విజయవాడను ముంచేసిన బుడమేరు గండ్లు పూడ్చివేతకు ఆర్మీ సిబ్బంది ఎంట్రీ
విజయవాడలోని అజిత్ సింగ్ నగర్, రాయనపాడు ప్రాంతాలను ముంచెత్తిన బుడమేరు గండ్లు పూడ్చివేత పనులు శరవేగంగా జరుగుతున్నాయి. గత నాలుగు రోజులుగా బుడమేరు మూడో గండి ద్వారా సుమారు 40,000 క్యూసెక్కుల వరద నీరు విజయవాడ లోకి రావడంతో అజిత్ సింగ్ నగర్, రాయనపాడు తదితర ప్రాంతాలను ముంచెత్తాయి. వరద నీరుతో ఆ ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి.
విజయవాడలో వరదలు రావడానికి కారణమైన బుడమేరు మూడవ గండి పూడ్చివేత పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు బుడమేరు మూడో గండి పడిన ప్రాంతంలో దగ్గరుండి గండి పూడ్చివేత పనులు పర్యవేక్షిస్తున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు బుడమేరు మూడో గండి పూడ్చివేత పనుల గురించి మంత్రి నిమ్మల రామానాయుడు, సంబంధిత అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకుంటున్నారు.
శుక్రవారం ఉదయం సీఎం చంద్రబాబు నాయుడు బుడమేరు మూడో గుండి సడిన ప్రాంతాల్లో ఏరియల్ సర్వే ద్వారా పర్యవేక్షించారు. శనివారంలోపు బుడమేరు గండ్ల పూడ్చివేత పనులు పూర్తి అవుతాయని మంత్రి నిమ్మల రామానాయుడు సీఎం చంద్రబాబుకు చెప్పారని సమాచారం. బుడమేరు గండి పడిన ప్రాంతానికి మద్రాసు రెజిమెంట్ నుంచి సుమారు వంద మంది ఆర్మీ సిబ్బంది చేరుకున్నారు.
తాత్కాలికంగా ఇనుప రాడ్లు వేసి బుడమేరు మూడో గండి పూడ్చివేత పనులు పూర్తి చేస్తామని ఆర్మీ సిబ్బంది చెబుతున్నారు. ఇప్పటికే బుడమేరు మూడో గండి పడిన ప్రాంతానికి అవసరమైన సామాగ్రిని ఆర్మీ సిబ్బంది తరలిస్తున్నారు. బుడమేరు మూడో గండి పడిన ప్రాంతాల్లో పనులు వేగవంతం చేయకపోతే సంబంధిత అధికారుల పైన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరించారు.మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ సిబ్బంది కూడా బుడమేరు గండ్లు పడిన ప్రాంతాలకు చేరుకోవడంతో శనివారం మధ్యాహ్నం లోపే బుడమేరు మూడో గండి పూడ్చివేత పనులు దాదాపు ఓ కొలిక్కి వస్తాయని జనవనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. విజయవాడ అతలాకుతలం కావడానికి కారణమైన బుడమేరు మూడవ గండిని వీలైనంత త్వరగా పూడ్చివేయాలని సీఎం చంద్రబాబు నాయుడు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆర్మీ సిబ్బందికి అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించాలని సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Sep 07 2024, 11:02