నారాయణపేట జిల్లాలో మరో చిరుత మృతి
తెలంగాణలో వరసగా పులులు మరణించడంతో సంచలనం రేపుతుంది. ఇప్పటికే కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ ఫారెస్ట్‌లో రెండు పులులు మృతి చెందగా.. అదృశ్యమైన పులుల్లో ఒకటి శనివారం సాయంత్రం కెమెరా కంటికి చిక్కింది.
అది ప్రాణాలతోనే ఉంది అని ఊపిరి పీల్చుకునే లోపు.. ఇప్పుడు మరో చిరుత ప్రాణాలు వదలటం ఆందోళన కలిగిస్తోంది. అయితే.. ఈసారి నారాయణపేట జిల్లాలో చిరుత మృతి చెందింది.
దామరగిద్ద మండలం కంసన్ పల్లి, వత్తు గుండ్ల గ్రామాల మధ్య పొలాల్లో మూడు చిరుత పులులు సంచరించగా.. అందులో ఒకటి మరణించింది. మరో రెండు పారిపోయాయి.
అయితే.. పొలాల్లో మూడు చిరుతలు తిరుగుతుండ టాన్ని గమనించిన స్థానికులు వాటిని చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. జనాల రాకను గమనించిన చిరుత కూనలు రెండు అడవిలోకి పారిపోయాయి.
అనారోగ్యంతో బాధపడు తున్న తల్లి చిరుత మాత్రం నిస్సహాయ స్థితిలో అక్కడ క్కడే తచ్చాడుతూ కనిపించింది. దీంతో.. కొందరు యువకులు పులిని ఫొటోలు, వీడియోలు తీశారు.
పులి అనారోగ్యంగా ఉంది.. ఏమనటం లేదన్న కారణంతో.. మరికొంత మంది యువకులు.. చిరుతతో సెల్ఫీల కోసం ఎగబడ్డారు. ఈలోపు సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు.
అయితే.. చిరుత ఉన్న ప్రదేశానికి అధికారులు చేరుకునే లోపే చిరుత ప్రాణాలు వదిలింది. చిరుత మృతి గల కారణాలను అధికారులు అడిగి తెలుసుకుంటున్నారు.
చిరుత అనారోగ్యం కారణంగానే మృతి చెందిందని ప్రాథమికంగా తెలుస్తోంది. కాగా.. చిరుతకు అక్కడే పోస్టుమార్టం నిర్వహించిన అధికారులు నివేదిక వచ్చిన తరువాత పూర్తిస్థాయిలో విచారణ చేపట్టనున్నట్టు తెలిపారు.
Jan 14 2024, 10:36