కోట్లు వసూలు చేసి.. బోర్డు తిప్పేసిన రియల్ ఎస్టేట్ సంస్థ
భూమి కొంటే.. ఇచ్చిన డబ్బులకు నెలనెలా వడ్డీ చెల్లిస్తామన్నారు... ఇచ్చిన కాలవ్యవధిలో వడ్డీతోసహా అసలు చెల్లించి.. రిజిస్ట్రేషన్ చేసిన భూమిని తిరిగి తీసుకుంటామని నమ్మించారు. అలా కోట్లాది రూపాయలు వసూలు చేసిన ఓ రియల్ ఎస్టేట్ సంస్థ చివరికి బోర్డు తిప్పేసింది.
కేపీహెచ్‌బీ కాలనీ, సెప్టెంబర్ 6 : భూమి కొంటే.. ఇచ్చిన డబ్బులకు నెలనెలా వడ్డీ చెల్లిస్తామన్నారు… ఇచ్చిన కాలవ్యవధిలో వడ్డీతోసహా అసలు చెల్లించి.. రిజిస్ట్రేషన్ చేసిన భూమిని తిరిగి తీసుకుంటామని నమ్మించారు. అలా కోట్లాది రూపాయలు వసూలు చేసిన ఓ రియల్ ఎస్టేట్ సంస్థ చివరికి బోర్డు తిప్పేసింది. మోసం పోయామని గుర్తించిన బాధితులు కేపీహెచ్‌బీ కాలనీ పోలీస్‌స్టేషన్‌కు క్యూ కట్టారు.
పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. కేపీహెచ్‌బీ కాలనీ, సర్దార్ పటేల్ నగర్‌లో కె.సురేశ్‌కుమార్, వెంకటేశ్ రెండేండ్ల కిందట వీ వన్ ఇన్ ఫ్రా గ్రూపు పేరుతో రియల్ ఎస్టేట్ సంస్థను ఏర్పాటు చేశారు. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం, నర్సాపూర్ గ్రామంలో సంస్థకు చెందిన 30 ఎకరాల భూమిని అమ్మకానికి పెట్టారు. ఈ స్థలంలో గుంటకు ఐదు లక్షలుగా రేటు ఫిక్స్‌చేసి.. మార్కెట్ చేయడం మొదలు పెట్టారు.
ఐదు లక్షలు చెల్లించిన వారికి గుంట భూమిని రిజిస్ట్రేషన్ చేస్తారు. ఆ తర్వాత నెల నుంచి చెల్లించిన ఐదు లక్షలకు గాను.. ప్రతి నెలా రూ.20వేల చొప్పున వడ్డీ చెల్లిస్తారు. 25 నెలల కాలవ్యవధి తర్వాత వడ్డీతోపాటు అసలు చెల్లించి.. కొనుగోలు చేసిన భూమిని తిరిగి తీసుకుంటామనేది సంస్థ వాగ్ధానం. దీన్ని నమ్మిన చాలామంది వడ్డీతో పాటు.. అసలు కూడా వస్తుందని ఆశతో భూములను కొన్నారు. మొదట్లో భూమిని కొన్నవారికి నమ్మకంగా వడ్డీ చెల్లించారు. దీంతో ఒకరికి తెలియకుండా మరొకరు భూమిని కొనుగోలు చేశారు.
అయితే అందులో కొందరికీ నెలనెలా వడ్డీ రాకపోవడంతో సంస్థ కార్యాలయానికి వచ్చి ఆరా తీయగా.. సరైన సమాధానం రాలేదు. అలాగే.. ఎండీ సురేశ్‌కుమార్ కూడా కనిపించలేదు. దీంతో మోసపోయామని గుర్తించిన దాదాపు 80 మంది బాధితులు.. శుక్రవారం కేపీహెచ్‌బీ కాలనీ పీఎస్‌ను ఆశ్రయించారు. అయితే ఏడుగురు మాత్రమే ఫిర్యాదు చేశారని, ఈ కేసును ఇవోడబ్ల్యూ పోలీసు విభాగం దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెంకటేశ్వర్‌రావు తెలిపారు.
Sep 07 2024, 16:15