నకిరేకల్: ప్రజా ఏజండా పై అభ్యర్థులను నిలదీయండి: CPI (M-L) న్యూడెమోక్రసీ
ఓట్ల కోసం గ్రామాలకు వచ్చే పాలకవర్గ పార్టీల అభ్యర్థులను ప్రజా సమస్యలపై,విద్య,వైద్యం, ఉపాధి అంశాలపై నిలదీయాలని CPI (M-L) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు ఎం.డేవిడ్ కుమార్ పిలుపునిచ్చారు.
నకిరేకల్ పట్టణంలోని కామ్రేడ్ యానాల మల్లారెడ్డి స్మారక భవనంలో శనివారం ప్రజా సంఘాల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. మద్యం, డబ్బు, కులం, మతం పేరుతో తప్పుడు మార్గంలో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, ఉచిత పథకాలు అంటూ ప్రలోభాలకు గురిచేసి గెలవలనుకునే పార్టీల అభ్యర్థులను ప్రశ్నించాలని అన్నారు. నిరుద్యోగం, నిరక్షరాస్యత, ఆకలి, దారిద్ర్యం, దోపిడీ, రైతుల ఆత్మహత్యలు, మహిళలపై దాడులు, మద్యం, డ్రగ్స్, గంజాయి లాంటివి తెలంగాణలో ఎక్కువగా రాజ్యమేలుతున్నాయని విమర్శించారు. వీటి నివారణకు ఏమి చర్యలు తీసుకున్నారో అడగండని అన్నారు. గతంలో రాని మార్పు ఈ సారి గెలిపిస్తే ఎలా సాధ్యం అవుతుందో ప్రశ్నించాలన్నారు.
ఈ కార్యక్రమంలో CPI (M-L) న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు ఇందూరు సాగర్, అఖిల భారత రైతు-కూలీ సంఘం జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు జ్వాల వెంకటేశ్వర్లు, అంబటి చిరంజీవి, పి.ఓ.డబ్ల్యూ జిల్లా కార్యదర్శి పజ్జూరి ఉపేంద్ర, పి.వై.ఎల్ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు మామిడోజు వెంకటేశ్వర్లు, బి.వి చారి,ఇఫ్టూ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు బొంగరాల నర్సింహా, బొమ్మిడి నగేష్, పి.డి.ఎస్.యూ జిల్లా కార్యదర్శి పోలె పవన్, ఏ. ఐ.కె.ఎం.ఎస్ జిల్లా నాయకులు సిలువేరు జానయ్య, అంబటి వెంకటేశం,కుంభం వెంకటేశం,బీరెడ్డి సత్తిరెడ్డి, అయోధ్య, చెరుకు సైదులు,పసుపులేటి సోమయ్య,బండారు వెంకన్న,అనిల్ తదితరులు పాల్గొన్నారు.
Nov 05 2023, 11:26