Bharat Jodo Nyay Yatra: అన్యాయ కాలంలో ఉన్నందునే న్యాయ్ యాత్ర: రాహుల్
దేశంలో అన్యాయ కాలం నడుస్తున్నందునే న్యాయ్ యాత్ర చేపట్టినట్టు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు..
మణిపూర్ (Manipur)లోని ధౌబల్‌లో 'భారత్ జోడో న్యాయ్ యాత్ర' (Bharat Jodo Nyay Yatra)ను రాహుల్ ఆదివారంనాడు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, దేశ ప్రజలను ఏకం చేయడానికే భారత్ న్యాయ్ యాత్ర చేపడుతున్నామని చెప్పారు.
''చాలా మంది న్యాయ్ యాత్ర ఎందుకని అడుగుతున్నారు. అన్యాయ కాలంలో ఉన్నాము కాబట్టే న్యాయ్ యాత్ర చేపడుతున్నాం. ప్రజలు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా అన్నివిధాలా అన్యాయాలకు గురవుతున్నారు. న్యాయ్ యాత్రతో ప్రజలందరిని కలిసి నేరుగా కష్టాలను అడిగి తెలుసుకుంటున్నాం'' అని రాహుల్ తెలిపారు.
సిగ్గుచేటు...
మణిపూర్ కొద్దిరోజులుగా హింసతో రగులుతోందని, అయినప్పటికీ ప్రజల కన్నీళ్లు తుడవడానికి దేశ ప్రధాని రాకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. ''2004 నుంచి నేను రాజకీయాల్లో ఉన్నాను. దేశంలో పాలన మొత్తం కుప్పకూలిన ఒక ప్రాంతానికి రావడం మాత్రం ఇదే మొదటిసారి. గత ఏడాది జూన్ 29 తర్వాత మణిపూర్ ఎంతమాత్రం మణిపూర్‌లా లేదు. ఎక్కడ చూసినా విద్వేష వ్యాప్తి కనిపించింది. లక్షలాది మంది కగడండ్ల పాలయ్యారు. అనేక మంది తమ కుటుంబ సభ్యులను కోల్పోయారు. అయినా ఇంతవరకూ దేశ ప్రధాని వచ్చి ప్రజల కన్నీళ్లను తుడవలేదు. ఇది సిగ్గుచేటు. ప్రధానికి, బీజేపీకి, ఆర్ఎస్ఎస్‌కు మణిపూర్ భారత్‌లో భాగం కాకపోయి ఉండవచ్చు'' అని రాహుల్ ఆక్షేపించారు..
కోల్పోయిన శాంతిని తిరిగి తెస్తాం..
బీజేపీ రాజకీయాల వల్ల మణిపూర్‌లో కోల్పోయిన శాంతి, సామరస్యాన్ని తిరిగి తీసుకువస్తామని ప్రజలకు రాహుల్ మాట ఇచ్చారు. ప్రజల సాధకబాధకాలు తెలుసుకునేందుకు, శాంతి-సామరస్యాలతో కూడిన న్యూ-విజన్ ఆఫ్ ఇండియాను తెచ్చేందుకు తాము యాత్ర చేపట్టినట్టు చెప్పారు..
Jan 14 2024, 20:51