అక్రమ హర్మ్యం
తొలుత 12 అంతస్తులకు అనుమతి తీసుకున్నారు! తర్వాత దానిని 20 అంతస్తులకు పెంచుకున్నారు! చివరకు, 30 అంతస్తులకు అనుమతి ఇవ్వాలంటూ దరఖాస్తు చేసుకున్నారు! అక్కడ అన్ని అంతస్తులకు అనుమతి ఇవ్వడానికి నిబంధనలు అంగీకరిస్తాయా!? అంటే.. ‘లేదు’ అన్నదే జవాబు! అయినా.. నిర్మాణదారుడు అడిగితే.. జీహెచ్‌ఎంసీ అధికారులు అడ్డగోలుగా అనుమతులు ఇచ్చేశారు! హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్కుకు కూతవేటు దూరంలో.. జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 45లోని నిర్మాణమిది! దీనిపై సర్కారుకు పెద్దఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దాంతో, విజిలెన్స్ విచారణ జరిగింది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం ఉన్నట్లు విజిలెన్స్ నిర్ధారించింది. నిర్మాణాన్ని నిలిపి వేసి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసింది. బిల్డర్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని సూచించింది. వివరాల్లోకి వెళితే..
షేక్‌పేట్ మండల పరిధిలోని నందగిరి హిల్స్ ప్రాంతంలో హెచ్‌ఎండీఏ నుంచి హుడా వేలంలో జి.అమరేందర్ రెడ్డి అనే వ్యక్తికి చెందిన నెట్ నెట్ వెంచర్స్ సంస్థ 4.748 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. అక్కడ 12 అంతస్తుల (జీ+4, 7 సెల్లార్లు) నిర్మాణం చేపట్టేందుకు 2013లో జీహెచ్‌ఎంసీ నుంచి అనుమతి పొందింది. తర్వాత 2015లో రోడ్డు నంబరు 45లోనే ఉన్న జూబ్లీహిల్స్ హౌజింగ్ సొసైటీలో 865.42 చదరపు గజాల భూమిని కొనుగోలు చేసింది. దాని పక్కనే ఉన్న మరో 866 గజాల భూమిని 2021లో కొంది. ఈ రెండూ జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు 45కు ఆనుకునే ఉంటాయి. వీటి వెనక నెట్ నెట్ వెంచర్స్ స్థలం ఉంటుంది. నిజానికి, రోడ్డు నంబరు 45కు ఇరువైపులా ఉన్న స్థలాల్లో నిర్మాణాలకు కొంత వెసులుబాటు కలిగిస్తూ 2017లో ప్రభుత్వం జీవో 305 విడుదల చేసింది. దాని ప్రకారం.. రోడ్డుకు ఇరువైపులా ఉన్న స్థలాల్లో 30 మీటర్ల వరకు నిర్మాణాలు చేసుకోవచ్చు. ఈ నిబంధన జూబ్లీహిల్స్ హౌజింగ్ సొసైటీ లే అవుట్‌కు మాత్రమే వర్తిస్తుంది.
కానీ, దాని వెనక ఉన్న హుడా లే అవుట్ (హెచ్‌ఎండీఏ నుంచి కొనుగోలు చేసిన స్థలం)కు వర్తించదు. అయినా.. ఆ నిబంధనను అడ్డం పెట్టుకొని తమకు 30 మీటర్లలో నిర్మాణానికి అనుమతి ఇవ్వాలంటూ నెట్ నెట్ వెంచర్స్ దరఖాస్తు పెట్టుకుంది.
అధికారుల అండతో 30 మీటర్లకు అనుమతి సంపాదించింది. అక్కడితో ఆగలేదు. దశలవారీగా జీ+4 నుంచి జీ+5; ఆ తర్వాత జీ+12, చివరకు జీ+13 (20 అంతస్థులు.. వీటిలో జీ+13, ఒక సెల్లార్, 5 స్టిల్ట్‌లు ఉంటాయి)కు అనుమతి సంపాదించింది. మొత్తం 2,09,620 చదరపు అడుగుల్లో నిర్మాణం చేసుకునేలా అనుమతి పొందింది. పదేళ్ల కాలంలో జీ+4 నుంచి ఏకంగా జీ+13 అంతస్తుల వరకు నిర్మాణానికి అనుమతులు సంపాదించింది. ఇక్కడ సెవెన్ స్టార్ హోటల్, మల్టీప్లెక్స్, షాపింగ్ మాల్ నిర్మిస్తామని పేర్కొంది. ఇది హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, పర్యావరణ నిబంధనలకు విరుద్ధం. అక్కడ అలాంటి భారీ ప్రాజెక్టును నిర్మించేందుకు ఎలాంటి ఆస్కారం లేదు. ఇక జూబ్లీహిల్స్ సొసైటీ నుంచి కొనుగోలు చేసిన రెండు ప్లాట్లను కాంప్లెక్సుకు వెళ్లే దారిగా చూపించారు. సొసైటీ బైలాస్ ప్రకారం.. ఆయా ప్లాట్లలో నిర్మాణాలు చేయాలి.
కానీ, ఇతరత్రా అవసరాలకు మార్చే వీలులేదు. ఒకవేళ ఏవైనా మార్పులు చేయాలనుకుంటే సొసైటీ అనుమతి పొందాలి. కానీ సదరు సంస్థ అలాంటి అనుమతి ఏదీ పొందలేదు. ఈ వెంచర్‌లో మూడు టవర్లు నిర్మిస్తున్నట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఇక్కడ రెసిడెన్షియల్ కాంప్లెక్స్, హోటల్స్, మల్టీప్లెక్స్, షాపింగ్ మాల్ నిర్మించడానికి అనుమతి తీసుకున్నట్లు తమ నివేదికలో పేర్కొన్నారు. ఈ కాంప్లెక్సులో ఏకంగా 6,000 కార్లు, 2,000 ద్విచక్ర వాహనాలకు పార్కింగ్ సదుపాయం ఉన్నట్లు గుర్తించారు. కేబీఆర్ పార్క్‌కి అత్యంత సమీపంలో వచ్చే ఈ భారీ నిర్మాణంతో పర్యావరణానికి తీవ్ర ఇబ్బంది కలగనుందని, వాహనాల శబ్ధాలు, హారన్లు, కాలుష్యం చుట్టుపక్కల ప్రజలతోపాటు పార్క్‌లో వన్య ప్రాణులకు ప్రమాదకరంగా మారతాయని పేర్కొన్నారు. 115 మీటర్ల ఎత్తులో వచ్చే ఈ నిర్మాణంతో చుట్టుపక్కల గాలి, వెలుతురు, శబ్ధం, ట్రాఫిక్ తీరుతెన్నులు పూర్తిగా మారిపోతాయని పేర్కొంది.నిర్మాణం కోసం 100 అడుగుల లోతు వరకు రాళ్లను బ్లాస్టింగ్ చేస్తున్నారని, అందుకు అనుమతులు లేవని పేర్కొంది.
రోడ్డు నంబరు 45 కమర్షియల్ రోడ్డు. ఇక్కడ 30 మీటర్ల వరకూ భవన నిర్మాణాలకు అనుమతిస్తారు. ఇంపాక్ట్ ఫీజు కడితే మరిన్ని అంతస్తులకు కొంతమేర అనుమతిస్తారు. కానీ, హుడా లే అవుట్లో మాత్రం 15 అంతస్తులకే అనుమతి ఉంది. ఇక్కడే జీహెచ్‌ఎంసీ అధికారులు తప్పుగా అన్వయించారు. జూబ్లీహిల్స్ హౌజింగ్ సొసైటీకి చెందిన ప్లాట్లలో 30 మీటర్ల వరకు నిర్మించుకునే మినహాయింపుతోపాటు ఇంపాక్ట్ ఫీజు సహాయంతో మరికొంత ఎత్తు పెంచుకునే వెసులుబాటును హుడా లే అవుట్‌కు వర్తింపజేశారు. ఏకంగా 45 మీటర్ల నిర్మాణానికి అనుమతి ఇచ్చేశారు. నిబంధనలకు ఇది పూర్తి విరుద్ధం.
ఆర్‌సీసీ శ్లాబులు 4.5 మీటర్ల ఎత్తులోనే ఉండాల్సి ఉండగా, 5 మీటర్ల వరకు ఉండొచ్చంటూ టౌన్ ప్లానింగ్ అధికారులు అనుమతి ఇవ్వడం కూడా నిబంధనల ఉల్లంఘనే.జీహెచ్‌ఎంసీ అధికారులు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రత్యేక నిబంధనలను ఉల్లంఘించారు. జీవో 168 ప్రకారం భవనం ఎత్తును రోడ్డు నుంచి కొలవాలి. పిట్టగోడ, వాటర్ ట్యాంకు వంటి వాటిని ఎత్తు నుంచి మినహాయించాలి. కానీ, జీహెచ్‌ఎంసీ అధికారులు భవనం ఎత్తును తప్పుగా కొలిచారు.
వెంచర్‌లో 5 సెల్లార్లు నిర్మించారు. 2021లో జీహెచ్‌ఎంసీ సిబ్బంది సెల్లార్లను 5 స్టిల్టులుగా చూపించేశారు. ఇది పూర్తి అక్రమం. స్టిల్టులకు కనీసం 10 మీటర్ల మేర సెట్‌బ్యాక్‌లు ఉండాలి. కానీ, ఇక్కడి సెల్లార్లను సెట్‌బ్యాక్ లేకుండా కట్టేశారు.
కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ నిబంధనల ప్రకారం, నిర్మిత ప్రాంతం 1.50 లక్షల చదరపు అడుగులలోపు ఉండే భవనాలకు పబ్లిక్ హియరింగ్ నుంచి మినహాయింపు ఉంటుంది. కానీ, ఈ భవనం 2,09,620 చదరపు అడుగులు. అందువల్ల పబ్లిక్ హియరింగ్ లేకుండా ఈసీ ఇవ్వడం పూర్తిగా చట్టాలను ఉల్లంఘించడమే.
అక్రమంగా అనుమతులు ఇలా..!
నెట్ నెట్ వెంచర్స్ సంస్థ అక్రమం ఎలా చేసింది.. దానికి అడ్డగోలుగా అధికారులు అనుమతి ఎలా ఇచ్చారనే విషయాన్ని వివరిస్తూ విజిలెన్స్ అధికారులు తమ నివేదికలో ఓ ఉపగ్రహ చిత్రాన్ని పేర్కొన్నారు. దాని ప్రకారం.. ఎరుపు రంగు సరిహద్దు ఉన్న ప్రాంతం హెచ్‌ఎండీఏ నుంచి కొనుగోలు చేసిన స్థలం. ఇది నందగిరి రెసిడెన్షియల్ లే అవుట్లో ఉంది. దానిని ఆనుకుని ఉన్న పసుపు రంగు సరిహద్దు ప్రాంతం జూబ్లీహిల్స్ హౌజింగ్ సొసైటీ నుంచి కొన్న రెండు ప్లాట్లు! రోడ్డు నంబరు 45కు ఆనుకునే ఇవి ఉన్నాయి. వాటిలో మాత్రమే 30 అంతస్తులు నిర్మించుకోవచ్చు. కానీ, వాటిని అడ్డు పెట్టుకుని హుడా లే అవుట్‌లోని మొత్తం వెంచర్‌కు అనుమతులు పొందిందని నివేదికలో పేర్కొంది.
Sep 12 2024, 11:15