తెలుగు ప్రజలకు ఎయిరిండియా గుడ్‌న్యూస్.. ఇక మాతృభాషలో కస్టమర్ సపోర్ట్!
దేశీయ దిగ్గజ విమానయాన సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు ప్రజలకు శుభవార్త చెప్పింది. ఇకపై తెలుగులోనూ కస్టమర్ కేర్ సర్వీసులు అందించనున్నట్లు తెలిపింది. కొత్త 7 ప్రాంతీయ భాషలను అందుబాటులోకి తెచ్చింది. ఆ వివరాలు తెలుసుకుందాం.
దేశీయ దిగ్గజ ఎయిర్‌లైన్స్, టాటా గ్రూప్‌కి చెందిన ఎయిరిండియా తమ ప్రయాణికులకు మెరుగైన సేవలు ఉందించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు తమ కస్టమర్ కేర్ సర్వీసులను ప్రాంతీయ భాషలకు విస్తరిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం హిందీ, ఇంగ్లీష్ భాషల్లో కస్టమర్ సర్వీసులు అందుబాటులో ఉండగా.. ఇప్పుడు 7 ప్రాంతీయ భాషల్లో కస్టమర్ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన జారీ చేసింది ఎయిరిండియా.
7 ప్రాంతీయ భాషల్లో తెలుగుతో పాటు తమిళం, పంజాబీ, కన్నడ, బెంగాళీ, మరాఠీ, మలయాళం ఉన్నాయి. ఈ ప్రాంతీయ భాషల్లోనూ ఇక కస్టమర్ కేర్ సర్వీసులు అందించనుంది ఎయిరిండియా. ఈ ప్రత్యేక అసిస్టెంట్ సర్వీసులు ప్రతి రోజు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. అలాగే కొత్తగా 5 కాంటాక్ట్ సెంటర్లనూ ఏర్పాటు చేసినట్లు తెలిపింది. తరుచుగా ఎయిరిండియాలో ప్రయాణించే వారితో పాటు ప్రీమియం కస్టమర్లకు ఈ సేవలు అన్ని సమయాల్లో అందుబాటులో ఉంటాయని తెలిపింది.
ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్ ఐవీఆర్ వ్యవస్థ ద్వారా మా కస్టమర్లకు మొబైల్ నెట్‌వర్క్ ఆధారంగా వారి స్థానిక భాష ప్రాధాన్యతను ఆటోమేటిక్‌గా గుర్తించనున్నాం. దీంతో వారు ప్రత్యేకంగా భాషను ఎంచుకోవాల్సిన అవసరం లేదు. తమ మాతృభాషలోనే అవసరమైన సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఇది మా విలువైన కస్టమర్లకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం.' అని ఎయిరిండియా ఎయిర్‌లైన్స్ ఓ ప్రకటనలో తెలిపింది
Aug 27 2024, 19:24