బీఆర్ఎస్ మాజీ మంత్రులపై దాడి..
తెలంగాణలో నాలుగు రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న వానలతో ఖమ్మం జిల్లాలోని మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహించింది. దీంతో పలు కాలనీలు జలమయం అయ్యాయి. కాలనీల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. బాధితులను ప్రభుత్వం అండగా నిలిచి సహాయ కార్యక్రమాలు చేపట్టింది. అయితే ఈరోజు(మంగళవారం) బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు ఖమ్మం జిల్లాలోని ముంపు ప్రాంతాల్లో పర్యటించారు.
అయితే ఈ పర్యటనలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వాహనంపై కొంతమంది వ్యక్తులు రాళ్ల దాడి చేశారు. ఈ దాడిలో బీఆర్ఎస్ నేతలకు గాయాలు అయ్యాయి. ఒకరికి కాలు విరగడంతో ఆస్పత్రికి తరలించారు. దాడి జరిగిన మంచి కంటి నగర్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఖమ్మంలో బీఆర్ఎస్ నేతలపై దాడిని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఈరోజు కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు.
బీఆర్ఎస్ మాజీ మంత్రులు హరీష్‌రావు, పువ్వాడ అజయ్ కుమార్, సబితా ఇంద్రారెడ్డి వాహనాలపై దాడి చేయటం కాంగ్రెస్ అసహనానికి నిదర్శనమని మండిపడ్డారు. ప్రజలకు సాయం చేయటం చేతగాక.. సాయం చేస్తున్న నేతలను చూసి ఓర్వలేకే ఈ దాడికి తెగబడ్డారని విమర్శలు చేశారు. ప్రభుత్వం ప్రజలను నిర్లక్ష్యం చేస్తే వారికి తాము అండగా ఉండటమే తప్పా? అని ప్రశ్నించారు. ప్రజలకు సేవ చేయటం చేతకాదు...సేవ చేసే వాళ్లపై మాత్రం దాడి చేయటం? సిగ్గు చేటు అని అన్నారు.
ఈ దాడికి ముఖ్యమంత్రితో సహా కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి దాడులు ఎన్ని చేసినా సరే...ప్రజల వద్దకు బీఆర్ఎస్ శ్రేణులను వెళ్లకుండా ఆపలేరని హెచ్చరించారు. కాంగ్రెస్ చేతగాని, దద్దమ్మ పాలనను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఈ ప్రభుత్వానికి సరైన సమయంలో బుద్ధి చెప్పటం ఖాయమని కేటీఆర్ వార్నిగ్ ఇచ్చారు.
Sep 03 2024, 17:08