కాంగ్రెస్‌కు టాటా.. బీఆర్‌ఎస్ బాట..
కాంగ్రెస్‌కు టాటా.. బీఆర్‌ఎస్ బాట
ఆసెంబ్లీ ఎన్నికల ముంగిట కాంగ్రెస్ పార్టీలో కల్లోలం కొనసాగుతున్నది. కాంగ్రెస్‌కు చెందిన అనేక మంది నేతలు పార్టీని వీడటం అగ్రనాయకత్వాన్ని కలవరపెడుతున్నది.
ఒకవైపు రాహుల్‌గాంధీని తీసుకువచ్చి బస్సుయాత్ర చేస్తుండగా, మరోవైపు అదే ఊపులో పార్టీకి నేతలు గుడ్‌బై చెప్పడం కనిపిస్తున్నది.
టికెట్లలో అన్యాయంపై బీసీ నేతల గుర్రు
నిత్యం కాంగ్రెస్‌ను వీడుతున్న సీనియర్లు
దశాబ్దాలుగా సేవచేసినా పట్టించుకోలేదని ఆవేదన
ఏకంగా డీసీసీ అధ్యక్షులు కూడా రాజీనామా
బీఆర్‌ఎస్‌లోకి క్యూ కడుతున్న నాయకులు
త్వరలో మరిన్ని చేరికలుండే అవకాశం
అసెంబ్లీ ఎన్నికల ముంగిట కాంగ్రెస్ పార్టీలో కల్లోలం కొనసాగుతున్నది. కాంగ్రెస్‌కు చెందిన అనేక మంది నేతలు పార్టీని వీడటం అగ్రనాయకత్వాన్ని కలవరపెడుతున్నది. ఒకవైపు రాహుల్‌గాంధీని తీసుకువచ్చి బస్సుయాత్ర చేస్తుండగా, మరోవైపు అదే ఊపులో పార్టీకి నేతలు గుడ్‌బై చెప్పడం కనిపిస్తున్నది. సగం కూడా టిక్కెట్లు ప్రకటించకముందే పరిస్థితి ఇలా ఉంటే.. మొత్తం అసెంబ్లీ స్థానాలకు టిక్కెట్ల ప్రకటన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందోనని కాంగ్రెస్ కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు. అసలే ఎన్నికల్లో పోటీచేసే స్థాయి నేతలు లేక ఇబ్బందిపడుతున్న పార్టీకి, వర్గపోరు తలనొప్పిగా పరిణమించింది. పార్టీలో ముందు నుంచి పనిచేస్తున్న నేతలెవరూ ఇప్పుడు సంతోషంగా లేరని సమాచారం. అనేకమంది అసంతృప్త నేతలు అధికార భారత రాష్ట్ర సమితిలో చేరుతున్నారు. దీంతో కాంగ్రెస్ నాయకత్వం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది.
ప్రవాహంలా బీఆర్‌ఎస్‌లోకి నేతలు
కాంగ్రెస్‌లో అంతర్గత పోరు, వివక్ష నేపథ్యంలో ఆ పార్టీ నుంచి బీఆర్‌ఎస్‌లోకి నేతల ప్రవాహం కొనసాగుతూనే ఉన్నది. కొన్నాళ్లుగా ప్రతీ రోజూ కాంగ్రెస్ రాష్ట్రస్థాయి నేతల నుంచి జిల్లా, మండలస్థాయి నేతలవరకు బీఆర్‌ఎస్‌లో చేరుతూనే ఉన్నారు. గడిచిన 15-20 రోజుల నుంచి చేరికలు మరింత పెరిగాయి. ఏకంగా మూడు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు తమ అనుచరులతో సహా బీఆర్‌ఎస్‌లో చేరారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సైతం బీఆర్‌ఎస్‌లో చేరారు. మరికొద్ది రోజుల్లో కాంగ్రెస్, బీజేపీ నుంచి మరిన్ని చేరికలుండే అవకాశం ఉన్నది.
బీఆర్‌ఎస్‌లో చేరిన కీలక నేతలు
పొన్నాల లక్ష్మయ్య:పీసీసీ అధ్యక్షుడిగా, ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా, బీసీ నేతగా గుర్తింపు ఉన్న నాయకుడు. జనగామ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగా తనను అణచివేసే కుట్ర చేస్తున్నదని, రేవంత్‌రెడ్డి అక్కడి సీటును ఇతరులకు బేరానికి పెట్టాడని ఆరోపిస్తూ ఆయన బీఆర్‌ఎస్‌లో చేరారు.
కంఠారెడ్డి తిరుపతిరెడ్డి: మెదక్ డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న తిరుపతి రెడ్డి కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న అపసవ్య పరిస్థితులను చూసి ఆ పార్టీ నుంచి బయటకొచ్చారు. మెదక్ నియోజకవర్గంపై ఏమాత్రం అవగాహనలేని వ్యక్తిని తీసుకొచ్చి టిక్కెట్టు ఇవ్వడాన్ని నిరిసిస్తూ కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీఆర్‌ఎస్‌లో చేరారు.
నందికంటి శ్రీధర్:మేడ్చల్-మల్కాజ్‌గిరికి చెందిన నందికంటి శ్రీధర్ బీసీ బిడ్డ. ఐదేండ్లుగా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కోసం శ్రమపడ్డ ఆయనను కాదని మైనంపల్లి హన్మంతరావుకు టిక్కెటు ఇవ్వడంతో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న ఆయన పార్టీని వీడి బీఆర్‌ఎస్‌లో చేరారు. శ్రీధర్‌కు ఎంబీసీ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి ఇచ్చి బీఆర్‌ఎస్ గౌరవించుకున్నది.
పటేల్ ప్రభాకర్‌రెడ్డి:గద్వాలకు చెందిన పటేల్ ప్రభాకర్‌రెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న వ్యక్తి. ఆయన టిక్కెట్ ఆశించి భంగపడ్డారు. కాంగ్రెస్‌ను వీడి బీఆర్‌ఎస్‌లో చేరారు.
పీ శశిధర్‌రెడ్డి: కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత, మెదక్ మాజీ ఎమ్మెల్యే కూడా అయిన పట్లోళ్ల శశిధర్‌రెడ్డి ఇటీవలే బీఆర్‌ఎస్‌లో చేరారు.
గంట రాములు: పీసీసీ స్ట్రాటజీ కమిటీ సభ్యుడు, పెద్దపల్లి నియోజకవర్గం పరిధిలోని ఓదెల మండలం జడ్పీటీసీ సభ్యుడు గంట రాములు కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. నియోజకవర్గ స్థాయిలో బలమైన నేతగా ఈయనకు గుర్తింపు ఉన్నది.
కురువ విజయ కుమార్:పీసీసీ ప్రధాన కార్యదర్శి కురువ విజయ కుమార్ కాంగ్రెస్ పార్టీని వీడారు. పార్టీలో అడ్డగోలుగా టిక్కెట్లను అమ్ముకుంటున్నారని ఆరోపిస్తూ రాజీనామా చేశారు.
చింతపల్లి జగదీశ్వర్‌రావు: పీసీసీ సభ్యుడిగా ఉన్న చింతపల్లి జగదీశ్వరరావు, పార్టీ తీరుపై బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. ఆయన తన భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకునే పనిలో పడ్డారు. కాంగ్రెస్ పార్టీలో తనకు తీరని అన్యాయం జరిగిందని కార్యకర్తలతో సమావేశంపెట్టి మరీ వివరించారు.
రాగిడి లక్ష్మారెడ్డి:కాంగ్రెస్ సీనియర్ నేత. కమ్యూనిస్టు ఉద్యమాల నుంచి వచ్చిన నాయకుడు. ఉప్పల్ నియోజకవర్గంలో మంచి పేరున్నది. ఆయన కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్టు ప్రకటించాడు.
చెరుకు సుధాకర్:తెలంగాణ ఉద్యమ పోరాటంలో పీడీ యాక్టు కింద అరెస్టయిన తొలి వ్యక్తి. బీసీ నేత. కాంగ్రెస్ పార్టీలో బీసీలకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం, కొందరు ఉద్దేశపూర్వకంగా పార్టీ అధిష్ఠానాన్ని తప్పుదోవపట్టించడంపై ఆవేదనతో ఉన్నారు. ఆయన కూడా కాంగ్రెస్‌ను వీడారు.
జిట్టా బాలకృష్ణారెడ్డి: భువనగిరికి చెందిన తెలంగాణ ఉద్యమ నాయకుడు, యువజన సంఘాల నేత జిట్టా బాలకృష్ణారెడ్డి భువనగిరి టిక్కెట్టు ఆశించి కాంగ్రెస్‌లోకి వెళ్లారు. చివరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీ ఆయనను మోసం చేయడంతో పార్టీని వీడుతున్నారు. శుక్రవారం మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుల సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరనున్నారు.
సోమశేఖర్ రెడ్డి:ఉప్పల్ నియోజకవర్గానికి చెందిన సోమశేఖర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చురుకైన నేత. కార్పొరేటర్ కూడా. పార్టీ తీరు నచ్చక ఆయన బయటకు వచ్చారు.
నాగం జనార్ధన్‌రెడ్డి: మాజీ మంత్రి నాగం జానర్ధన్ తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొన్న వ్యక్తి. సీనియర్ నేత. ఈయనకు నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే సీటు రాకుండా చేసేందుకు వ్యూహం పన్నారు. కాంగ్రెస్ తీరుపై విసిగిపోయిన ఆయన పార్టీకి దూరమయ్యారు.
కొత్త మనోహర్‌రెడ్డి:మహేశ్వరానికి చెందిన కొత్త మనోహర్‌రెడ్డి అసెంబ్లీ టిక్కెట్లు అమ్ముకోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. పార్టీ తీరుపై బహిరంగంగా ఆరోపణలు చేశారు. పీసీసీ అధ్యక్షుడు టిక్కెట్లు అమ్ముకుంటున్నాడని ఆరోపించారు.
Oct 29 2023, 08:15