NLG: చర్లగూడెం,కిష్టరాంపల్లి ప్రాజెక్టులు వెంటనే పూర్తి చేయాలి: సిపిఎం డిమాండ్
మర్రిగూడ: పాలకులు వాగ్దానాలు తప్ప పనులు పూర్తి చేయడంలో విఫలం చెందారని, సంవత్సరాల తరబడి చర్లగూడెం కిష్టరాంపల్లి ప్రాజెక్టులను పూర్తి చేయడంలో విఫలం చెందారని, వెంటనే భూ నిర్వాసితులకు నష్టపరిహారం ఇచ్చి, ప్రాజెక్టులను పూర్తి చేయాలని సిపిఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున డిమాండ్ చేశారు.
ఈరోజు మర్రిగూడ మండలం సిపిఎం పార్టీ మండల కమిటీ సమావేశం నీలకంఠం రాములు అధ్యక్షతన మర్రిగూడ మండల సిపిఎం ఆఫీసులో జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన పాలడుగు నాగార్జున మాట్లాడుతూ.. భూ నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ద్వారా ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇచ్చి వెంటనే పరిహారం అందించాలని కోరారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలైన డబల్ బెడ్ రూమ్ ఇండ్లు, దళితులకు మూడెకరాల భూమి, దళిత బంధు, గృహ లక్ష్మీ లాంటి పథకాలు అమలు చేయడంలో విఫలం చెందారని ఆరోపించారు.
దళిత బంధు పేర్లు ప్రతిపాదన చేయడంలో గోరంగా విఫలం చెందారని విమర్శించారు. దేశ రాజకీయాలలో బిజెపి, ప్రజలను వంచించడానికి మరొకసారి మునుగోడులో ప్రయోగం చేయ చూస్తున్నదని, ప్రజలు తిప్పికొట్టాలని విమర్శించారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న పార్టీలను చిత్తుచిత్తుగా ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్నికలలో సిపిఎం తన సత్తా ఏమిటో చూపించనున్నట్లు తెలిపారు.
రాబోయే ఎన్నికల్లో గ్రామ గ్రామాన ప్రజలను చైతన్యవంతం చేస్తూ.. ఈనెల 28న మర్రిగూడ మండల కేంద్రంలో విస్తృత స్థాయి జనరల్ బాడీ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య, కొట్టం యాదయ్య, చల్లం ముత్యాలు, సత్తయ్య, చొప్పరి హనుమంతు, ఉప్పునూతల వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు.
Oct 20 2023, 13:57