జోరు తగ్గిన ఆర్థికం
దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో జోరు తగ్గింది. దేశంలో స్థూల వస్తూత్పత్తిలో వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (క్యూ1)లో 6.7 శాతానికి పరిమితమైంది. ఇది 15 నెలల లేదా ఐదు త్రైమాసికాల కనిష్ఠ స్థాయి.
దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో జోరు తగ్గింది. దేశంలో స్థూల వస్తూత్పత్తిలో వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (క్యూ1)లో 6.7 శాతానికి పరిమితమైంది. ఇది 15 నెలల లేదా ఐదు త్రైమాసికాల కనిష్ఠ స్థాయి. వ్యవసాయ, సేవల రంగాలు ప్రదర్శించిన నిరాశావహమైన పనితీరు ఇందుకు కారణం. 2023-24 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 8.2 శాతంగా ఉంది. ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో వృద్ధి రేటు దిగజారినప్పటికీ ప్రపంచంలో త్వరితగతిన వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా తన స్థానాన్ని భారత్ నిలబెట్టుకుంది. మన పోటీ ఆర్థిక వ్యవస్థ అయిన చైనా ఇదే త్రైమాసికంలో 4.7 శాతం వృద్ధిని నమోదు చేసింది. గతంలో జీడీపీ వృద్ధి రేటులో కనిష్ఠ స్థాయి 6.2 శాతం 2023 జనవరి-మార్చి త్రైమాసికంలో నమోదైంది.
స్థిర ధరల ప్రకారం క్యూ1లో జీడీపీ పరిమాణం రూ.43.64 లక్షల కోట్లున్నట్టు జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎ్‌సఓ) ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంలో ఈ విలువ రూ.40.91 లక్షల కోట్లుగా (6.7% వృద్ధి) ఉంది. ప్రస్తుత ధరల ప్రకారం ఇది రూ.77.31 లక్షల కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే కాలంలో 9.7 వృద్ధితో జీడీపీ పరిమాణం రూ.70.50 లక్షల కోట్లుగా ఉంది. మరిన్ని వివరాలు..
వ్యవసాయ రంగంలో స్థూల విలువ జోడింపులో (జీవీఏ) వృద్ధి 3.7% నుంచి 2 శాతానికి దిగజారింది. ఆర్థిక, రియల్ ఎస్టేట్, వృత్తి సర్వీసుల్లో జీవీఏ 12.6% నుంచి 7.1 శాతానికి తగ్గింది.
వాణిజ్య, హోటళ్లు, రవాణా, కమ్యూనికేషన్, బ్రాడ్‌కాస్టింగ్ సేవల రంగం 9.7% నుంచి 5.7 శాతానికి మందగించింది.
తయారీ రంగం జీవీఏ మాత్రం 5% నుంచి 7 శాతానికి పెరిగింది. గనులు, క్వారీ రంగాల్లో జీవీఏ 7% నుంచి 7.2 శాతానికి, విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, ఇతర యుటిలిటీ సర్వీసుల్లో జీవీఏ 3.2% నుంచి 10.4 శాతానికి దూసుకుపోయింది. నిర్మాణ రంగంలో వృద్ధి 8.6% నుంచి 10.5 శాతానికి పెరిగింది.
Aug 31 2024, 08:32