'తెలుగు నాటకం- సాహిత్య సమాలోచన' జాతీయ సదస్సు
NLG: నాగార్జున ప్రభుత్వ కళాశాల తెలుగుశాఖ ఆధ్వర్యంలో 'తెలుగు నాటకం- సాహిత్య సమాలోచన' అను అంశంపై జాతీయ సదస్సు జరిగింది. ముఖ్యఅతిథిగా విచ్చేసిన ప్రముఖ కవి, సాహిత్య పరిశోధకులు డాక్టర్ సుంకిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ.. ఇలాంటి సదస్సులు నాటక సాహిత్యం పట్ల ఆసక్తిని పెంపొందింపజేయడమే కాకుండా విద్యార్థులను పరిశోధకులుగా సాహిత్య అభిమానులుగా తీర్చిదిద్దేటట్లు చేస్తాయని అన్నారు.
తెలంగాణ నాటక సాహిత్యాన్ని గురించి తెలియజేస్తూ ఎంతోమంది నాటకా రచయితల రచనలు నేటి సాహితీ లోకానికి అందడం లేదని అలాంటివారి సాహిత్యాన్ని వెలికిదీసి భావితరాలకు అందజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.
కీలకోపన్యాసం గావించిన జాతీయ ఉత్తమ సినీ విమర్శక పురస్కార గ్రహీత డాక్టర్ ఎం. పురుషోత్తమాచార్యులు మాట్లాడుతూ తెలుగు నాటక రంగం ఆరంభ వికాసాలను గురించి సమగ్రంగా తన ఉపన్యాసం ద్వారా తెలియజేశారు. నాటక రచయితతో పాటు నటులు, నాటక ప్రయోక్త అందరూ తమ తమ బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించినప్పుడే ఆ నాటకం జనరంజకం అవుతుందని, పది కాలాలపాటు నిలుస్తుందని అన్నారు. అంతేకాకుండా నాటకం రమణీయమైన దృశ్యకావ్యమని ఇలాంటి కావ్యాలను రాసినటువంటి ఎంతోమంది రచయితలు తెలుగు సాహిత్యంలో సుస్థిరమైన స్థానాన్ని పొందినారని అన్నారు. ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిథిగా విచ్చేసిన ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య సాగి కమలాకర శర్మ మాట్లాడుతూ నాటక రంగం మనోరంజకమైనదని ఇవాళ సినిమా ప్రభావం వల్ల నాటక రంగ సంస్థలు కనుమరుగైపోతున్నాయని అలాంటి సంస్థల్ని, నటుల్ని ఆదరించాల్సిన అవసరం నేటి ప్రభుత్వం పైన ఉందని అన్నారు. అదేవిధంగా సాహిత్యంలో నాటకం చాలా ప్రధానమైనదని, సాహిత్యాన్ని నేటి విద్యార్థులు ఎక్కువ అధ్యయనం చేస్తూ మంచి పరిశోధకులుగా రాణించాలని అన్నారు. ప్రారంభ సమావేశానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రధానాచార్యులు డాక్టర్ సముద్రాల ఉపేందర్ మాట్లాడుతూ ఇలాంటి సదస్సుల వల్ల విద్యార్థుల్లో సృజనాత్మక శక్తి పెంపొందుతుందని, ప్రతి విద్యార్థి ఇలాంటి కార్యక్రమాల్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ ఫ్యాకల్టీ డీన్ ఆచార్య కరిమిళ్ళ లావణ్య, తెలుగు శాఖ అధ్యక్షులు డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య, ఎన్. లవేందర్ రెడ్డి, డాక్టర్ వెల్దండి శ్రీధర్, జి. గోవర్ధనగిరి, డాక్టర్ టి. సైదులు, ఎస్. ప్రభాకర్, ఎం. లింగస్వామి, బి. రమ్య, డి. అంజయ్య, గ్రంథపాలకులు డాక్టర్ ఎ. దుర్గాప్రసాద్ ఫిజికల్ డైరెక్టర్ కె. మల్లేశంతో పాటు,సుమారు 20 మంది వివిధ కళాశాల నుండి విచ్చేసిన అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులు పత్ర సమర్పణ చేశారు. ఇతర శాఖల అధ్యాపకులతో పాటు విద్యార్థులు ఈ సదస్సులో పాల్గొన్నారు.
Mar 30 2024, 19:16