లక్షల కార్లు షోరూమ్‌ల్లోనే..
ప్రయాణికుల వాహనాల అమ్మకాలు నీరసించాయి. దీంతో ప్రస్తుతం దేశ వ్యాప్తంగా డీలర్ల వద్ద ఏడు లక్షల కార్ల నిల్వలు పేరుకు పోయాయి. వీటి విలువ ఎంత లేదన్నా రూ.73,000 కోట్ల వరకు ఉంటుందని ఆటోమొబైల్ డీలర్ల సంఘాల సమాఖ్య (ఫాడా) తెలిపింది. గత నెల ప్రారంభంలో 65-67
దీంతో ప్రస్తుతం దేశ వ్యాప్తంగా డీలర్ల వద్ద ఏడు లక్షల కార్ల నిల్వలు పేరుకు పోయాయి. వీటి విలువ ఎంత లేదన్నా రూ.73,000 కోట్ల వరకు ఉంటుందని ఆటోమొబైల్ డీలర్ల సంఘాల సమాఖ్య (ఫాడా) తెలిపింది. గత నెల ప్రారంభంలో 65-67 రోజుల అమ్మకాలకు సరిపడా నిల్వలు ఉంటే, ఇప్పుడది 70-75 రోజులకు చేరింది. కంపెనీలు ఎడాపెడా ఉత్పత్తి పెంచేయడం, అధిక వడ్డీరేట్లు ఇందుకు ప్రధాన కారణమంటున్నారు.
సాధారణంగా డీలర్ల వద్ద కార్ల నిల్వలు నెల రోజులకు సరిపడా ఉంటాయి. ఇప్పుడది 70-75 రోజులకు పెరిగి పోయింది. దీంతో డీలర్లు ఆర్థికంగా చితికి పోతున్నారు. వర్కింగ్ కాపిటల్ అవసరాలు పెరిగిపోయి వడ్డీల భారం పెరిగి పోతోంది. ఈ పరిణామంతో కొంత మంది డీలర్లు దివాలా తీసే ప్రమాదం పొంచి ఉందని ఫాడా ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. కార్ల కంపెనీలు రిటైల్ అమ్మకాలకు అనుగుణంగా తమ ఉత్పత్తి వ్యూహం మార్చుకుని సరఫరాలు తగ్గిస్తే, ఈ పరిస్థితి నుంచి కొంత వరకు బయట పడవచ్చని డీలర్లు చెబుతున్నారు.
పరిస్థితి నుంచి బయట పడేందుకు కార్ల కంపెనీలే తమను ఆదుకోవాలని డీలర్లు కోరుతున్నారు. నెల రోజులకు మించి ఉండే నిల్వల నిర్వహణకు అయ్యే వర్కింగ్ కాపిటల్ వడ్డీ ఖర్చులైనా కంపెనీలు భరించాలని కోరుతున్నారు. లేకపోతే ప్రస్తుత కష్టాల నుంచి బయట పడడం డీలర్లకు కష్టంగా కనిపిస్తోంది. దీనికి తోడు పేరుకుపోయిన వాహన నిల్వల అమ్మకాల కోసం కంపెనీలు ప్రత్యేక పథకాలు, డిస్కౌంట్లు, ఆఫర్లు ప్రవేశ పెట్టాలని డీలర్లు కోరుతున్నారు.
డీలర్లు ఇన్ని కష్టాల్లో ఉన్నా కార్ల కంపెనీల నుంచి పెద్దగా స్పందన లేదు. నిల్వలు పేరుకుపోవడం పెద్దగా ఆందోళన చెందాల్సిన అంశం కాదని భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (సియామ్) తెలిపింది. ఇటువంటి ఆటోపోట్లు ఏర్పడుతూనే ఉంటాయని తేలికగా తీసిపారేసింది. అయితే డీలర్లు ఆర్థికంగా బాగుండడం, కంపెనీలకే మంచిదని మాత్రం అంగీకరించింది. డీలర్ల వద్ద పేరుకు పోయిన వాహనాల నిల్వలను వదిలించేందుకు ఆయా కంపెనీలే బాధ్యతాయుతమైన చర్యలు తీసుకోవడం మంచిదని సియామ్ తెలిపింది.
Aug 22 2024, 12:34