అమరావతికి ప్రపంచ బ్యాంకు రుణం - కేంద్రానికి లేఖ, కీలక మలుపు..!!
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో కీలక అడుగు పడింది. ప్రపంచ బ్యాంకు నుంచి రూ 15 వేల కోట్ల రుణానికి సంబంధించి సూత్రపాయంగా ఆమోదం లభించింది .ఈ మేరకు కేంద్రానికి ప్రపంచ బ్యాంకు నుంచి లేఖ అందింది. ప్రస్తుత ఆర్దిక సంవత్సరంలోనే ఈ మొత్తం సీఆర్డీఏకు అందనున్నాయి. అదే సమయంలో ఏపీకి రుణంగా ఇస్తున్న ఈ మొత్తం లోనూ కేంద్ర వాటా పైన స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది.
రాజధాని అమరావతికి కేంద్ర బడ్జెట్ లో రూ 15 వేల కోట్ల మేర రుణ సదుపాయం కల్పిస్తామని ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధులు అమరావతిలో పర్యటించారు, ఏపీ సీఎంతో పాటుగా సీఆర్డీఏ అధికారులతో సమావేశాలు నిర్వహించారు. తాజాగా కేంద్రానికి ప్రపంచ బ్యాంకు ఏపీ రాజధాని కోసం రూ 15 వేల కోట్ల రుణం ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేస్తూ లేఖ రాసింది. దీంతో, రుణం మంజూరుకు సంప్రదింపులు వేగవంతం అయ్యాయి. అందులో భాగంగా కేంద్ర ఆర్దిక శాఖ అధికారులతో ప్రపంచ బ్యాంకు అధికారులు ఈ రోజు కీలక సమావేశం నిర్వహించనున్నారు.
ప్రస్తుత ఆర్దిక సంవత్సరంలోనే ఈ మొత్తం సీఆర్డీఏకు అందనుంది. రాజధానిలో మౌళిక వసతుల కల్పనతో పాటుగా భూసమీకరణలో భూములిచ్చిన రైతులకు స్థలాలు కేటాయించిన లే అవుట్ ల డెవలప్ మెంట్, శాసనసభ, హైకోర్టు, సచివాలయం, విభాగాధిపతుల కార్యాయల భవనాల టవర్ల నిర్మాణానికి రూ 49 వేల కోట్ల ఖర్చు అవసరమని సీఆర్డీఏ అంచనా వేసింది. ఈ నెల 15వ తేదీ నాటికి సంతకాల ప్రక్రియ ముగియనుంది. ఆ వెంటనే రుణం మొత్తంలో 25 శాతం అంటే రూ 3,750 కోట్లు అడ్వాన్స్ గా తీసుకునే అవకాశం ఉంటుంది. నవంబర్ లో ఈ మొత్తం అందుతాయని అంచనా వేస్తున్నారు.
ఇక, ఏపీ రాజధానికి ప్రపంచ బ్యాంకు.. ఏడీబీ రుణం ఇస్తున్నా అది ఏపీ ప్రభుత్వం పైన భారం పడదని ఆర్దిక శాఖ అధికారులు చెబుతున్నారు. కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులిస్తోంది. ఈ రుణం పై 15 ఏళ్ల మారిటోరియం ఉంటుంది. చెల్లించాల్సిన వడ్డీ నాలుగు శాతం లూపే ఉంటుందని చెబుతున్నారు. ఈ రుణం లో కేంద్రం 90 శాతం..రాష్ట్రం 10 శాతం చొప్పున భరించనున్నట్లు అధికారులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన నిధులను కూడా కేంద్రం వేరే నిధుల నుంచి సర్దుబాటు చేస్తుందని చెబుతున్నారు. అయితే, రుణం మంజూరు..విధి విధానాల పైన వచ్చే వారం ఢిల్లీలో కీలక సమావేశం జరగనుంది. తాజా రుణంతో అమరావతి నిర్మాణం వేగవంతం అయ్యే అవకాశం ఉంది.
Oct 02 2024, 09:53