తెలుగోడు ఒక్కడు లేడు.. ఎందుకంటే!
ప్రోకబడ్డీ లీగ్ సీజన్ 11కు రంగం సిద్దమైంది. అక్టోబర్ 18 నుంచి మళ్లీ కబడ్డీ కూత సందడి చేయనుంది. ఇప్పటికే ఈ సీజన్‌కు సంబంధించిన వేలం పూర్తయింది. స్టార్ ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు రూ. కోట్లు కురిపించాయి. లీగ్ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా ఈసారి 8 మంది కబడ్డీ ఆటగాళ్లు కోట్లు పలికారు.
రెండు రోజుల పాటు సాగిన వేలంలో సచిన్ తన్వార్ అత్యధిక ధర దక్కించుకున్నాడు. ఈ వేలంలో 12 ఫ్రాంచైజీలు మొత్తం 118 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశాయి.అయితే తెలుగురాష్ట్రాలకు చెందిన కబడ్డీ ప్లేయర్లకు ఈసారి కూడా నిరాశే ఎదురైంది. ఒక్క ఆటగాడిని కూడా వేలంలో ఫ్రాంచైజీలు కొనుగోలు చేయలేదు. గతేడాది కూడా తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్కరు కూడా ప్రోకబడ్డీ లీగ్‌లో ప్రాతినిథ్యం వహించలేదు.
ప్రోకబడ్డీ టోర్నీలో హర్యానా ఆటగాళ్లదే పూర్తి ఆధిపత్యం నడుస్తోంది. ఆ రాష్ట్రం నుంచి 106 మంది ఆటగాళ్లు ఈ టోర్నీలో భాగమయ్యారు. ఆ తర్వాత మహారాష్ట్ర నుంచి 39 మంది, తమిళనాడు నుంచి 22 మంది, ఉత్తరప్రదేశ్ నుంచి 21 మంది కబడ్డీ ప్లేయర్లు ఈ ఫ్రాంచైజీ లీగ్‌లో భాగమయ్యారు. తెలుగు రాష్ట్రాలు అయిన ఏపీ, తెలంగాణ నుంచి ఒక్క ప్లేయర్ కూడా అవకాశం అందుకోలేకపోయారు.
చివరకు జమ్మూ కశ్మీర్ నుంచి ఇద్దరు ప్లేయర్లు ఎంపికవ్వగా.. బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్, ఉత్తరాఖండ్ నుంచి ఒక్కొక్కరు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న తెలుగు టైటాన్స్ కూడా ఒక్క ప్లేయర్‌ను తీసుకోలేదు. లోకల్ టాలెంట్‌ను ఎంకరేజ్ చేయాల్సిన సొంత ఫ్రాంచైజీ స్థానిక ఆటగాళ్లను పట్టించుకోకపోవడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంప్రదాయ క్రీడ అయిన కబడ్డీలో కూడా తెలుగు రాష్ట్రాల ప్రాతినిథ్యం లేకపోవడం ఏంటని అసహనం వ్యక్తం చేస్తున్నారు.ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు క్రీడాకారుల కోసం బాగా ఖర్చు పెడుతున్నాయని చెబుతున్నా.. ఒక్క ప్లేయర్ లేకపోవడం విడ్డూరంగా ఉందని కామెంట్ చేస్తున్నారు. పల్లె క్రీడ అయిన కబడ్డీకి సరైన ప్రోత్సాహకం లభించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాల్లో నైపుణ్యం కలిగిన కబడ్డీ క్రీడాకారులు ఎందరో ఉన్నారని, కానీ వారికి సరైన గైడెన్స్, ప్రోత్సాహకం లేక మధ్యలోనే వదిలేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.స్కూల్ లెవల్, జిల్లా, రాష్ట్ర స్థాయిలో సరైన టోర్నీలు నిర్వహించకపోవడం.. కబడ్డీ అసోసియేషన్స్ అన్నీ రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారడంతో నైపుణ్యం కలిగిన ఆటగాళ్లకు సరైన ప్రోత్సాహం లభించడం లేదనే వాదన వినిపిస్తోంది. కబడ్డీని కెరీర్‌గా ఎంచుకున్న కొంతమంది ఆటగాళ్లు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే వరకు ఆటలో కొనసాగి తర్వాత వదిలేయడం, మరికొంతమంది ఆర్థిక సమస్యలతో తప్పుకోవడంతో తెలుగు రాష్ట్రాల నుంచి ప్రోకబడ్డీ లీగ్‌లో ప్రాతినిథ్యం లేకుండా పోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇప్పటికైనా ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు.. ఛాంపియన్లకు భారీ నగదు ప్రోత్సాహకం అందించే బదులు.. మట్టిలో మాణిక్యాలు వెలుగులోకి వచ్చే కార్యక్రమాలు చేపట్టాలని సూచిస్తున్నారు.
Aug 27 2024, 19:39