తెలంగాణలో భారీ స్కాం: కూసాలు కదిలినట్టే..!!
తెలంగాణలో వెలుగులోకి వచ్చిన ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) కుంభకోణం వ్యవహారంలో సీఐడీ అధికారులు దూకుడు పెంచారు. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల యాజమాన్యాలపై కేసు పెట్టారు. వివిధ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
నకిలీ బిల్లులను సమర్పించడం ద్వారా సీఎంఆర్ఎఫ్ నుంచి భారీగా నిధులను విత్ డ్రా చేసిన ఉదంతం కలకలం రేపిన విషయం తెలిసిందే. సీఎంఆర్ఎఫ్ కింద పేషెంట్లకు వైద్యం చేసినట్లు నకిలీ డాక్యుమెంట్లను ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించి, వాటి ద్వారా నిధులను విడుదల చేయించుకున్నాయి ఆయా ఆసుపత్రుల యాజమాన్యం.
దీనిపై సచివాలయ రెవెన్యూ మంత్రిత్వ శాఖ సెక్షన్ ఆఫీసర్ డీఎస్‌ఎన్ మూర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందులో కొందరు రాజకీయ నాయకుల ప్రమేయం ఉన్నట్లు ఫిర్యాదులో పొందుపరిచారు. ఈ కుంభకోణంలో కొందరు బడా నాయకులు సైతం ఉన్నట్లు తేలింది.
దీనితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకున్నారు. విచారణను సీఐడీకి బదలాయించారు. రంగంలో దిగిన సీఐడీ అధికారులు తమ దర్యాప్తును ఉధృతం చేశారు. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో పలు ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యంపై ఎఫ్ఐఆర్‌ను నమోదు చేశారు.హైదరాబాద్, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్‌లోని పలు ఆసుపత్రులపై ఈ ఎఫ్ఐఆర్‌లు నమోదు అయ్యాయి. వాటిని ముఖ్యమంత్రి సహాయ నిధి జాబితా నుంచి తొలగించారు.
హైదరాబాద్‌లో- అరుణ శ్రీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి, శ్రీ కృష్ణ ఆసుపత్రి, జననీ ఆసుపత్రి, హిరణ్య ఆసుపత్రి, డెల్టా ఆసుపత్రి, శ్రీ రక్ష ఆసుపత్రి, ఎంఎంఎస్ ఆసుపత్రి, ఏడీఆర్ఎం మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి, ఎంఎంవీ ఇందిరా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి, శ్రీ సాయి తిరుమల ఆసుపత్రి ఉన్నాయి.ఖమ్మంలో- శ్రీకర మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి, గ్లోబల్ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి, డాక్టర్ జేఆర్ ప్రసాద్ ఆసుపత్రి, శ్రీ వినాయక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, శ్రీ సాయి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి, వైష్ణవి ఆసుపత్రి, న్యూ అమృత ఆసుపత్రి, మేఘాశ్రీ ఆసుపత్రి, ఆరెంజ్ ఉన్నాయి.
Aug 26 2024, 12:52