బెజవాడను ముంచెత్తిన భారీ వర్షం.. 200 ఏళ్ల తర్వాత ఈ స్థాయిలో
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండంతో రాష్ట్రవ్యాప్తంగా కురుస్తోన్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకూ కోస్గా తీరంలో ఎటుచూసినా వర్షాలే వర్షాలు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. మరో మూడు రోజుల పాటు భారీవర్షాలు పడే అవకాశం ఉందన్న ఐఎండీ సూచనలతో ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ క్రమంలో జిల్లాలకు విపత్తు నిధులను విడుదల చేశారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారడంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత రెండురోజులుగా ఎడతెరిపిలేని వర్షాలకు విజయవాడ నగరం అతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాలన్నీ నీటమునిగిపోయాయి. రోడ్లన్నీ జలమయంకావడంతో జనం తీవ్ర అవస్థలు పడ్డారు. 24 గంటల వ్యవధిలో ఏకంగా 29 సెంటీమీటర్ల వర్షంతో వరుణుడు కుంభవృష్టి కురిపించాడు. దీంతో 30 ఏళ్ల కిందటి రికార్డు బద్ధలయ్యాయి. రహదారులన్నీ ఏరులయ్యాయి. ఏకధాటి వర్షాలకు మొగల్రాజుపురంలో కొండచరియలు ఇళ్లపై విరిగి పడి.. ఆరుగురు మృతి చెందారు.
బెంజిసర్కిల్‌లో 161 మిల్లీమీటర్లు, గన్నవరం ఎయిర్‌పోర్ట్ వద్ద 123 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయినట్టు ఏపీకి చెందిన ప్రముఖ వాతావరణ నిపుణుడు కే ప్రణీత్ తెలిపారు. ఈస్థాయిలో ఆగస్టులో వర్షం కురువడం 200 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి అని అన్నారు. తాడేపల్లిలో 121 మిల్లీమీటర్లు, మంగళగిరిలో 118 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. సరిగ్గా పాతికేళ్ల కిందట 1999లో ఈ స్థాయిలో వరదనీరు, వర్షపునీరు నగరంలోకి చేరి ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. అప్పట్లో కృష్ణానది వెంట కరకట్టలు తెగిపోయేలా ప్రమాదకరమైన పరిస్థితులు నెలకొన్నాయి.
బుడమేరు సైతం నాడు పొంగి అనేక ప్రాంతాలు మునకేశాయి. నాటి పరిస్థితులు తలిపించేలా ఇప్పుడు విజయవాడ నగరం వర్షపునీటితో మునిగిపోయింది. రహదారులు, డ్రెయిన్లు ఏకమై.. పలు ప్రాంతాల్లో వర్షపునీరు 2-6 అగుడుల ఎత్తున నిలిచిపోయింది. శివారు ప్రాంతాలు, కాలనీలు పూర్తిగా నీటమునిగాయి
పదుల సంఖ్యలో ఇళ్లల్లోకి వర్షం నీరు చేరడంతో పలు కుటుంబాలు ఖాళీచేసి బంధువులు, స్నేహితుల ఇళ్లలో తలదాచుకునే పరిస్థితులు నెలకొన్నాయి. విజయవాడ రైల్వే స్టేషన్‌లో ట్రాకులపై వరద నీరు చేరింది. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తుండగా.. కొన్నింటిని దక్షిణ మధ్య రైల్వే రద్దుచేసింది.భారీ వర్షాలకు బుడమేరు పొంగిపొర్లడంతో కొండపల్లి మండలం శాంతినగర్ ఇందిరమ్మ కాలనీని వరదనీరు ముంచెత్తింది. శనివారం రాత్రి సుమారు 200 కుటుంబాలు జలదిగ్బంధనంలో చిక్కుకున్నాయి. వీరిని రక్షించేందుకు అక్కడ చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. రాత్రివేళ కావడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడినా.. అధికారులు మాత్రం జేసీబీల సహాయంతో బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సహాయక చర్యల కోసం వెళ్లిన ఓ మత్స్యకారుడి బోటు సహితం గల్లంతైంది. బోటులోని మత్స్యకారులు సురక్షితంగా ప్రాణాలు దక్కించుకున్నారు.
Sep 01 2024, 14:29