వైజాగ్ స్టీల్ ప్లాంట్ నిర్ణయంపై వైఎస్ షర్మిల..!
ఏపీలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఓవైపు రచ్చ కొనసాగుతుండగానే.. మరోవైపు 4200 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల తొలగింపుకు యాజమాన్యం సిద్ధమైంది. ఈ మేరకు వారికి క్లారిటీ కూడా ఇచ్చేసింది. దీంతో కార్మికులు మరోసారి రోడ్డెక్కారు. వీరికి నిన్న సంఘిభావం ప్రకటించిన ఏపీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల.. సీఎం చంద్రబాబుకు డెడ్ లైన్ పెట్టారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల తొలగింపును అడ్డుకోకపోతే అక్కడే నిరసన దీక్షకు దిగుతానని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ నుంచి ఇవాళ ఓ ప్రకటన వచ్చింది.
స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తున్న 4200 మంది కాంట్రాక్టు ఉద్యోగుల తొలగింపు నిర్ణయంపై యాజమాన్యం వెనక్కి తగ్గింది. దీంతో స్టీల్ ప్లాంట్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ వైఎస్ షర్మిక ఓ ప్రకటన విడుదల చేశారు. కాంట్రాక్టు ఉద్యోగుల తొలగింపుపై స్టీల్ ప్లాంట్ వెనక్కి తగ్గడాన్ని ఆమె స్వాగతించారు.
ఇది కాంగ్రెస్ పార్టీ విజయం అన్నారు. దీక్షకు దిగుతానని తాను చేసిన హెచ్చరికల వల్లే స్టీల్ ప్లాంట్ ఈ నిర్ణయం తీసుకుందన్నారు. ఈ సందర్భంగా స్టీల్ ప్లాంట్ కార్మికులకు షర్మిల ఓ మాట కూడా ఇచ్చారు.
తాము పెట్టిన 48 గంటల గడువుకి దిగివచ్చి , యాజమాన్యం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకొని, విశాఖ స్టీల్ ప్లాంట్ లో తొలగించిన 4200 మంది కాంట్రాక్టు కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవడం కాంగ్రెస్ పార్టీ విజయమని వైఎస్ షర్మిల పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ మీ పక్షమని, మీకోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమని కార్మికులకు ఆమె తెలిపారు. ఇవాళ కాంట్రాక్ట్ కార్మికుల పక్షాన పోరాడి గెలిచామని, ఇదే స్పూర్తితో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమిద్దామన్నారు.
మోడీ మెడలు వంచి మన ఆత్మగౌరవం విశాఖ ఉక్కును పరిరక్షించుకుందామని వారికి పిలుపునిచ్చారు.
Oct 04 2024, 20:52