బీహార్ కు మొండి చేయి ఏపీకి ఇండికేషన్ !
దేశంలో ఏదో ఒక రాష్ట్రం ప్రత్యేక హోదా కోరుతూనే ఉంటుంది. ఎప్పటి మాదిరిగానే కేంద్రం తిరస్కరిస్తూనే ఉంటుంది. మోడీ ప్రభుత్వం ఏర్పడటానికి కారణమైన బీహార్ లోని జేడీయూ తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరింది. కానీ కేంద్ర ప్రభుత్వం రిజెక్ట్ చేసింది. ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఇప్పుడున్న నిబంధనలు బీహార్ కు వర్తించవని కేంద్రం స్పష్టం చేసింది.
ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్ కు ఆ రాష్ట్రంలోని అన్ని పార్టీలు మద్దతు పలుకుతున్నాయి. ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న ఎల్జేపీ (రామ్ విలాస్ పాశ్వాన్) పార్టీ కూడా మద్దతు ప్రకటించింది. అయినప్పటికీ మోడీ సర్కారు ప్రత్యేక హోదా ఇచ్చేలా లేదు. బీహార్ లో 2000 సంవత్సరం నుంచి ప్రత్యేక హోదా డిమాండ్ ఉంది.
కానీ కేంద్రంలో కాంగ్రెస్ సర్కారు గానీ, ఎన్డీయే సర్కారు గానీ ఈ డిమాండ్ నెరవేర్చలేదు. ప్రత్యేక హోదా ఇవ్వడానికి మోడీ ప్రభుత్వం ఒప్పుకోలేదు కాబట్టి ఆ ప్రభుత్వానికి జేడీయూ మద్దతు ఉపసంహరించుకోవాలని బీహార్ లోని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. జేడీయూలోని కొందరు నాయకులు కూడా ఇదే మాట అంటున్నారు.
ఇక బీహార్ కు ప్రత్యేక హోదాను రిజెక్ట్ చెయ్యడమంటే ఏపీకి కూడా ఈ హోదా ఇచ్చేది లేదని కేంద్రం ఇండికేషన్ ఇచ్చిందన్న మాట. 2014 లో ఉమ్మడి రాష్ట్రాన్ని విభజించిన అప్పటి కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని వాగ్దానం చేసింది. కానీ ఆ కూటమి మళ్ళీ అధికారంలోకి రాలేదు.
ఎన్డీయే కూటమి అంటే ప్రధానంగా బీజేపీ ఏపీలో టీడీపీ మద్దతు కూడగట్టుకొని అధికారంలోకి రావడం కోసం ప్రత్యేక హోదా తాము ఇస్తామని ఆశ పెట్టింది. కానీ అధికారంలోకి రాగానే మొండి చేయి చూపింది. అప్పట్లో చంద్రబాబు ప్యాకేజీ కోసం రాజీ పడి హోదాను పక్కన పెట్టేశారు. ఈ వైఖరిని వైఎస్ జగన్ క్యాష్ చేసుకున్నారు. తనకు అధికారం ఇస్తే ప్రత్యేక హోదా సాధిస్తానని అన్నారు.
ఇందుకోసం పాతిక మంది ఎంపీలను గెలిపించాలని వేడుకున్నారు. 2019 లో జగన్ పార్టీ సూపర్ డూపర్ గా గెలిచి అధికారం చేపట్టింది. ఎంపీలు కూడా భారీగా గెలిచారు. కానీ …ఎన్డీయేకు తమ పార్టీ మద్దతు అవసరం లేదు కాబట్టి ప్రత్యేక హోదాను డిమాండ్ చేయలేకపోతున్నామని జగన్ చెప్పారు. ఇక ఏపీ ప్రజలు కూడా గమ్మున ఉండిపోయారు.
అనేక కారణాలతో ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో ఏపీలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చింది. టీడీపీ మోడీ సర్కారుకు మద్దతుగా నిలిచింది. అయితే జగన్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు ప్రత్యేక హోదా కోసం పోరాడాలని డిమాండ్ చేస్తున్నాయి. కానీ చంద్రబాబు హోదా గురించి ఆలోచించడం లేదు. ఇప్పుడు బీహార్ కు రిజెక్ట్ చేశాక ఇక అడిగే అవకాశమే లేదు.
టీడీపీ మద్దతుదారైన ఓ పత్రిక పదేళ్ల తరువాత హోదా కోసం డిమాండ్ చేయడం అనవసరమని రాసుకొచ్చింది. దాని బదులు కేంద్రం నుంచి ఇతరత్రా సహాయాలు పొంది రాష్ట్రాన్ని డెవలప్ చేయాలని బాబుకు సలహా ఇచ్చింది. బాబు ఆలోచన కూడా ఇదే. మరి హోదా రిజెక్ట్ నేపథ్యంలో జేడీయూ ఎలాంటి స్టెప్ తీసుకుంటుందో చూడాలి.
Jul 24 2024, 09:37