సీఎం చంద్రబాబు సమీక్ష
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారీ వర్షాలు, వరదలు, జిల్లాల్లో ప్రస్తుత పరిస్థితులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీఎస్, డీజీపీ, మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం (Low Pressure) కారణంగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారీ వర్షాలు, వరదలు, జిల్లాల్లో ప్రస్తుత పరిస్థితులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) సీఎస్ (CS), డీజీపీ (DGP), మంత్రులు (Ministers), జిల్లా కలెక్టర్లు (Collectors), ఎస్పీ (SPs)లతో టెలికాన్ఫరెన్స్ (Teleconference) ద్వారా సమీక్ష (Review) నిర్వహించారు. జిల్లాలు, శాఖల వారీగా తాజా పరిస్థితులు, తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రి రివ్యూ చేశారు. డ్రోన్లు, సీసీ కెమేరాల ద్వారా రియల్ టైంలో పరిస్థితిపై అధికార యంత్రాంగం స్పందించాలని సూచించారు. మీడియాలో, సోషల్ మీడియాలో, వాట్సాప్ గ్రూప్‌లలో వచ్చే విజ్ఞప్తులపై తక్షణ స్పందన ఉండాలని ఆదేశించారు.
వరద తగ్గిన వెంటనే పంటనష్టంపై వివరాలు సేకరించాలని వ్యవసాయ శాఖ అధికారులకు సిఎం చంద్రబాబు అదేశించారు. సాయంత్రం వరకు ప్రకాశం బ్యారేజ్‌కు 9 లక్షల క్యూసెక్కులపైచిలుకు వరద వస్తుందని టెలికాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. శనివారంతో పోల్చుకుంటే జిల్లాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం వర్షాల తీవ్రత తగ్గిందని, అయితే ఇంకా వరదలోనే ఇళ్లు, కాలనీలు ఉన్నాయన్నారు. రహదారులపైనున్న నీటికి బయటకు పంపడమే కాదు.. కాలనీలు, ప్రజల ఇళ్లలో ఉన్న వరద సమస్యను పరిష్కరించాలని సూచించారు. పలు ప్రాంతాల్లో 27 సెంటీమీటర్లకు పైగా వర్షం పడిందని, ఇలాంటి చోట్ల పరిస్థితిపై ఫోకస్ పెట్టాలన్నారు.
గత 50 ఏళ్లలో ఎప్పుడూ పడనంతగా వర్షం పడిందని, ఎప్పుడూ లేని విధంగా నేషనల్ హైవేలు కూడా వరద నీటితో చెరువులను తలపించాయని సీఎం చంద్రబాబు అన్నారు. నేషనల్ హైవే అథారిటీకి కూడా లేఖ రాసి సమస్యపై సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వరద ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా పరిస్థితిని సమీక్షించాలని... దానికి అనుగుణంగా రిస్క్యూ ప్లాన్ చేయాలన్నారు. వర్షాలు, వరదల కారణంగా ఆహారం, నీరు కలుషితం అవుతుందని, గ్రామాల్లో పారిశుధ్య చర్యలు చేపట్టాలని, నివాస ప్రాంతాల మధ్య నుండి వరద నీటిని వీలైనంత త్వరగా లేకుండా చేయాలని ఆదేశించారు. వ్యాధులు ప్రభలకుండా బ్లీచింగ్ చల్లడంతో పాటు మెడికల్ క్యాంప్‌లు ఏర్పాటు చేయాలన్నారు.
ఎన్టీఆర్ జిల్లాలో బుడమేరు వరద కారణంగా పలు ప్రాంతాలు ముంపు బారిన పడ్డాయని తెలిపిన మంత్రి నారాయణ తెలిపారు. ఇరిగేషన్ సహా ఇతర శాఖల అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారం కోసం ప్రయత్నించాలని సీఎం చంద్రబాబు సూచించారు. నూజువీడు నియోజకవర్గంలో రికార్డు స్థాయి వర్షాలకు జరిగిన నష్టాన్ని మంత్రి కొలుసు పార్థసారధి వివరించారు. ఇబ్బందుల్లో ఉన్న పలుప్రాంతాల వారికి బియ్యం, నిత్యావసరాలు సరఫరా చేసినట్లు సీఎంకు మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. వరదలపై వ్యవసాయ శాఖ తరుపున తీసుకుంటున్న చర్యలను మంత్రి అచ్చెన్నాయుడు వివరించారు. వరద తగ్గిన తరువాత ఆస్తి, పంటనష్టం వివరాలు సేకరించాలని... రైతులకు, కుటుంబాలకు వెంటనే సాయం అందించాలన్నారు.ప్రకాశం బ్యారేజ్ నుంచి ఆదివారం సాయంత్రానికి నీటి ప్రవాహం 9 నుంచి 10 లక్షల క్యూసెక్కులకు చేరవచ్చని అధికారుల అంచనా వేశారు. ప్రకాశం బ్యారేజ్ దిగువన బాపట్ల జిల్లాలో 6 వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. బ్యారేజ్ దిగువ ప్రాంతాల్లో ఉన్న గ్రామాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని, పునరావాస కేంద్రాలకు పంపాలని సీఎం సూచించారు. ఎన్టీఆర్ జిల్లా, రాయనపాడు రైల్వే స్టేషన్ వద్ద వరద కారణంగా రైలు నిలిపివేత, ప్రయాణికులకు సాయంపై జిల్లా కలెక్టర్, డీజీపీ వివరించారు. కేంద్ర ప్రభుత్వానికి కూడా నష్టం అంచనా వేసి పంపాలని చంద్రబాబు సూచించారు. మనం చేసే పనితో ప్రజల్లో సంతృత్తి కలగాలని, మనం మంచి చేసి సాయం అందిస్తే ప్రజలు గుర్తు పెట్టుకుంటారన్నారు. పంటల అంచనాను తప్పకుండా వేయాలని, ఎక్కడా పెండింగ్‌లో పెట్టకూడదని, డ్రోన్ల ద్వారా దెబ్బతిన్న పంటలను అంచనా వేయాలని, ఒక్క ఎకరా కూడా మిస్ కావొద్దన్నారు. ఏ ఒక్క రైతుకూ అన్యాయం జరగకూడదని, దెబ్బతిన్న ఇళ్లు, పశునష్టాన్ని కూడా మదింపు చేయాలన్నారు. పనితీరు, వ్యవస్థలో లోపాలు ఉంటే సరైన సమాచారం ప్రజలకు అందదని.. మనమంతా ప్రజల కోసమే పని చేస్తున్నామని... వారికి ఎక్కడా చిన్న ఇబ్బంది కూడా కలగకూడదని మరోసారి సూచించారు. ప్రజలకు సేవ చేస్తే ప్రభుత్వంపై నమ్మకం, విశ్వాసం కలుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.
Sep 03 2024, 10:54