Ram Mandir: అయోధ్య రాములోరి ఆలయానికి మూడంచెల భద్రత.. ఎస్పీజీ కూడా..
అయోధ్య: అయోధ్యలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ప్రధాని మోదీ (PM Modi) చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది..
వేలాది మంది అతిథులు హాజరవనున్నారు. అయోధ్యలో ఉగ్రదాడి జరగొచ్చనే నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో ఉత్తరప్రదేశ్ పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఆలయం వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు.
నిఘా నీడలో..
అయోధ్య రాములోరి ఆలయం (Ram Mandir) వద్ద స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ (ఎస్ఎస్ఎఫ్), సీఆర్పీఎఫ్, ప్రొవిన్షియల్ ఆర్మ్‌డ్ కాన్‌స్టబ్యూలరీ (పీఏసీ), ఉత్తరప్రదేశ్ సివిల్ పోలీసులు విధుల్లో ఉంటారు. ప్రాణ ప్రతిష్ఠ జరిగే సోమవారం 100 మంది ఎస్ఎస్ఎఫ్ కమాండోలు విధుల్లో ఉంటారు. వీరికి నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ఎస్‌జీ) శిక్షణ అందించారు. ఎస్ఎస్ఎఫ్ గార్డులు ఉగ్రవాద వ్యతిరేక వ్యుహాలను తిప్పికొట్టడంలో నిష్ణాతులు. 1990 నుంచి రామజన్మభూమి ప్రాంతంలో సీఆర్పీఎఫ్ సిబ్బంది భద్రత కల్పించారు. ఇప్పుడు ప్రధాన ఆలయం వెలుపల విధులు నిర్వహించనుంది. రెడ్ జోన్‌లో పీఎసీ, యూపీ పోలీసులు, ఎస్ఎస్ఎఫ్ మొత్తంగా 1400 మందిని మోహరించామని ఎస్ఎస్ఎఫ్ మీడియా సెల్ ఇంచార్జీ వివేక్ శ్రీ వాస్తవ తెలిపారు.
రెడ్, ఎల్లో జోన్స్
ఎల్లో జోన్‌లో పీఏసీ, యూపీ సివిల్ పోలీసులు విధుల్లో ఉంటారు. ఆలయ పరిసరాల్లో కొందరు ఎస్ఎస్ఎఫ్ సిబ్బంది పెట్రోలింగ్ చేస్తారు. అదనపు బలగాల సాయం కూడా తీసుకుంటారు. డ్రోన్లు, సీసీటీవీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా నిరంతరం భద్రతను పర్యవేక్షిస్తారు. భద్రతా విధుల్లో స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ కూడా పాల్గొంటుందని వివేక్ శ్రీ వాత్సవ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ప్రధాని భద్రత ఏర్పాట్లను ఎస్పీజీ పర్యవేక్షిస్తోంది. రామాలయ భద్రత విధుల్లో ఎస్పీజీ సిబ్బంది పాల్గొంటారు.
Jan 20 2024, 19:27