్రచురిస్తున్న కథనాల తీరుతెన్నులను సమాజం గమనిస్తుందన్న సంగతులు మర్చిపోయిన వారు లేదా ఎవరేమనుకుంటే తమకేం అనుకునేవారు గాడి తప్పిపోతున్నారని ప్రత్యేకంగా చూపించాల్సిన పనిలేదు. అరకదున్నుతున్న రైతు చేతిలో ముళ్ళు కర్ర ఎంత ముఖ్యమో ప్రజాస్వామ్యంలో ప్రజలు తప్పు చేసిన ప్రభుత్వాలు చట్టవిరోధంగా పని చేస్తున్న గాడి తప్పే అరకలాంటి ప్రజాస్వామ్యాన్ని, వ్యవస్థను,ప్రభుత్వాలను చక్కపెట్టే పనిలో ఉండాల్సిన మీడియా ఎప్పుడు ప్రజాస్వామ్యం ప్రభుత్వాలు తప్పు చేస్తాయా తిలా పాపం తల పిడికెడు అందామా అని ఎదురుచూస్తున్నట్లు ఉంది మీడియా పోకడ.సమాజంలో జరుగుతున్న సంఘటనలను సమాచారాలను ప్రజలకు చేరవేయడంలో ప్రస్తుతం మీడియా ఎంతవరకు సామాజిక బాధ్యత వహిస్తున్నది? అన్న ప్రశ్నకు ఏ మీడియా వద్ద సరైన సమాధానం లేదనేది ఒప్పుకోవాల్సిన సత్యం. పెరిగిన ఆధునిక టెక్నాలజీ కి తగినంతగా సమాచార సేకరణలో న్యాయం వైపు ఉండి కలం గలాలతో దిశా నిర్దేశం చేయాల్సిన ఫోర్త్ ఎస్టేట్ అందుకు తగినట్లుగా ఎందుకు వ్యవహరించట్లేదు!? 20 ఏళ్ల క్రితం ఉన్న సమాజానికి ప్రస్తుత సమాజానికి చాలా తేడా కనిపిస్తున్నది.ఎక్కడ ఎన్ని మార్పులు వచ్చినా మీడియాలో మార్పులు రాకూడదు అనేది ప్రజల యొక్క బలమైన కోరిక. పనికిమాలిన మీడియా, సొమ్ములకు అమ్ముడు పోయే మీడియా,అక్రమాలకు కొమ్ముకాస్తున్న మీడియా,స్వలాభం చూసుకుంటున్న మీడియా,స్వార్థ బుద్ధితో కొనసాగుతున్న మీడియా సామాజిక స్పృహ లేని మీడియా, సమాచార వ్యవస్థ మీద సమాజానికి ఇలాంటి ఆలోచన రాకముందే ప్రజలకు యావగింపు రాకముందే మీడియా పైననే ఆధారపడే 80 శాతం ప్రజల ఆత్మఘోషను వినిపించేందుకు చూపించేందుకు వెనువెంటనే తేరుకోవాలని సభ్య సమాజం ఎదురుచూస్తున్నది
కందుకూరి యాదగిరి
సీనియర్ పాత్రికేయులు
Mar 23 2023, 10:43