బ్రిడ్జి కూల్చివేత.. ఆ రూట్‌లో ఏళ్లపాటు ట్రాఫిక్ ఆంక్షలు
నగరంలోని దశాబ్దాల నాటి బ్రిడ్జిని కూల్చేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. ఆ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తీర్చేందుకు ఆ చారిత్రాత్మక బ్రిడ్జిని కూలగొట్టి.. దాని స్థానంలో అత్యాధునిక బ్రిడ్జిని నిర్మించేందుకు ప్రణాళికలు చేస్తున్నారు. అయితే ఈ బ్రిడ్జిని కూల్చి.. కొత్త బ్రిడ్జి ప్రారంభించేందుకు 2 ఏళ్ల సమయం పట్టనుంది.
ఈ క్రమంలోనే ఆ ప్రాంతంలో 2 ఏళ్ల పాటు ట్రాఫిక్‌ను ఆంక్షలు విధించనున్నారు. అంతేకాకుండా నో పార్కింగ్ నిబంధనలు కూడా అమలు చేయనున్నారు. ఇంతకీ ఆ బ్రిడ్జి ఏది. ఏ నగరంలో ఉందో ఈ స్టోరీలో చూద్దాం.
ప్రస్తుతం దేశంలో నగరాల్లో జనాభా రోజురోజుకూ పెరిగిపోతోంది. ఇక వాహనాల సంఖ్య కూడా గణనీయంగా పెరిగిపోతుండటంతో.. ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతోంది. నగరాల్లో ట్రాఫిక్ సమస్యను తీర్చేందుకు ప్రభుత్వాలు ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌లు నిర్మిస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే పాత, శిథిలావస్థకు చేరుకున్న బ్రిడ్జిలను కూల్చివేసి.. వాటి స్థానంలో కొత్త బ్రిడ్జిలను నిర్మిస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్రలోని ముంబై మహా నగరంలో మరో కీలక ఫ్లై ఓవర్ నిర్మించనున్నారు. దీని కోసం ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన బ్రిడ్జిని కూల్చివేయనున్నారు. ఇందుకోసం ఆ మార్గంలో 2 ఏళ్ల పాటు ట్రాఫిక్ మళ్లించనున్నారు. అదే సియోన్ రోడ్ ఓవర్ బ్రిడ్జ్.
ఇప్పటికే ఈ సియోన్ ఆర్వోబీపైకి భారీ వాహనాలను అనుమతించకుండా అధికారులు నిషేధం విధించారు. కేవలం తేలికపాటి వాహనాలకు మాత్రమే ఈ సియోన్ ఆర్వోబీపైకి ఎక్కేందుకు అనుమతి ఉంది. వచ్చే 3 ఏళ్లలో సెంట్రల్ ముంబైలోని ట్రాఫిక్ సమస్యలను మార్చే ప్రణాళికల్లో భాగంగా ముంబై ట్రాఫిక్ పోలీసులు.. చారిత్రక సియోన్ రోడ్ ఓవర్ బ్రిడ్జిని కూల్చివేసి..
దాని స్థానంలో మరో హైటెక్ వంతెనను నిర్మించనున్నట్లు ప్రకటించారు. దీనికోసం జులై 31 వ తేదీ అర్ధరాత్రి నుంచి సియోన్ రోడ్ ఓవర్ బ్రిడ్జిని మూసివేయనుండగా.. 2026 జూలై 31వ తేదీ వరకు కొత్త ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు తెలిపారు.
ఈ సియోన్ రోడ్ ఓవర్ బ్రిడ్జ్‌కు ముంబై నగరంలో అధిక ప్రాధాన్యం ఉంటుంది. ఎందుకంటే మంబైలోని సియోన్ తూర్పు, సియోన్ పశ్చిమ ప్రాంతాలను కలిపే కీలక బ్రిడ్జ్. ఇక వచ్చే నెల 1వ తేదీ నుంచి సియోన్ రోడ్ ఓవర్ బ్రిడ్జి కూల్చివేత ప్రక్రియ ప్రారంభం అవుతుందని ముంబై ట్రాఫిక్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఈ క్రమంలోనే ఆ మార్గంలో వెళ్లే వాహనాలన్నింటినీ 2 ఏళ్ల పాటు దారి మళ్లించనున్నట్లు వెల్లడించారు.
మరోవైపు.. ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఆయా మార్గాల్లో నో పార్కింగ్ ఆంక్షలు కూడా విధించారు. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే.. ముంబై ట్రాఫిక్ సమస్యలకు కొంత పరిష్కారం దొరుకుతుందని.. నగరంలో కీలకమైన తూర్పు-పశ్చిమ ప్రాంతాలకు మరింత మెరుగైన రవాణా సౌకర్యం ఉంటుందని చెప్పారు.
Jul 26 2024, 07:12