సీఎం కుర్చీపై సీనియర్ నేతల ఆశలు.. అన్ని పార్టీల్లోనూ అదే తంతూ.. తేడా కొడితే..?
Telangana Election: సీఎం కుర్చీపై సీనియర్ నేతల ఆశలు.. అన్ని పార్టీల్లోనూ అదే తంతూ.. తేడా కొడితే..?
తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఎన్నికల మూడ్ కనిపిస్తోంది. మా పార్టీ అధికారంలోకి వస్తే నేనే సీఎం. ఇలా చెబితేనే నియోజకవర్గ ఓటర్లు ప్రభావితం అవుతారని అనుకుంటున్నారా? లేక నిజంగానే ఆయనకు అంత సీనుందా? తెలంగాణలో ఓటర్లు ఇప్పుడు వింత పరిస్థితి ఎదురవుతోంది. అటు ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇటు ఎవరు అని బీఆర్‌ఎస్ చేసే టీజింగ్‌ని భరించలేక.. నేనే సీఎం అంటూ బయల్దేరారు జాతీయ పార్టీల సీనియర్ నేతలు.
తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఎన్నికల మూడ్ కనిపిస్తోంది. మా పార్టీ అధికారంలోకి వస్తే నేనే సీఎం. ఇలా చెబితేనే నియోజకవర్గ ఓటర్లు ప్రభావితం అవుతారని అనుకుంటున్నారా? లేక నిజంగానే ఆయనకు అంత సీనుందా? తెలంగాణలో ఓటర్లు ఇప్పుడు వింత పరిస్థితి ఎదురవుతోంది. అటు ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇటు ఎవరు అని బీఆర్‌ఎస్ చేసే టీజింగ్‌ని భరించలేక.. నేనే సీఎం అంటూ బయల్దేరారు జాతీయ పార్టీల సీనియర్ నేతలు.
సీఎం.. సీఎం.. సీఎం.. మేమంటే మేమే సీఎం.. ఇక అధికారం తథ్యమే.. సీఎం కుర్చీపై కూర్చోడమే తరువాయి అన్న రేంజ్‌లో అన్ని పార్టీల ప్రచారం సాగుతోంది. ఇన్నాళ్లు కాంగ్రెస్‌కే పరిమితం అయిన సీఎం కుర్చీ రేసు.. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకీ పాకింది. ఇది చూసి బీఆర్‌ఎస్ నేతలు సెటైర్లు వేస్తున్నారు. మా ముఖ్యమంత్రి అభ్యర్థి సీఎం కేసీఆర్.. మరి మీ పార్టీలో సీఎం ఎవరైతారు అని మొఖం పట్టుకుని అడిగినంత పని అవుతోంది.
బీసీ సీఎం నినాదంతో తెలంగాణలో ఎన్నికలకు వెళ్తోంది కమలం పార్టీ. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ఎక్కడా సీఎం అభ్యర్థులను ప్రకటించని బీజేపీ.. తెలంగాణ విషయంలో మాత్రం కొత్త వ్యూహాన్ని అమలు చేస్తోంది. తాము అధికారంలోకి వస్తే బీసీ నేతను ముఖ్యమంత్రిగా నియమిస్తామని బీజేపీ ప్రకటించింది. దీంతో తెలంగాణలోని బీసీలు తమవైపే ఉంటారన్న ధీమాలో ఉంది కమలం పార్టీ.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటి దాకా తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి లేరు. ఈసారి పార్టీ అధికారంలోకి వస్తే ఓబీసీకి అవకాశం ఇస్తామని.. 30 – 35 మంది ఉన్న సమావేశంలో తనవైపు చూస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారని అంటున్నారు ఈటల రాజేందర్. అటు కార్యకర్తలకూ ఇదే చెబుతూ వారిని ఉత్సాహపరుస్తున్నారు ఈటల రాజేందర్. ఈటల ఇలా మాట్లాడిన 24 గంటల్లోనే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ రియాక్టయ్యారు. సీఎం అవుతానని తానైతే చెప్పననీ.. ఎమ్మెల్యేల అభిప్రాయాల మేరకు పార్టీ అధిష్టానమే ముఖ్యమంత్రి అభ్యర్ధిని ప్రకటిస్తుందంటున్నారు బండి సంజయ్.
మొన్నటికి మొన్న ఖానాపూర్ నియోజకవర్గంలోని జన్నారం సభలోనూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఎంపీ బండి సంజయ్. ఆయన ప్రసంగం సందర్భంగా సీఎం.. సీఎం.. అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ నినాదాలే తన కొంపముంచాయని, ఉన్న పదవి పోయిందన్నారు బండి సంజయ్. తెలంగాణాలో బీజేపీ గెలిస్తే బీసీనే సీఎం అవుతారని, ఈ విషయాన్ని ప్రధాని మోదీ స్వయంగా ప్రకటించారని అన్నారు.
ఇదంతా బీజేపీ సంగతి.. ఇప్పుడు కాంగ్రెస్ విషయానికి వస్తే.. స్వేచ్ఛ, అంతర్గత స్వాతంత్ర్యం ఉన్న పార్టీ. ఈ నేపథ్యంలోనే ఎవరికి వారే సీఎం నేనంటే నేనని ప్రకటనలు చేసేస్తున్నారు. దసరా రోజు తాజా మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మనసులో మాట బయట పెట్టేశారు. తాజా మాజీ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క్ టీవీ9 వేదికగా సీఎం సీటుపై ఆశని చాటుకున్నారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఇలాంటి కామెంట్స్ చాలా చేశారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అయితే.. సీఎంగా తన తొలి సంతకం గురించి మాట్లాడడం అంతా చూస్తున్నాం. వీరందరికీ గట్టి కౌంటరే ఇచ్చారు ఆ పార్టీ సీనియర్ నేత వి. హన్మంత రావు. ముందు గెలిచిరండి.. సీఎం గురించి అధిస్టానం చూసుకుంటుందని హితవు పలికారు. మరో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి కూడా ఇలాంటి వ్యాఖ్యలనే చేశారు. మాకు సీఎం అభ్యర్థి కేసీఆర్.. మీకు ఎవరు అంటూ టీఆర్‌ఎస్ చేస్తున్న టీజింగ్‌ను తప్పుబట్టారు. తమది జాతీయ పార్టీ, అదంతా అధిస్టానం చూసుకుంటుందన్నారు.
బీజేపీలో లక్ష్మణ్, కిషన్‌రెడ్డి వంటి నేతలు కూడా సీఎం సీటుకు అర్హులే. కాంగ్రెస్‌లో నల్గొండ జిల్లా సీనియర్లంతా పోటీలోనే ఉంటారు. ఇలా ఎవరికి వారు సీఎం పదవిపై ఆశలు పెట్టుకుని, ఇటు పార్టీ విజయం కోసం కృషి చేయడంలో తేడా కొడితే, ఉన్నది పోతుంది..! అన్నీ పోతాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు..!!
Nov 12 2023, 11:19