ఆపరేషన్ బుడమేరు - "హైడ్రా" మార్క్ ప్లాన్ తో చంద్రబాబు.!!
ఆపరేషన్ బుడమేరుకు ఏపీ ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. విజయవాడ నగరాన్ని ముంచెత్తిన బుడమేరు పై ప్రభుత్వం కొత్త ప్రణాళికలు సిద్దం చేస్తోంది. హైదరాబాద్ లో అమలు చేస్తున్న హైడ్రా తరహా ప్రణాళికలపై ఆలోచన చేస్తోంది. హైడ్రా తరహా చట్టాన్ని తీసుకొచ్చేందుకు కసరత్తు జరుగుతోంది. ఇందు కోసం పటిష్ఠ చట్టాన్ని తెస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. వచ్చే మంత్రివర్గ సమావేశం లో ఈ మేరకు నిర్ణయం తీసుకోనున్నారు.
ఏపీలోనూ హైడ్రా తరహా చట్టం తీసుకొస్తామని సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. బుడమేరు ఆక్రమణలను తొలగిస్తామని తెలిపారు. బుడమేరు వాగు పొంగడానికి ఆక్రమణలే కారణమని సీఎం తేల్చి చెప్పారు. ల్యాండ్ గ్రాబర్స్, పొలిటికల్ సపోర్టుతో ఆక్రమణలకు పాల్పడ్డ వారికి బుద్ధి చెప్పే పటిష్టమైన చట్టం ఉంటుందన్నారు. కొంత మంది ఆక్రమణదారుల వల్ల లక్షలాది మంది ఇబ్బంది పడుతుంటే చూస్తూ ఊరుకోబోమని ఆయన స్పష్టం చేశారు. ఇటువంటి వరదలు విజయవాడ పట్టణానికి మళ్లీ రాకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
కొల్లేరులో ఆక్రమణలు వల్ల నీరు వెనక్కి తన్నే పరిస్థితి ఉందని, దీనిని పరిశీలించి ఆక్రమణలు కొట్టేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. రాజకీయ అండతో కొందరు విచ్చలవిడిగా చేశారని మండిపడ్డారు. ప్రజా భద్రత కంటే ఈ ప్రభుత్వానికి ఏదీ ముఖ్యం కాదని తేల్చిచెప్పారు.
ప్రజల్లో నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు ఏం చేయాలో అన్నీ చేస్తున్నామన్నారు. విజయవాడలో మరోసారి ఇలాంటి వరదలు రాకుండా ఉండాలంటే ఆక్రమణలు తొలిగించాలని డిసైడ్ అయ్యారు. బుడమేరు ఆపరేషన్ చేపడతామని, భవిష్యత్తులో ఇబ్బంది రాకుండా చూస్తామన్నారు.
Sep 09 2024, 12:52