గాజాలో పాఠశాలపై ఇజ్రాయేల్ బాంబు దాడి.. 100 మందికిపైగా మృతి
పశ్చిమాసియాలో పరిస్థితులు రోజు రోజుకూ మరింత ప్రమాదకరంగా మారిపోతున్నాయి. యుద్ధం అనివార్యమయ్యే పరిస్థితులు నెలకున్నాయి. హమాస్ అగ్రనేత హనియా హత్యతో ఇరాన్ రగిలిపోతోంది. తమ రాజధాని నగరంలోని అత్యంత కట్టుదిట్టమైన ప్రదేశంలో ఆయనను బాంబుతో హతమార్చింది ఇజ్రాయేల్. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించింది. దీంతో ఏ క్షణమైనా ఇజ్రాయేల్‌పై హమాస్, ఇరాన్ దాడులతో విరుచుకుపడేందుకు సిద్ధమయ్యాయి. ఇటు, గాజా నగరంలోని స్కూల్స్, హాస్పిటల్స్‌పై ఇజ్రాయేల్ సైన్యం భీకర దాడులు కొనసాగిస్తోంది.
హమాస్, హెజ్బొల్లా అగ్రనేతల హత్యలతో పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత దిగజారాయి. ఏ క్షణమైనా ఇజ్రాయేల్‌పై హమాస్, ఇరాన్ దాడులతో విరుచుకుపడే ముప్పు పొంచి ఉంది. ఈ తరుణంలోనూ గాజాపై ఇజ్రాయేల్ సైన్యం దాడులు కొనసాగిస్తోంది. తాజాగా, తూర్పు గాజాలోని ఓ పాఠశాలపై ఇజ్రాయెల్ బాంబులు వేసింది. ఈ ఘటనలో దాదాపు 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోగా.. పదుల సంఖ్యలో గాయపడినట్టు అంతర్జాతీయ మీడియా కథనాలు తెలిపాయి. నిరాశ్రయులు తలదాచుకుంటున స్కూల్‌పై టెల్ అవీవ్ సైన్యం విచక్షణారహితంగా దాడులకు తెగబడింది. అయితే, ఇది హమాస్ కమాండ్ సెంటర్ అని ఇజ్రాయేల్ ఆరోపిస్తోంది.
అల్-సాహబా ప్రాంతంలో అల్- తబీన్ స్కూల్‌పై ఇజ్రాయేల్ జరిపిన దాడిలో 40 మంది వీరులు అమరులయ్యారు.. డజన్ల కొద్దీ గాయపడ్డారు’ అని హమాస్ అధికార ప్రతినిధి మొహమూద్ బసల్ టెలిగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఇది భయంకరమైన ఊచకోత అని, పలువురు మంటల్లో చిక్కుకుని సజీవదహనమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. మంటలను అదుపుచేసి అమరుల మృతదేహాలు బయటకు తీయడం, గాయాలతో ఉన్నవారిని రక్షించడానికి రెస్క్యూ దళాలు ప్రయత్నిస్తున్నాయని బసల్ తెలిపారు.
గత వారం కూడా గాజాలోని మూడు స్కూళ్లను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయేల్ దాడి చేసింది. ఇటీవల ఓ పాఠశాలపై జరిపిన దాడుల్లో 30 మంది మృతిచెందారు. ఆగస్టు 1న దలాల్ అల్-ముఘ్రాబీ స్కూల్‌పై చేసిన దాడుల్లో 15 మంది మరణించారు. తాజా దాడిని ఇజ్రాయేల్ సమర్ధించుకుంది. గాజా నగరంలోని పాఠశాలలను హమాస్ కమాండ్ సెంటర్లు మార్చుకుందని ఆరోపించింది.
గతేడాది అక్టోబరు 7న ఇజ్రాయేల్‌లోకి చొరబడిన హమాస్.. నరమేథానికి తెగబడింది. ఈ మెరుపు దాడులకు అందుకు ప్రతీకారంగా గాజాపై ఇజ్రాయేల్ వైమానిక దాడులు, క్షిపణలు, బాంబులతో గత 10 నెలలుగా విరుచుకుపడుతోంది. హమాస్, ఇజ్రాయేల్ యుద్ధంలో ఇప్పటివరకు 40,000 మందికి పైగా పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోయారు.
గత నెలలో జరిగిన హమాస్, హెజ్బొల్లా సంస్థల ముఖ్య నేతల హత్యల నేపథ్యంలో పశ్చిమాసియాలో యుద్ధం మేఘాలు కమ్ముకున్నాయి. హమాస్‌ను భూస్థాపితం చేస్తామని ప్రతిజ్ఞ చేసిన ఇజ్రాయేల్.. గాజాపై బాంబుల వర్షం కురిపిస్తోంది. ఈ క్రమంలో భవనాలు, పాఠశాలలు, ఆసుపత్రులు, తాగునీటి వ్యవస్థలు ధ్వంసమయ్యాయి.
హమాస్‌తో భీకర యుద్ధం తర్వాత గాజా దక్షిణ ప్రాంతం ఖాన్ యూనిస్ నుంచి ఏప్రిల్‌లో బలగాలను ఉపసంహరించుకున్న ఇజ్రాయేల్.. మళ్లీ ప్రాంతానికి శనివారం తన సైన్యాలను పంపింది. ఈ ప్రాంతం వీడాలని ఇజ్రాయేల్ ఆదేశించడంతో వేలాది మంది ప్రాణాలను రక్షించుకోడానికి సురక్షిత ప్రాంతానికి తరలిపోతున్నారు. మూడు రోజుల్లోనే ఖాన్ యూనిస్ నుంచి 60 వేల మంది పాలస్తీనియన్లు పశ్చిమ ప్రాంతానికి తరలిపోయినట్టు ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది.
Aug 10 2024, 13:14