మంత్రి నారా లోకేష్ ఓఎస్డీ ఎవరో తెలుసా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్‌డీ)గా యువ అధికారి ఆకుల వెంకటరమణ నియమితులయ్యారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఓఎస్డీగా నియమించేందుకు సమర్థుడైన అధికారి కోసం లోకేష్ అన్వేషించారు.
కడప జిల్లా బద్వేల్ ఆర్డీవోగా ఉన్న వెంకటరమణను ఏరికోరి తీసుకొచ్చారు. బద్వేల్ ఆర్డీవోగా పనిచేయకముందు తూర్పుగోదావరి జిల్లాలోని చింతూరు ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్ గా పనిచేశారు. ఈ రెండుచోట్లా తన అద్భుతమైన పనితీరుతో ఆయన అందరి దృష్టిని ఆకర్షించారు.
ఉద్యోగం వచ్చినప్పటికీ చింతూరు ఐటీడీఏ అధికారిగా పనిచేసే సమయంలో అక్కడి గిరిజనుల జీవన ప్రమాణాలను పెంపొందించేందుకు, ప్రభుత్వ పథకాలను వారి దరికి చేరేందుకు రమణ ఎంతో కృషిచేశారు.
ప్రకాశం జిల్లా మార్కాపురం ఆయన స్వస్థలంకాగా, తల్లిదండ్రులు ఆకుల శ్రీరాములు, లక్ష్మీనరసమ్మ. విద్యాభ్యాసం మొత్తం మార్కాపురంలోనే సాగింది. సొంతంగా ప్రిపేర్ అయి ఎంసెట్ రాశారు. అందులో వెయ్యి రాంకును సాధించి ఈసీఈ తీసుకున్నారు. క్యాంపస్ సెలక్షన్స్ లో ఓ ప్రముఖ కంపెనీలో ఉద్యోగం వచ్చింది.
అప్పుడే లోటుపాట్లు గుర్తించారు ఆ ఉద్యోగం చేస్తూనే సహచర ఉద్యోగులతో కలిసి దగ్గరలో ఉన్న పాఠశాలలకు వెళ్లి విద్యార్థులకు పాఠాలు చెప్పేవారు. అలా చెపుతున్నప్పుడే లోటుపాట్లను చూసి ప్రభుత్వ ఉద్యోగం సంపాదిస్తే మరింత సేవ చేయవచ్చని భావించారు. ఉద్యోగానికి రాజీనామా చేసి సివిల్స్, గ్రూప్స్ పరీక్షలకు ప్రిపేరయ్యారు.
వ్యక్తిగత ఖర్చుల కోసం పాఠాలు చెప్పేవారు. 2011లో గ్రూప్-1కు హాజరుకాగా ఇంటర్వ్యూ వరకు వెళ్లారు. అదే సమయంలో ఆ పరీక్షను రద్దు చేశారు. మళ్లీ పరీక్ష నిర్వహించి ఫలితాలు విడుదల చేయగా వెంకటరమణ గ్రూప్-1కు మొదటి స్థానంలో నిలిచారు.
మార్కాపురంలోని విద్యార్థులను ప్రోత్సహించేందుకు తల్లిదండ్రుల పేరుతో సొంతంగా గ్రంథాలయాన్ని నడుపుతున్నారు. పోటీపరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటోంది. మార్కాపురం వచ్చిన ప్రతిసారీ గ్రంథాలయంలో విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు పేద విద్యార్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్ అందిస్తున్నారు.
Aug 03 2024, 13:00