అమరావతిలో కేంద్రం తాజా ప్రతిపాదన - కొత్త రూపు..!!
ఏపీ రాజధాని అమరావతి పరిధిలో కొత్త ప్రతిపాదనలు సిద్దం అవుతున్నాయి. ఇప్పటికే అమరావతికి సంబంధించి డిసెంబర్ లో పనులు ప్రారంభం అవుతాయని మంత్రి నారాయణ ప్రకటించారు. అమరావతి కోసం రూ 15 వేల కోట్ల రుణం పైన కేంద్రం హామీ ఇచ్చింది. ప్రపంచ బ్యాంకు టీం పరిశీలన చేసింది. ఇదే సమయంలో రాజధాని పరిధిలోని గుంటూరు - విజయవాడలను జంట నగరాలుగా అభివృద్ధి చేయడానికి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికలు సిద్దం చేస్తున్నాయి.
అమరావతి పరిధిలో కొత్త రూపు తెచ్చేందుకు కసరత్తు జరుగుతోంది. స్మార్ట్ సిటీ పథకంలో భాగంగా విజయవాడ - గుంటూరు నగరాలకు నగరాలకు కేంద్రం ఇప్పటికే రూ.2 వేల కోట్లు మంజూరు చేసింది. హైదరాబాద్‌కు ధీటుగా జంట నగరాల అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. గుంటూరు సమీపంలోని కొన్ని గ్రామాలు, మండలాలను కలిసి గ్రేటర్ గుంటూరు అవతరించనుంది. అధికారులు ఈ మేరకు ప్రతిపాదనలను సిద్ధం చేసారు. దీని పైన కసరత్తు మొదలైంది.
తాజా ప్రతిపాదనల మేరకు గుంటూరు కార్పొరేషన్‌లో ఎనిమిది మండలాల పరిధిలోని 39 గ్రామాలు విలీనం అవ్వనున్నాయి. గుంటూరు రూరల్ మండలం పూర్తిగా కనుమరుగవనున్నది. ఆయా పంచాయతీల్లో స్థానిక ప్రజాప్రతినిధుల పదవీకాలం పూర్తి అయిన తర్వాత వాటిని నగరపాలక సంస్థలో కలపనున్నారు. మేడికొండూరు మండలంలోని పేరేచర్ల, డోకిపర్రు, ఫిరంగిపురం మండలంలోని అమీనాబాద్, చేబ్రోలు మండలంలోని నారాకోడూరు, గొడవర్రు, గుండవరం. ప్రత్తిపాడు మండలంలోని చిన్న కొండ్రుపాడు, యనమదల, ఈదులపాలెం కార్పోరేషన్ లో కలవనున్నాయి.
అదే విధంగా తాడికొండ, వట్టిచెరుకూరు, పెదకాకాని, గంటూరు రూరల్ మండలాల్లోని గ్రామాలు గ్రేటర్ గుంటూరు కార్పోరేషన్ పరిధిలోకి తీసుకొచ్చేలా ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నారు. అయితే, అమరావతి ప్రణాళికలు అమల్లో భాగంగా ఈ రెండు నగరాలను అభివృద్ధి చేయటం ద్వారా రాజధాని ప్రాంతం రూపు రేఖలు భవిష్యత్ లో మారుతాయని అంచనా వేస్తున్నారు. తాజా ప్రతిపాదనల పైన రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి డీపీఆర్ తో కేంద్రంతో సంప్రదింపులు చేయనుంది. దీంతో..సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న ఈ జంట నగరాల అభివృద్ధి పై త్వరలోనే కీలక నిర్ణయం జరిగే అవకాశం కనిపిస్తోంది.
Aug 28 2024, 14:36