స్థానికత మీద తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు!
స్థానికత అంశం మరోసారి తెర మీదకు వచ్చింది. ఇంతకూ తెలంగాణలో శాశ్విత నివాసం ఉన్న వారిని గుర్తించటం ఎలా? అన్నది మౌలికప్రశ్నగా మారింది. దీనికి కారణం.. తెలంగాణలోని మెడికల్.. డెంటల్ కళాశాలల్లో చేపట్టనున్న ప్రవేశాలే. అయితే.. ఈ వ్యవహారంలో తెలంగాణలో శాశ్వత నివాసం ఉన్న స్థానికులకే అవకాశాలు కల్పించాల్సి ఉంటుందని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ సందర్భంగా మెడికల్ ఆడ్మిషన్ల నిబంధనలకు జీవో 33 ద్వారా చేసిన సవరణ 3(ఏ)ను రద్దు చేస్తే.. దేశ వ్యాప్తంగా ఉన్న వారంతా 85 శాతం స్థానిక కోటా కింద ప్రవేశాలు పొందే అవకాశం ఉందని పేర్కొంది.
విద్యార్థుల స్థానికతను నిర్దారించటానికి ఎలాంటి మార్గదర్శకాలు లేవన్న హైకోర్టు.. వాటిని రూపొందించేందుకు ప్రభుత్వానికి అవకాశం ఇస్తున్నట్లుగా పేర్కొంది. ప్రభుత్వం నిబంధనల్ని రూపొందించిన తర్వాత వాటి ఆధారంగా విద్యార్థుల స్థానిక కోటాను కాళోజీ నారాయణరావు వర్సిటీ నిర్ధారించి.. సీట్లను కేటాయిస్తుందని తెలిపింది. ఆలిండియా సర్వీసు ఉద్యోగుల పిల్లలకు మీనాక్షి మాలిక్ కేసులో సుప్రీం వెలువరించిన తీర్పు ప్రకారం స్థానిక కోటా కింద సీట్లను కేటాయించాల్సిన అవసరం ఉందని.. దీన్ని అడ్వొకేట్ జనరల్ సైతం అంగీకరించిన విషయాన్ని గుర్తు చేసింది.
మెడికల్ ఆడ్మిషన్ల నిబంధనలు (2017)ను సవరించి.. 3(ఏ) నిబంధనను చేరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం జులై 9న జారీచేసిన జీవో నెంబరు 33 ను సవాలు చేస్తూ హైకోర్టులో 53పిటిషన్లు దాఖలు అయ్యాయి. వీటిపై సుదీర్ఘ వాదనలు సాగాయి. పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాదులు వాదనలు వినిపించిన అంశాల్ని చూస్తే..
స్థానికత నిబంధనపై గత ఏడాది హైకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్దంగా ప్రభుత్వం జీవో జారీ చేసింది.
అర్హత పరీక్ష ఇంటర్ తో పాటు వరుసగా నాలుగేళ్లు తెలంగాణలోనే చదివి ఉండాలన్న నిబంధన శాశ్విత నివాసులకు అవకాశం లేకుండా చేస్తోంది.
మెరుగైన విద్యా సంస్థలు.. ఇతర కారణాలతో ఇతర రాష్ట్రాల్లో ఇంటర్ చదివిన విద్యార్థులు ఈ జీవో కారణంగా అవకావం కోల్పోతారు.
దీనికి కౌంటర్ గా ప్రభుత్వ తరఫున అడ్వొకేట్ జనరల్ తన వాదనల్ని వినిపించారు. ఈ క్రమంలో హైకోర్టు ధర్మాసనం ఉభయుల వాదనలు విని కీలక ఆదేశాలు జారీ చేసింది. వాటిని సంక్షిప్తంగా చూస్తే..
తెలంగాణలో శాశ్విత నివాసం ఉన్న వారికే మెడికల్.. డెంటల్ కోర్సుల్లో ఆడ్మిషన్లు కల్పించటమే తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణ నిబంధన (3ఏ)
అభ్యర్థులు నాలుగేళ్లు వరుసగా తెలంగాణలోనే చదివి ఉండాలి. శాశ్వత నివాసులై ఉండాలి.
తెలంగాణకు చెందిన వ్యక్తి నిర్దేశిత అర్హత పరీక్షను తెలంగాణ రాష్ట్రంలో రాయలేదన్న కారణంగా ఆడ్మిషన్ ను నిరాకరిస్తే.. ఆ నిబంధన ఉద్దేశం నెరవేనట్లే.
తెలంగాణకు చెందిన వ్యక్తి రాష్ట్రం బయట ఉన్న విద్యాసంస్థల్లో అర్హత పరీక్ష రాశారనో.. బయట నివాసం ఉన్నారనో ఆడ్మిషన్లను రిజెక్టు చేయటం సరికాదు.
ఒక నిబంధనపై వ్యాఖ్యానించే ముందు దాన్ని తీసుకొచ్చిన చట్టసభలకు వాటి గురించి స్పష్టమైన అవగాహన ఉంటుందన్న విషయాన్ని మరిచొపోవద్దు.
చెల్లని చట్టాల్ని చట్టసభలు ఎప్పుడూ తీసుకురావు. స్థానికులకు అవకాశాలు కల్పించటానికే రాష్ట్ర ప్రభుత్వం తాజా నిబంధనను తీసుకొచ్చింది.
ఈ దశలో ఈ నిబంధనను రద్దు చేస్తే దేశవ్యాప్తంగా ఉన్న వారు తెలంగాణలో మెడికల్ ఆడ్మిషన్లకు అర్హులవుతారు.
అప్పుడు రాష్ట్రంలోని శాశ్వత నివాసం ఉన్న వారు నష్టపోతారు.
ప్రభుత్వం జీవో నంబరు 33తో తీసుకొచ్చిన 3(ఏ) నిబంధన తెలంగాణలో శాశ్విత నివాసం ఉన్న వారికి వర్తించదు.
స్థానికత నిర్దారణకు మార్గదర్శకాలు లేవు. వాటిని రూపొందించటానికి ప్రభుత్వానికి అవకాశం ఇస్తున్నాంఅవి రూపొందిన తర్వాత స్థానిక విద్యార్థులకు వాటిని అన్వయింపజేసి.. సీట్లను కేటాయించాలి.
Sep 06 2024, 19:04