బడ్జెట్లో కార్శికుల, ఉద్యోగుల, పెన్షనర్ల సంక్షేమం మాటేది జులై 30 న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద భారీ రాష్ట్రస్థాయి మౌన దీక్ష
విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యతనివ్వాలి
కేటాయించిన బడ్జెట్ ను ఖర్చు చేయాలి
పెండింగ్ డీఏలు, పీఆర్సీ బకాయిల విడుదల, నగదు రహిత ఆరోగ్య పధకంలో మార్పులు తదితరాల పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ జులై 30 న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద రాష్ట్ర పెన్షనర్ల ఐకాస ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి భారీ మౌన దీక్ష నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసీయేషన్ (టాప్రా) రాష్ట్ర కార్యదర్శి వి. కృష్ణ మోహన్ వెల్లడించారు.
ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు పెండింగ్ లోనున్న నాలుగు డీఏల చెల్లింపు, 2023 జులై ఒకటో తేదీ నుంచి అమలు కావాల్సిన రెండో పీఆర్సీ గురించి, ఫిట్ మెంట్ గురించి బడ్జెట్లో ప్రకటిస్తుందని ఆశించినప్పటికీ భంగపాటు ఎదురైంది. జీపీఎఫ్, మెడికల్ రీయింబర్స్మెంట్ తదితర బిల్లులు ఈ- కుబేర్ లో పెండింగ్ లో ఉన్నాయి.
అధికారంలోకి వస్తే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) ను రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్ (ఓపీఎస్) ను పునరుద్ధరిస్తామంటూ మ్యానిఫెస్టోల్లో ప్రకటించిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కానీ, కేంద్రంలో 01.01.2004 నుంచి నూతన పెన్షన్ స్కీమ్ (ఎన్ పీఎస్) ను అమలు పరచి వృద్ధాప్య భద్రత లేకుండా చేసిన బిజెపి ప్రభుత్వం కానీ తమ బడ్జెట్ ప్రసంగాల్లో ఓపీఎస్ ను అమలు చేస్తామనే ప్రస్తావన కూడా లేదు. మొదటి తారీఖున జీతాలు, పెన్షన్లు ఇస్తున్నామనే మాట తప్పి ఇతర సమస్యలను బడ్జెట్లో ప్రస్తావించక పోవడం ఆందోళనకరం.
కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ ప్రస్తావన కానీ, ఉపాధి కల్పన, రిక్రూట్మెంట్ పాలసీ విధానాన్ని కానీ ప్రస్తావించలేదు. బీడీ కార్మికులకు "చేయూత" జీవిత బీమా ఈఎస్ఐ, అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు, దీనికి బడ్జెట్లో కేటాయింపులు, ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, స్వీగ్గి జోమాటో వంటి గిగ్ కార్మికులకు సామాజిక భద్రత కల్పిస్తూ రాజస్థాన్ తరహా చట్టాన్ని మ్యానిఫెస్టోలో వాగ్దానం చేసిన విషయం మర్చిపోయినట్లున్నారు. చిరు వ్యాపారులు, ఫుట్ పాత్ వ్యాపారులకు వడ్డీ లేని రుణ సదుపాయం కల్పిస్తామన్న హామీని గాలి కొదిలేసారు.
పెరిగిన ధరల కనుగుణంగా కనీస వేతనాల జి.వోల సవరణ ప్రస్తావనే లేదు. అభయ హస్తం పేరిట వీధి వ్యాపారులకు ప్రత్యేక జోన్స్ ఏర్పాటు, హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు, హెల్త్ కార్డులతో సహా ప్రతి మండలంలో "హమాలీ నగర్" ఏర్పాటు చేస్తామని చెప్పినా వాటి గురించి ప్రస్తావనే లేదు.
మిషన్ భగీరథ కార్మికులకు కనీస వేతనాలు, గ్రామ పంచాయతీ కార్మికుల, మధ్యాహ్న భోజన కార్మికుల బకాయి వేతనాలు చెల్లింపునకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పథకాల్లో పని చేస్తున్న స్కీం వర్కర్లకు కనీస వేతనాలు, చట్టబద్ధ హక్కులు కల్పించే చర్యలే లేవు.
విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యతనివ్వాలని, కేటాయించిన బడ్జెట్ ను ఖర్చు చేయాలని, రైతు భరోసా కౌలు రైతులకు కూడా ఇవ్వాలని, వాగ్ధానాలు అమలు పరుస్తూ బడ్జెట్లో మార్పులు చేయాలని ఉద్యోగుల, ఆఫీసర్ల, పెన్షనర్ల జాతీయ నేత వి. కృష్ణ మోహన్ ఆర్థిక మంత్రికి విజ్ఞప్తి చేశారు.
Jul 26 2024, 16:59