Hyderabad: హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు..
హైదరాబాద్: ఆదాయానికి మించి అక్రమాస్తుల కేసులో హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెల్లడయ్యాయి. బాలకృష్ణ ఇల్లు సహా 18 చోట్ల ఏసీబీ ఇటీవల సోదాలు చేసి భారీగా స్థిర, చరాస్తులకు సంబంధించిన దస్త్రాలను గుర్తించింది..
బాలకృష్ణ ఇంట్లో స్వాధీనం చేసుకున్న 50 స్థిర, చరాస్తులకు సంబంధించిన పత్రాలను పరిశీలించగా.. వాటి విలువ దాదాపు రూ.5 కోట్లు ఉంటుందని అంచనా. వాటితోపాటు సోదాల్లో రూ.99 లక్షల నగదు, నాలుగు కార్లు, రూ.8.26 కోట్ల విలువైన బంగారం, వెండి, వాచ్‌లు, ఫోన్లు, గృహోపకరణాలను సీజ్ చేసినట్లు రిమాండ్ రిపోర్టులో అధికారులు పేర్కొన్నారు..
పలు ఇన్‌ఫ్రా కంపెనీల్లోనూ సోదాలు చేసినట్లు ఏసీబీ పేర్కొంది. ''155 డాక్యుమెంట్ షీట్లు, 4 బ్యాంక్ సాప్‌బుక్‌లు స్వాధీనం చేసుకున్నాం. ఇందుకు సంబంధించి బినామీలను విచారించాలి.
ఇతర అధికారుల పాత్రపై దర్యాప్తు జరపాల్సి ఉంది. పీర్జాదిగూడలో రమాదేవి, జూబ్లీహిల్స్‌లో ప్రమోద్ కుమార్, మాదాపూర్‌లో సందీప్ రెడ్డి, బాచుపల్లిలో సత్యనారాయణ మూర్తి ఇళ్లు సహా మొత్తం 18 చోట్ల సోదాలు చేశాం'' అని రిమాండ్ రిపోర్టులో ఏసీబీ వివరించింది..
Jan 27 2024, 19:33