నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు..
నేటి నుంచి ఏపీ అసెంబ్లీ (AP Assembly) సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. అనంతరం స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు నేతృత్వంలో శాసనసభ వ్యవహారాల కమిటీ సమావేశం కానుంది.
అసెంబ్లీ ఎజెండా, పని దినాలపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. రేపు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఉభయ సభల్లో చర్చకు ఆమోదం తెలపనున్నారు. బుధవారం నుంచి వరుసగా సభ ముందు చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ శ్వేత పత్రాలను ఉంచనుంది.
శాంతిభద్రతలు, పరిశ్రమలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వరుసగా మూడు శ్వేత పత్రాలను ప్రభుత్వం సభ ముందు ఉంచనుంది. గవర్నర్ ప్రసంగం సమయంలో నిరసన తెలియజేస్తామని ఇప్పటికే వైఎస్ జగన్ ప్రకటించారు. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకొని బయటకు వెళ్లిపోవాలని నిర్ణయించారు.
రేపటికల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఢిల్లీ రావాలంటూ ముందుగానే హుకుం జారీ చేశారు. ఓవైపు శాసనసభ జరుగుతుండగా ఇక్కడ ఉండకుండా ఢిల్లీ వెళ్లి ప్రయోజనం ఏంటని పార్టీ సీనియర్లు ప్రశ్నిస్తున్నారు. సభ జరుగుతుండగా బయట ఆందోళన చేయడం కంటే సభలో అంశాలను ప్రస్తావిస్తే ఉపయోగమంటూ సూచిస్తున్నారు.
శ్వేత పత్రాల సమయంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అరాచకాలను ప్రస్తావిస్తే సమాధానం చెప్పలేక వెళ్లిపోయారంటూ విమర్శించే అవకాశం అంటూ ప్రస్తావించారు.
ఎన్నికల్లో ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పినా ఇంకా తాను చెప్పిందే చేయాలంటూ నాయకులకు జగన్ హుకుం జారీ చేశారు. గవర్నర్ ప్రసంగ సమయంలో సభను అడ్డుకొని సభ నుంచి వెళ్లిపోయే ఎత్తుగడ వేస్తున్నారు.
జగన్ వ్యూహాలపై మండిపడుతున్న ఆ పార్టీ నేతలు. ఇది సెల్ఫ్ గోలేనంటూ సన్నిహితుల వద్ద ప్రస్తావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లు సైతం ఈసారి సభలో ప్రభుత్వం ఉంచనుంది. మధ్యాహ్నం రెండున్నర గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్లో తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష సమావేశం కానుంది. దీనికి టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు
Jul 22 2024, 10:15