ఆర్జిత సేవలను రద్దు చేసిన టీటీడీ- ఆ తేదీలు ఇవే
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఈ నెల 10వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమం జరుగనుంది. 16వ తేదీ నుంచి పవిత్రోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు.
ఆ రోజున తెల్లవారు జామున సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, శుద్ధి నిర్వహిస్తారు. ఉదయం 7 నుంచి 9.30 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరగనుంది. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేస్తారు.
అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రమిశ్రమాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. ఉదయం 10 గంటల నుంచి పద్మావతి అమ్మవారి సర్వదర్శనానికి భక్తులకు అనుమతిస్తారు.
ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకు మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలకు 15వ తేదీ సాయంత్రం అంకురార్పణ చేస్తారు ఆలయ అర్చకులు. విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవాలను చేపడతారు.
ఆలయానికి వచ్చే భక్తులు లేదా ఇక్కడ విధుల్లో ఉండే సిబ్బంది వల్ల గానీ కొన్ని దోషాలు తెలియక జరుగుతుంటాయి. ఇలాంటి వాటి వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి విఘాతం కలకుండా నివారించడానికి ప్రతి సంవత్సరం మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.ఈ పవిత్రోత్సవాలలో ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. 16వ తేదీన పవిత్ర ప్రతిష్ఠ, 17న పవిత్ర సమర్పణ, 18న పూర్ణాహుతి కార్యక్రమాలు ఉంటాయి. 750 రూపాయలను చెల్లించడం ద్వారా ఈ పవిత్రోత్సవాల ఆర్జిత సేవలో పాల్గొనవచ్చు.
Sep 04 2024, 15:18