కొండా సురేఖ రాజీనామా - హైకమాండ్ ఆదేశం..!
మంత్రి పదవికి కొండా సురేఖ రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. సినీ హీరో నాగార్జున కుటుంబం పైన మంత్రి చేసిన వ్యాఖ్యల పైన సినీ పరిశ్రమ భగ్గుమంది. ఈ వ్యవహారంలో నాగార్జున కుటుంబం రాహుల్ గాంధీ జోక్యం కోరింది. ప్రియాంక గాంధీ నేరుగా అమలతో మాట్లాడారు. సురేఖ పై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని సమాచారం. ఫలితంగా సురేఖను తప్పించకుండా..తనంతట తానే రాజీనామా చేయాల్సిందిగా సూచించాలని కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశించినట్లు తెలుస్తోంది.
మంత్రి కొండా సురేఖకు పదవీ గండం ఏర్పడింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను టార్గెట్ చేసే క్రమంలో నాగార్జున కుటుంబం గురించి సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేసారు. సమంత, రకుల్ ప్రీత్ సింగ్ పేర్లు ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యల పైన సినీ ప్రముఖులు మండిపడ్డారు. జాతీయ స్థాయిలోనూ ఈ వ్యాఖ్యలు రచ్చగా మారాయి. మంత్రి సురేఖ వ్యాఖ్యల పైన పలువురు అభ్యంతరం వ్యక్తం చేసారు. సినీ పరిశ్రమకు చెందిన పలువురు రాహుల్ ను ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా సురేఖ పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.
ఇదే సమయంలో ప్రియాంక గాంధీ నేరుగా అమలతో మాట్లాడినట్లు తెలుస్తోంది. ప్రియాంక గాంధీ - అమల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే అమల తమ కుటుంబం సురేఖ వ్యాఖ్యలతో ఆవేదనలో ఉన్నట్లు వివరించారు. అటు నాగార్జున సైతం కొండా సురేఖ పైన కేసు దాఖలు చేసారు. నోటీసులు పంపారు. ఇక..కొండా సురేఖ వ్యాఖ్యలతో జరిగిన డామేజ్ కంట్రోల్ కు పార్టీ అధినాయకత్వం టీపీసీసీ నేతలకు కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొండా సురేఖ తన వ్యాఖ్యలను ఉప సంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. కానీ, సినీ పరిశ్రమ మాత్రం చర్యలకు డిమాండ్ చేస్తోంది.
పార్టీ హైకమాండ్ మంత్రి పదవికి సురేఖతో రాజీనామా చేయించాలని టీపీసీసీకి సూచించినట్లు పార్టీ ముఖ్య నేతల సమాచారం. పదవి నుంచి తెలిగించకుండా.. సురేఖ తనంతటగా తానే రాజీనామా చేసేలా ఒప్పించాలని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. సురేఖ తన వ్యాఖ్యలను ఉప సంహరించుకున్నారని టీపీసీసీ నేతలు హైకమాండ్ కు వివరించినా.. పార్టీ నాయకత్వం మంత్రి సురేఖ పై చర్యలు తీసుకోవాలని నిర్దేశించినట్లు చెబుతున్నారు. దీంతో, సురేఖ తో మంత్రి పదవికి రాజీనామా చేయించేలా పార్టీ ముఖ్యులకు బాధ్యతలు అప్పగించారని ముఖ్య నేతల్లో చర్చ జరుగుతోంది. ఈ రోజు లేదా రేపు సురేఖ మంత్రి పదవికి రాజీనామా చేసే అవకాశం ఉందంటూ పార్టీలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది.
Oct 05 2024, 10:19