వాలంటీర్లకు పిలుపు - కీలక మలుపు..!!
వాలంటీర్ల పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ల సేవలను కొనసాగించటంతో పాటుగా వారికి రూ 10 వేలు వేతనం ఇస్తామని నాడు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తరువాత వారి కొనసాగింపు పైన ఎలాంటి నిర్ణయం లేదు. వేతనాలు పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పుడు వరదల సమయంలో వాలంటీర్ల వినియోం పైన చర్చ మొదలైంది. ఈ సమయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
తమ ఉద్యోగాల కొనసాగింపు పైన డైలమాలో ఉన్న వాలంటీర్లకు సానుకూల సంకేతాలు అందుతున్నాయి. మూడు నెలలుగా జీతాలు లేకుండా తమ సంబంధింత సచివాలయాలకు వెళ్లి సంతకాలకు మాత్రమే వాలంటీర్లు పరిమితం అవుతున్నారు. ఇప్పుడు వరదల సమయంలో వాలంటీర్లు ఉంటే మరింత సమర్ధవంతంగా ఇంటికే అన్ని రకాల సేవలు అందేవనే అభిప్రాయం వ్యక్తం అయింది. దీంతో, ప్రభుత్వం వీరి విషయలో పునరాలోచన చేసింది. వదర ప్రభావిత ప్రాంతాల్లో విధులకు హాజరవ్వాలని ప్రభుత్వం వాలంటీర్లను ఆదేశించింది.
వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల పైన అధికారులు సచివాలయ సిబ్బందితో పాటుగా వాలంటీర్లను కలిపి టెలి కాన్ఫిరెన్స్ నిర్వహించారు. సచివాలయాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి వదర సాయంలో వాలంటీర్ల విధులను స్పష్టం చేసారు. దీంతో, వాలంటీర్లు ప్రతీ ఇంటికి వెళ్లి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆహారం, పాలు, మందులను అందించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాగానే వారి నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లను తిరిగి అప్పగించారు. అయితే, సాంకేతిక కారణాలతో ఆ ఫోన్లు పని చేయటం లేదు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో అందరి సేవలు వినియోగించుకుంటామని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ప్రస్తుతం విజయవాడ వరకు మాత్రమే వాలంటీర్లు విధుల్లో చేరారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.60 లక్షల మంది వాలంటీర్లు ఉన్నారు. తామంతా ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తున్నామని..విధుల్లో చేరేందుకు సిద్దమని వాలంటీర్ల సంఘ నేతలు చెబుతున్నారు. అయితే, ఇప్పుడు వాలంటీర్ల కొనసాగింపు పైన ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఆశాభావంతో ఉన్నారు. వచ్చే వారం వాలంటీర్ల కొనసాగింపు..విధుల పైన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.
Sep 05 2024, 12:42