అదానీ గ్రూప్ కొత్త కంపెనీకి ఆమోదం.. షేర్లు అమ్మేస్తున్న ఇన్వెస్టర్స్..
అదానీ గ్రూప్ దేశంలోని ఎనర్జీ రంగంలో కొత్త కంపెనీ ఏర్పాటుకు తీవ్రంగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అయితే గ్రూప్ తీసుకున్న ఈ నిర్ణయంతో అనేక మంది ఇన్వెస్టర్లు అదానీ గ్రీన్ ఎనర్జీ షేర్లను విక్రయిస్తున్నారు.
గౌతమ్ అదానీ గ్రూప్ కంపెనీ అయిన అదానీ గ్రీన్ ఎనర్జీ డైరెక్టర్ల బోర్డు టోటల్ ఎనర్జీస్‌తో జాయింట్ వెంచర్ ఒప్పందాన్ని ఆమోదించింది. దీని కింద రెండు సంస్థలు 50:50 నిష్పత్తిలో జాయింట్ వెంచర్‌లో వాటాను కలిగి ఉంటాయని వెల్లడైంది. తాజా డీల్ ద్వారా విదేశీ సంస్థ అదానీ గ్రూప్ కంపెనీలో కొత్తగా 444 మిలియన్ డాలర్లను అదనంగా పెట్టుబడి పెట్టనుంది. అయితే కంపెనీ కొత్త అడుగులు వేస్తున్న తరుణంలో అదానీ గ్రీన్ ఎనర్జీ షేర్లు క్షీణించాయి. ఈ క్రమంలో స్టాక్ ధర 2 శాతానికి పైగా క్షీణించింది. మార్కెట్ల క్లోజింగ్ సమయంలో స్టాక్ ధర ఎన్ఎస్ఈలో ఒక్కోటి 2.66 శాతం క్షీణించి రూ.1894 వద్ద స్థిరపడింది.
అదానీ గ్రీన్ ఎనర్జీ కంపెనీ, టోటల్ ఎనర్జీస్, అదానీ రెన్యూవబుల్ ఎనర్జీ సిక్స్టీ ఫోర్ లిమిటెడ్ మధ్య గట్టి ఒప్పందాలు చేసుకోనున్నట్లు స్టాక్ మార్కెట్‌కు ఇచ్చిన సమాచారంలో పేర్కొంది. ఒప్పందంలోని వివరాల ప్రకారం అదానీ గ్రీన్ ఎనర్జీతో కొత్తగా ఏర్పాటు చేయనున్న జాయింట్ వెంచర్ కంపెనీలో ఫ్రెంచ్ సంస్థ టోటల్ ఎనర్జీస్ నేరుగా లేదా దాని అనుబంధ సంస్థల ద్వారా అవసరమైన పెట్టుబడి మెుత్తాన్ని ఇన్వెస్ట్ చేయనున్నట్లు వెల్లడైంది. కొత్తగా ఏర్పాటౌతున్న కంపెనీ 1,150 మెగావాట్ల సోలార్ ఎనర్జీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
అదానీ గ్రూప్ ఇంధన రంగంపై దృష్టి సారిస్తున్న ప్రస్తుత సమయంలో కొత్త కంపెనీ ఏర్పాటు చాలా కీలకంగా మారింది. కంపెనీ ప్రస్తుత చర్యలతో రానున్న కాలంలో అదానీ గ్రీన్ ఎనర్జీ నిర్వహణ సామర్థ్యం 30 శాతానికి పైగా పెరిగి 2030 నాటికి 50,000 మెగావాట్లను దాటే అవకాశం ఉంది. అదానీ గ్రీన్ ఎనర్జీ వార్షిక ప్రాతిపదికన 6,000 నుంచి 7,000 మెగావాట్ల సామర్థ్యాన్ని జోడించి ప్రపంచంలోనే అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి కంపెనీగా అవతరించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం అదానీ గ్రీన్ ఎనర్జీ హోల్డింగ్ పరిశీలిస్తే ప్రమోటర్లు కంపెనీలో 57.52 శాతం వాటాలను కలిగి ఉన్నారు.
Sep 03 2024, 21:28