రుణమాఫీ వర్తించని రైతులకు అలర్ట్.. రేపటి నుంచి డైరెక్టుగా ఇంటికే..
అర్హులైనా రుణమాఫీ వర్తించని రైతుల వివరాల నమోదుకు ప్రభుత్వం ‘రైతుభరోసా పంట రుణ మాఫీ యాప్’ను తీసుకొచ్చింది. రేపటి నుంచి వారి వివరాలను నమోదు చేయాలని వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించింది. రూ.2లక్షల లోపు మాఫీ కాని వారి రుణఖాతాలు, ఆధార్ కార్డు తనిఖీ చేసి కుటుంబ సభ్యుల వివరాలను యాప్‌లో అప్లోడ్ చేయాలంది.
తెలంగాణ ప్రభుత్వం రూ. 2 లక్షల రైతు రుణమాఫీ పథకం అమలు చేసిన సంగతి తెలిసిందే. మెుత్తం మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశారు. మెుత్తం రూ. 31 వేల కోట్లు రైతుల అకౌంట్లలో జమ చేసినట్లు సర్కార్ వెల్లడించింది. అయితే కొందరు రైతులకు అర్హతలు ఉన్నా రుణమాఫీ వర్తించలేదు. రేషన్ కార్డు లేకపోవటం, ఆధార్ కార్డులో తప్పులు, పట్టాదార్ పాస్ పుస్తకంలోని పేరుతో సరిపోలకపోవటం వంటి కారణాలతో వారి రుణమాఫీ కాలేదు. దీంతో ఆయా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో అటువంటి రైతులకు రైతు రుణమాఫీ వర్తించేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా రైతుల వివరాల నమోదుకు 'రైతు భరోసా పంట రుణమాఫీ యాప్' ను తెలంగాణ వ్యవసాయశాఖ రూపొందించింది. ఈ యాప్‌ను ఇప్పటికే అన్ని జిల్లాల వ్యవసాయాధికారులు, డివిజన్, మండల స్థాయిలోని వ్యవసాయ విస్తరణాధికారులకు పంపించింది. వారు రుణమాఫీ వర్తించని రైతుల సమాచారం తెలుసుకొని యాప్‌లో నమోదు చేయాలని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. రేపటి (ఆగస్టు 27) నుంచే ఈ సర్వే ద్వారా యాప్‌లో వివరాల నమోదు ప్రక్రియ ప్రారంభం అవుతుందని అధికారులు తెలిపారు.
అర్హులైనా రుణమాఫీ వర్తించని రైతుల ఇంటికే అధికారులు నేరుగా వెళతారు. ముందుగా వారి లోన్ అకౌంట్లు, ఆధార్ కార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. అనంతరం కుటుంబ సభ్యుల వివరాలు పూర్తిగా తీసుకొని యాప్‌లో అప్‌లోడ్ చేస్తారు. పంట రుణాలు ఉన్న భార్యాభర్తలే కాకుండా ఇంట్లో 18 ఏళ్లు దాటిన వారి కుటుంబ సభ్యుల ఫొటోలు కూడా తీసుకుంటారు. ఆ తర్వాత కుటుంబ యజమానితో ధ్రువీకరణపత్రం సైతం తీసుకుంటారు. అందులో యజమాని తన లోన్ అకౌంట్, సంబంధిత బ్యాంకు బ్రాంచి వివరాలతోపాటు రుణమాఫీ కోసం కుటుంబ సభ్యుల వివరాలను తాను ఇష్టపూర్వకంగా రాసి ఇస్తున్నట్లు పేర్కొంటూ సంతకం చేయాల్సి ఉంటుంది. అందులోనే ఫోన్ నెంబర్ కూడా రాయాలి. వీటిని ధ్రువీకరిస్తూ గ్రామ కార్యదర్శి అటెస్టేషన్ చేయాలని వ్యవసాయ శాఖ ఆదేశాలు జారీ చేసింది.
Aug 26 2024, 12:43