కొత్త పోరాటానికి సమంత సిద్దం - రేవంత్ కు అప్పీల్..!!
ప్రముఖ సినీ నటి సమంత మరో పోరాటానికి సిద్దం అవుతుననారు. తెలుగు సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులు..సమస్యల పైన ఇచ్చిన నివేదికను వెల్లడించాలని ముఖ్యమంత్రి రేవంత్ కు అప్పీల్ చేసారు. మలయాళ చిత్రపరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను వెలికితేవడంలో హేమ కమిటీ పనితీరు అద్భుతంగా ఉందని టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రశంసించారు. ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం స్పందన ఏంటనేది ఆసక్తిగా మారుతోంది.
సినీ నటి సమంత ఇనస్టాలో చేసిన పోస్టు సంచలనంగా మారుతోంది. మలయాళ చిత్ర పరిశ్రమలో హేమ కమిటీ నివేదిక ఇప్పుడు సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. ఈ నివేదిక పైన సమంత స్పందించారు. హేమీ కమిటీ నివేదిక పని తీరును ప్రశంసించారు. ఈ కమిటీ ఏర్పాటుకు కారణమైన డబ్ల్యూసీసీ (ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్) సంస్థనూ ఆమె అభినందించారు. ఆ సంస్థ సభ్యుల కష్టం వల్లే ఈ రోజు మహిళల సమస్యలు చర్చనీయాంశంగా మారాయని చెప్పారు. సినీ పరిశ్రమలో మహిళల సంరక్షణ కోసం ఆ సంస్థ అవిశ్రాంతంగా పాటుపడుతోందని అభినందించారు.
ఇదే తరహాలో తెలుగు సినీ ఇండస్ట్రీ నివేదిక పైన సమంత పోరాటానికి సిద్దం అవుతున్నట్లు కనిపిస్తోంది. సమంత చేసిన పోస్టులో.." 'తెలుగు చిత్ర పరిశ్రమలోని మహిళలమైన మేము హేమ కమిటీ నివేదికను స్వాగతిస్తున్నాము. దీనికి మార్గం వేసిన కేరళ డబ్ల్యూసీసీ (ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్) యొక్క నిరంతర ప్రయత్నాలను అభినందిస్తున్నాము. అలాగే తెలుగు చిత్ర పరిశ్రమలోని మహిళల కోసం 2019లో సృష్టించబడిన సపోర్ట్ గ్రూప్ అయిన ది వాయిస్ ఆఫ్ ఉమెన్ కూడా ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ గ్రూప్ స్ఫూర్తిగా తీసుకోవాలని పేర్కొన్నారు.
దీనికి కొనసాగింపుగా..." తెలుగు చిత్ర పరిశ్రమలో మహిళలకు సురక్షితమైన పని వాతావరణాన్ని నెలకొల్పడానికి రూపొందించిన సబ్ కమిటీ నివేదికను ప్రచురించాలని ఇందుమూలంగా మేము తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నాము..'' అని సమంత చేసిన పోస్టింగ్ వైరల్ అవుతోంది. ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో పలు అంశాల పైన వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ సమయంలో తెలంగాణ ప్రభుత్వం తాజాగా సమంత చేసిన అప్పీల్ పైన ఏ విధంగా స్పందిస్తుందనేది చూడాలి.
Aug 31 2024, 13:46