మళ్ళీ భారీవర్షాల హెచ్చరిక పంపిన బంగాళాఖాతం!
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఇంకా వర్షాలు కొనసాగుతూనే ఉన్నాయి. కోస్తా ఆంధ్ర, యానాం పరిసర ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. సముద్రమట్టం నుంచి సగటున 3.1 కిలోమీటర్ల నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఇది కొనసాగుతుందని ఉపరితల ఆవర్తనం క్రమంగా బలపడి నేటి ఉదయానికి పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
దీని ప్రభావంతో రానున్న మూడు రోజులు రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురుస్తాయని, కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ములుగు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
అంతేకాదు ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలలోని కొన్ని ప్రాంతాలలో రానున్న మూడు రోజులు భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
ఈ మేరకు ఇప్పటికే ఆయా జిల్లా యంత్రాంగాలను అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచనలు జారీ చేసింది. కాగా నిన్న రాష్ట్రంలో సగటున 2.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది.. నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా 6.38 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. ఇక సిద్దిపేట జిల్లాలో 5.47 సెంటీమీటర్లు, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 4.3 సెంటీమీటర్లు, జోగులాంబ గద్వాల జిల్లాలో 3.12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది.అన్ని జిల్లాలలోనూ సాధారణం కంటే అధికంగా వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ పేర్కొంది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 59.77 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 83.64 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టుగా సాధారణం కంటే అధికంగా 40% వర్షపాతం నమోదైనట్టుగా వెల్లడించింది. ఇక రానున్న మూడు రోజులు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది
Sep 05 2024, 18:31