Ayodhya Ram Mandir: నేడే అయోధ్య రామయ్య ప్రాణప్రతిష్ట.. సర్వాంగ సుందరంగా ముస్తాబైన రామమందిరం
అయోధ్యలో ఎటు చూసినా రామనామ సంకీర్తనలతో.. ఆధ్యాత్మిక కోలాహలం కనిపిస్తుంది. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం మరికొన్ని గంటల్లో ప్రారంభంకానుంది..
మహా ఘట్టానికి అయోధ్యాపురి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఈ రోజు అయోధ్యలో బాల రామయ్య కొలువుదీరనున్నాడు. కోట్లాది మంది చిరకాల స్వప్నం నెరవేరబోతుంది. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రకారం.. అయోధ్యలోని శ్రీరామ జన్మభూమిలో జరిగే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం మంగళ ధ్వనితో ప్రారంభమవుతుంది. ఉదయం 10 గంటల నుంచి మంగళ ధ్వని స్టార్ట్ అవుతుంది.
దాదాపు రెండుగంటల పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన 50 మందికిపైగా కళాకారులు సంగీత వాయిద్యాలతో శ్రీరాముడికి నీరాజనం అర్పించనున్నారు. ఇప్పటికే 18 రాష్ట్రాలకు చెందిన వాయిద్యాలు అయోధ్యకు చేరుకున్నాయి. ఆలయ ప్రాంగణంలో భారతీయ సంప్రదాయంలో ఉపయోగించే అన్ని రకాల వాయిద్యాలు వాయిస్తారు.
ఇక ఈ రోజు మధ్యాహ్నం సరిగ్గా 12.29కి అభిజిత్ లగ్నంలో క్రతువు ప్రారంభం అవుతుంది. 84 సెకన్లపాటు సాగనున్న ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ ప్రాణప్రతిష్ఠలో పాల్గొననున్న 14మంది దంపతులు పాల్గొననున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఉదయం 10:25కి అయోధ్య చేరుకోనున్నారు.
ఈ క్రమంలో అయోధ్య రామాలయం చుట్టూ కట్టుదిట్టమైన భద్రతా వలయం ఏర్పాటు చేశారు. రామ్‌లలా ప్రాణప్రతిష్ఠకు 7వేల మందికి ఆహ్వానాలు అందించారు. అతిథుల్లో 4వేల మంది స్వామీజీలు, 50 మంది విదేశీయులు ఉన్నారు. వీఐపీల తాకిడితో అయోధ్యకి వందకి పైగా ఛార్టెర్డ్ విమానాలు, 12 వేల మంది పోలీసులు, 10వేల సీసీ కెమెరాలు, ఏఐతో పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు. సాధువులు, ప్రముఖులు అయోధ్య చేరుకుంటున్నారు..
Jan 22 2024, 16:29