కృష్ణా వరదలకు అమరావతి మునిగిపోతుందా ? వరల్డ్ బ్యాంక్ ప్రశ్నకు సర్కార్ సమాధానమిదే..!
ఏపీ రాజధాని అమరావతికి 15 వేల కోట్ల రుణం ఇచ్చేందుకు ముందుకొచ్చిన వరల్డ్ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంకులు ప్రభుత్వానికి ఓ కీలక ప్రశ్న వేశాయి. రెండు రోజులుగా అమరావతి రాజధానిలో పర్యటిస్తున్న ఈ రెండు బ్యాంకుల ప్రతినిధులు పలు విషయాలను సీఆర్డీఏ అధికారుల నుంచి అడిగి తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆ కీలక ప్రశ్నను వారికి సంధించాయి. అయితే దీనికి ప్రభుత్వం ఇచ్చిన సమాధానం కూడా ఆసక్తికరంగానే ఉంది.
గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో రాజధానిని అమరావతి వంటి ముంపు ప్రమాదం ఉన్న ప్రాంతంలో కట్టడం సరికాదని ఆ పార్టీ నేతలు పదే పదే చెప్పేవారు. చివరికి అమరావతి స్ధానంలో మూడు రాజధానుల్ని తెరపైకి తెచ్చారు. చివరికి అది కాస్తా కోర్టుల పరిధిలోకి వెళ్లిపోవడంతో చేసేది లేక మిన్నకుండిపోయారు. ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో తిరిగి అమరావతిలోనే రాజధాని నిర్మాణం కోసం పావులు కదులుతున్నాయి. అయితే ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ కూడా అదే ప్రశ్న వేసింది.
అమరావతికి కృష్ణావరదలతో ఉన్న ముప్పును వరల్డ్ బ్యాంక్ తో పాటు ఏడీబీ ప్రతినిధులు ప్రశ్నించారు. కృష్ణానది వరదల వల్ల రాజధానికి ముంపు ముప్పు ఉందా అని సీఆర్డీఏ అధికారుల్ని ప్రశ్నించారు. దీనికి వారు నేరుగా స్పందించలేదు. కరకట్టలు అయితే పటిష్టంగా ఉన్నాయని, ఎప్పుడూ ముంపు సమస్య ఎదురుకాలేదని మాత్రం వరల్డ్ బ్యాంక్, ఏడీబీ ప్రతినిధులకు సీఆర్డీఏ అధికారుల చెప్పారు. దీనిపై వారు సంతృప్తి చెందారా లేదా అన్నది మరికొన్ని రోజుల్లో ఎలాగో తేలిపోనుంది.
గతంలో టీడీపీ ప్రభుత్వం అమరావతి రాజధాని నిర్మాణం చేపట్టాక వరల్డ్ బ్యాంక్ నుంచి రుణం కోసం ప్రయత్నిస్తున్న సమయంలో స్థానికంగా ఉన్న కొందరు వైసీపీ అనుకూల రైతులు.. ఇక్కడ రాజధాని కడితే కృష్ణావరదలకు మునిగిపోతుందని ఫిర్యాదులు చేశారు. దీంతో పాటు వైసీపీ ప్రభుత్వం కూడా అమరావతికి రుణం అక్కర్లేదని చెప్పేయడంతో వరల్డ్ బ్యాంక్, ఏడీబీ అప్పట్లో తమ నిర్ణయాలను సవరించుకున్నాయి.
Aug 22 2024, 12:43