శంషాబాద్ లో ల్యాండ్ అయిన ఆకాశ తిమింగలం
ఆకాశ తిమింగలంగా పేరున్న ఎయిర్ బస్ సరకుల రవాణా ఎయిర్ క్రాఫ్ట్ తాజాగా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు మరోసారి వచ్చింది. గురువారం అర్థరాత్రి ల్యాండ్ అయిన ఈ విమానం శుక్రవారం మధ్యాహ్నం బయలుదేరి వెళ్లిపోయింది. ఇంత భారీ విమానం శంషాబాద్ ఎయిర్ పోర్టులో మొదటిసారి ల్యాండ్ కావటంపై ఆసక్తి వ్యక్తమైంది. 56.16 మీటర్ల పొడవు.. 17.25 మీటర్ల ఎత్తుతో పాటు.. రెక్కలు 44.84 మీటర్లు ఉంటాయి.
ఈ భారీ విమానంలో ఏకంగా 40 టన్నుల (ఒక టన్నువెయ్యి కేజీలు)సరకుల్ని రవాణా చేసే సామర్థ్యం దీని సొంతం. ఇంధనం లేకుండా ఈ భారీ విమనం బరువు 133.8 టన్నులు కాగా.. ల్యాండింగ్ బరువు 140 టన్నులు. టేకాఫ్ బరువు 155 టన్నులు. ఇందులో ఒకసారి 23,860 లీటర్ల ఇంధనాన్ని నింపొచ్చు. ఒకసారి ఇంధనాన్ని నింపిన తర్వాత నాన్ స్టాప్ గా 1650కి.మీ. దూరం ప్రయాణించే సత్తా దీని సొంతం.
ఇక.. దీని ఎత్తు విషయానికి వస్తే.. లో డబుల్ క్రాస్ సెక్షన్ ఎత్తు 71. మీటర్లుకాగా.. లో డబుల్ క్రాస్ సెక్షన్ వెడల్పు 7.1 మీటర్లుగా చెబుతున్నారు. ఇంతకు ఈ విమానం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ఎందుకు వచ్చిందన్న ప్రశ్న వేస్తే.. ఆసక్తికర సమాధానం వస్తుంది. నిజానికి ఈ ఎయిర్ బస్ విమానం మస్కట్ లో బయలుదేరింది. షెడ్యూల్ ప్రకారం ఇది థాయ్ లాండ్ లో సరకుల్ని లోడింగ్ కోసం వెళ్లాల్సి ఉంది.
అయితే.. మధ్యలో ఈ విమానం ఇంధనం నింపుకోవటంతో పాటు.. క్రూ సిబ్బంది విశ్రాంతి తీసుకోవాల్సి రావటంతో విమానాన్ని దారి మళ్లించి శంషాబాద్ కు తీసుకొచ్చారు. శంషాబాద్ లో ల్యాండింగ్ చేసిన తర్వాత 15 గంటల పాటు ఇది ఎయిర్ పోర్టులోనే ఉంది. అనంతరం శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల వేళలో థాయ్ లాండ్ కు బయలుదేరింది. ఈ బాహుబలి లోహ విహంగం 2022 డిసెంబరులోనూ.. 2023 ఆగస్టులోనే వచ్చింది. తాజాగా మరోసారి ఆగస్టు నెలలోనే శంషాబాద్ కు రావటం ఆసక్తికరం.
Aug 31 2024, 14:13